యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: డాక్టర్ ఎం.నాగలక్మి

ABN , First Publish Date - 2021-06-21T23:30:09+05:30 IST

పౌష్టికాహారం తీసుకుంటూ, శరీరానికి ఎక్కువ శ్రమ కలిగించని తేలికపాటి యోగాసనాలు, కొన్ని ప్రాణాయామాలు చేయటం ద్వారా కోవిడ్ సోకిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చని రాష్ట్ర ప్రభుత్వ నేచర్ క్యూర్ హాస్పిటల్ లో సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం. నాగలక్మి అన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: డాక్టర్ ఎం.నాగలక్మి

హైదరాబాద్: పౌష్టికాహారం తీసుకుంటూ, శరీరానికి ఎక్కువ శ్రమ కలిగించని తేలికపాటి యోగాసనాలు, కొన్ని ప్రాణాయామాలు చేయటం ద్వారా కోవిడ్ సోకిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా బయట పడవచ్చని  రాష్ట్ర ప్రభుత్వ నేచర్ క్యూర్ హాస్పిటల్ లో సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్  ఎం. నాగలక్మి అన్నారు.  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి), పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి) సంయుక్తంగా ‘‘కోవిడ్ పునరావాసానికి యోగ సాధన’’ అనే అంశం పై నిర్వహించిన వెబినార్ లో ముఖ్య వక్తగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగలక్ష్మి ప్రసంగిస్తూ, కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత విపరీత మైన నీరసం, ఆకలి మందగించటం, నిద్రలేమి, మానసిక ఆందోళన, భయం మతిమరుపు లాంటి సమస్యలు వేధిస్తుంటాయని  చెప్పారు. 


ఈ సమయంలో త్వరగా తిరిగి కొలుకోవాలంటే బలవర్ధకమైన ఆహారం రోజుకి కనీసం రెండుసార్లు తప్పకుండా తీసుకోవాలని చెప్పారు. జింక్ లాంటి మినరల్స్ అధికంగా ఉండే గుమ్మడి గింజలు, నువ్వులు లాంటివి, పల్చటి మజ్జిగ, పండ్లు ఎక్కువగా ఆహారంలో ఉండేటట్లు చూసుకోవాలని అన్నారు. చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలు, ఇతర ఆహార పదార్థాలు తీసుకోవద్దని, మద్యం తదితర మత్తు పానీయాలు సేవించవద్దని సూచించారు. ఎండలో  ప్రతి రోజు 10 నిమిషాలు అయినా ఉండాలని, నిద్రించేటప్పుడు 20 నిమిషాలకు ఒకసారైనా పడుకునే స్థితిని మార్చుకుంటూ ఉండాలన్నారు. గోరువెచ్చటి నీటితో తడి బట్టను ఉపయోగించి ఒళ్ళంతా మర్దన చేసుకొని అనంతరం స్నానమాచరించాలని తద్వారా  మన శరీరంలోని రక్షణ వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు.  


వీటితోపాటు అనులోమ, విలోమ, బ్రామరి, శీతలి ప్రాణాయామాలు చేయాలని తెలిపారు. తేలికపాటి యోగాసనాలైన మకారాసన, అష్టాంగసన, వజ్రాసన, భద్రాసన, బాలసన, శశాంకాసన , పశ్చమోత్తానాసనాలను ప్రతి రోజూ వేయాలని చెబుతూ ప్రదర్శనాత్మకంకగా వివరించారు. యమ, నియమాలు, ముద్రలు వాటి ప్రయోజనాలను గురించి కూడా తెలియజేశారు. ప్రాచీన భారతీయ సంస్కృతిలో భాగమైన యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత  భారతదేశానికే చెందుతుందని అన్నారు.కోవిడ్ సంక్షోభ సమయంలో యోగాకు ప్రాధాన్యత  పెరగటమే కాకుండా, ఆచరించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని అన్నారు.

Updated Date - 2021-06-21T23:30:09+05:30 IST