యోగ సాధనలో అష్టాంగమార్గం

ABN , First Publish Date - 2020-08-17T08:01:37+05:30 IST

చిత్తవృత్తులను స్థిరంగానో, పాక్షికంగానో, పూర్ణంగానో నిరోధించడాన్నే యోగమంటారు. ఆలోచనలు క్రమంగా ఉన్నతమై కైవల్యం వైపు సాగుతుంటే..

యోగ సాధనలో అష్టాంగమార్గం

చిత్తవృత్తులను స్థిరంగానో, పాక్షికంగానో, పూర్ణంగానో నిరోధించడాన్నే యోగమంటారు. ఆలోచనలు క్రమంగా ఉన్నతమై కైవల్యం వైపు సాగుతుంటే.. మనసును దానిపై స్థిరంగా ఉంచడమే యోగలక్ష్యం. దీనివల్ల దుర్గుణ ప్రవృత్తులు క్రమంగా బలహీనమై పూర్తిగా నశిస్తాయి. మనసును ఉన్నత మార్గంలో నడిపించడానికి వివేక వైరాగ్యాలతో పాటు నైతిక ధర్మ శిక్షణ కూడా అవసరమని పతంజలి సూచించాడు. అందుకు యోగంలోని అష్టాంగాలే మార్గాలు. అవి.. యమము, నియమము, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. వీటిలో యమము అంటే ఇంద్రియనిగ్రహం. అహింస, సత్యం పలకడం, ఇతరుల ద్రవ్యంపై కోరిక లేకుండా ఉండడం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం(దేహధారణకు కావాల్సినదాన్ని మాత్రమే ఉంచుకోవడం. అంతకు మించి తీసుకోకపోవడం) అనే ఐదు మార్గాల్లో దీన్ని అనుష్ఠించాలి. ఇక.. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానాలను పాటించడం నియమం. సుఖంగా అనాయాసంగా ధ్యానించడానికి వీలుగా అనుకూల స్థితిలో శరీరాన్ని ఉంచడం శ్రేష్ఠమైన ‘ఆసనం’ అని పతంజలి మహర్షి నిర్దేశం.


 ఇది మనస్సు ఏకాగ్రతతో, నిశ్చలంగా ఉండడానికి ఉపకరిస్తుంది. ప్రాణాయామం ఉచ్ఛ్వాస, నిశ్వాసలకు సంబంధించిన నియమం. దీనివల్ల మనసు నిశ్చలమవుతుంది. ప్రాణాయామంలో.. శ్వాసను క్రమపద్ధతిలో నెమ్మదిగా లోపలికి పీల్చడం పూరకం, పీల్చిన గాలిని క్రమపద్ధతిలో బయటకు వదలడం రేచకం, పీల్చిన గాలిని వెంటనే వదలక కొంతసేపు స్తంభింపజేస్తే దాన్ని కుంభకం అంటారు. ఇక ప్రత్యాహారం అంటే ఇంద్రియాల నుంచి మనసును మరల్చడం. విషయభోగాలపై ఆసక్తి పెంచుకునే ఇంద్రియాలను నిగ్రహించి అంతర్ముఖమొనరించే ప్రయత్నం జరుగుతుంది. ఇంద్రియాలకు ఉపశమనాన్ని కలిగించి వాటి ద్వారా మనసును స్వాధీనపరచుకోవడం ప్రత్యాహారంలో ప్రముఖ భాగం. ధారణమంటే మనసును ఆత్మయందు ధరించడం. చలనమే ప్రవృత్తిగా గల మనసును ఒక లక్ష్యంలో నిలిపి నియతం గావించడమే ధారణ లక్ష్యం. ధ్యానమంటే వేరే ఏ ఆలోచనలనూ మనసులోకి రానివ్వకుండా ధారాప్రవాహంగా మనోప్రవృత్తులను సాధనవైపు నడపడం. ఈ ప్రయత్నాలన్నింటివల్ల సిద్ధించే ఫలితమే సమాధి.


 యోగంలో చరమ దశ సమాధి. సమాధిలో రెండు రకాలున్నాయి. ఒకటి.. సంప్రజ్ఞాత సమాధి, రెండు.. అసంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత సమాధిలో మనసు పూర్తిగా సంలగ్నమైనా.. దానిలో మనోవ్యాపారమైన చింతన ఉంటుంది. ఈ దశలో ధ్యేయ వస్తువు, చైతన్యత భేదాలు పూర్తిగా నశించవు. అసంప్రజ్ఞాత సమాధి.. పూర్తిగా చరమ దశ. ఈ దశలో మనసు పూర్తిగా పరమాత్మలో లయిస్తుంది. ఇది జీవన్ముక్తి దశ. జీవాత్మ సహజస్వరూపాలను గుర్తించి ఆ స్థితిలో ఉండిపోవడమే జీవన్ముక్తి. దేహధారిగా ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడే.. దేనితోనూ సంబంధం లేకుండా తన స్థితిలో తాను ఉండిపోవడమే కైవల్యం. మరణంతో దేహం నశంచగానే విదేహ ముక్తి కలుగుతుంది. అంటే దేహం నుండి జీవునికి విముక్తి కలుగుతుంది. ఈ విముక్తినే కైవల్యస్థితి అంటుంది యోగా.

- డా. వెల్లాల వెంకటేశ్వరా చారి, 8919142544



Updated Date - 2020-08-17T08:01:37+05:30 IST