ఇమ్యూనిటీ యోగం!

ABN , First Publish Date - 2020-06-21T05:30:00+05:30 IST

ప్రస్తుత కరోనా కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుంది. యోగా అందరికీ అనువైన ఆరోగ్య విధానం. ఇది శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనిషిని దృఢంగా చేస్తుంది...

ఇమ్యూనిటీ యోగం!

ప్రస్తుత కరోనా కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుంది. యోగా అందరికీ అనువైన ఆరోగ్య విధానం. ఇది శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనిషిని దృఢంగా చేస్తుంది. అంతేకాదు, లాక్‌డౌన్‌ సమయంలో ఇల్లు కదలకుండానే యోగా చేసుకోవచ్చు. ఒత్తిడి తగ్గించడానికో, మానసిక ఆరోగ్యానికో మాత్రమే కాదు... యోగాను సరైన రీతిలో పాటిస్తే శరీరం రీఛార్జ్‌ అవుతుంది. ఒంట్లోని విషపూరిత పదార్థాలూ, నెగెటివ్‌ ఎనర్జీ తొలగిపోతాయి. శరీరంలోని కీలకమైన అవయవాలు చక్కగా పని చేస్తాయి. కొన్ని యోగాసనాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యవంతమైన కణాలకు ఆక్సిడేషన్‌ వల్ల కలిగే ఒత్తిడిని దూరం చేస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. కరోనా వైరస్‌ ముప్పును నిరోధించే కొన్ని యోగాభ్యాసాలు ఇవి... 


  • నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం



ప్రాణాయామం


ప్రాథమిక యోగా భంగిమల్లో ఒకటైన ప్రాణాయామం రోగనిరోధకశక్తిని పెంచడానికి దోహదపడే సులువైన పద్ధతుల్లో ఒకటి. అది శరీరానికి సానుకూలమైన శక్తినీ, ధారుఢ్యాన్నీ అందిస్తుంది. ప్రాణాయామం, సుఖాసనం... ఈ రెండిటిలోనూ లోతుగా ఊపిరి తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఒత్తిడి కలిగించే హార్మోన్లు ఉపశమిస్తాయి. హార్ట్‌ రేటు, నాడీ సంబంధమైన సమస్యలూ తగ్గుతాయి. 


ఎలా చేయాలి?

  1. సౌకర్యంగా కూర్చోండి. కాళ్ళు చాచండి లేదా నేల మీద మోకాళ్ళపై కూర్చోండి. నడుము, వీపు, వెన్నెముక, మెడ నిటారుగా ఉంచండి.
  2. వెన్నెముక నిటారుగా అయ్యే వరకూ ఊపిరి గాఢంగా తీసుకోండి. తరువాత మెల్లగా ఊపిరిని విడిచిపెట్టండి.
  3. అదే భంగిమలో ఉండి, కనీసం పది సార్లు ఇలా చెయ్యండి.





ఉత్థానాసనం

ఊపిరి సరిగ్గా అందని సమస్య ఉన్నవారికి ఇది గొప్ప ఊరట ఇస్తుంది. సైనస్‌, శ్లేష్మ పొరలను పరిరక్షిస్తుంది. కరోనా బారిన పడకుండా కాపాడుకోవడానికి ఇవే కీలకం. ఈ ఆసనంలో నేలవైపు వంగాల్సి ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకొనే సులువైన మార్గాల్లో ఈ ఆసనం ఒకటి. పొట్ట దగ్గర కొవ్వు కూడా దీనివల్ల కరుగుతుంది.


ఎలా చేయాలి? 

  1. నిటారుగా నిలబడండి. మెల్లగా కిందకు వంగండి. 
  2. చేతుల్ని మోకాళ్ళ మీద నుంచి కొంచెం కొంచెం దించుతూ నేల వరకూ తీసుకురండి. తలను మోకాళ్ళ వరకూ తీసుకురండి. 
  3. కాళ్ళ వెనుక భాగాలను చేతులతో పట్టుకోండి.  
  4. కొత్తగా ప్రారంభించేవారు మొదట మోకాళ్ళ పైభాగంలో చేతులు ఉంచి, మెల్లగా కిందికి తీసుకురావడం ప్రాక్టీస్‌ చెయ్యండి. 
  5. ఈ భంగిమలో రెండు నుంచి మూడు నిమిషాలు ఉండండి.





మత్స్యాసనం


రోగనిరోధక శక్తిని పెంచే ఆసనం మత్స్యాసనం. ఇది శరీరంలో ఎనర్జీ స్థాయులను పెంచుతుంది. శరీరాన్ని డీ-టాక్స్‌ చేస్తుంది. ముక్కులోంచీ ఊపిరి ప్రవేశించే మార్గాలు పూర్తిగా తెరచుకొనేలా చేస్తుంది. ఊపిరి సరిగ్గా ఆడని సమస్యను నివారిస్తుంది. శ్వాసకోశాలు దీనివల్ల పటిష్ఠం అవుతాయి. 


ఎలా చేయాలి?

  1. పద్మాసనంతో మొదలుపెట్టండి.
  2. మోచేతుల సాయంతో వెనక్కు పడుకోండి. 
  3. తలను నేలకు తాకించండి. చేతులతో పాదాలను పట్టుకోండి. 
  4. ఈ భంగిమలో రెండు నుంచి మూడు నిమిషాలు ఉండండి. 
  5. మెడ మీద ఒత్తిడి పడకుండా చూసుకోండి.




విపరీతకరణి

కాళ్ళను గోడ ఎత్తుకు పైకి లేపి చేసే యోగ భంగిమను ‘విపరీతకరణి’ అంటారు. ఇది నాడీ వ్యవస్థ మధ్య సంబంధాలను మెరగుపరుస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. శరీరాన్ని పటిష్ఠం చేస్తుంది. కాళ్ళ వాపులనూ, కాళ్ళు బిగబట్టడాన్నీ నివారిస్తుంది. వెన్ను సంబంధమైన సమస్యలను దూరం చేస్తుంది. 


ఎలా చేయాలి?

  1. నేల మీద యోగా మ్యాట్‌ లేదా దుప్పటిని పరుచుకోండి. దాని మీద కూర్చొని, గోడ వైపు తిరగండి. 
  2. మీ కాళ్ళను గోడకు ఆనించి మెల్లగా పైకి లేపండి. మీరు అభ్యాసం ప్రారంభస్థితిలో ఉన్నప్పుడు పూర్తిగా ఒకేసారి పైకి లేవకండి.
  3. మీ వెన్ను మీదా, తొడ కండరాల మీదా ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకోండి. తలను సౌకర్యవంతంగా ఉంచుకోండి. 
  4. ఈ భంగిమలో అయిదు నుంచి పదిహేను నిమిషాలపాటు ఉండండి. అభ్యాసం చేస్తూ ఉంటే గోడ సాయం లేకుండా ఈ ఆసనం వేయడం అలవాటవుతుంది.

Updated Date - 2020-06-21T05:30:00+05:30 IST