కొట్టి చంపి కట్టుకథలా?

ABN , First Publish Date - 2022-05-25T08:15:36+05:30 IST

వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్‌భాస్కర్‌కు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఆర్‌పీ నంబర్‌ 9204 కేటాయించారు.

కొట్టి చంపి కట్టుకథలా?

సుబ్రహ్మణ్యం హత్య కేసులో అసలు నిజాలకు పాతర

కొట్లాటగా కేసును నీరుగార్చే స్కెచ్‌! 

పోలీసుల డైరెక్షన్‌లోనే ఎమ్మెల్సీ కథనం


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ పోలీసులకు చెప్పిన కథను పథకం ప్రకారమే వండి వార్చారా? ఇంటరాగేషన్‌ సమయంలో పోలీసు అధికారుల సమక్షంలోనే కట్టుకథ అల్లారా? హత్య కేసును కొట్లాట కేసుగా చిత్రీకరించేందుకు ఈ ఎత్తు వేశారా? కేసు తీవ్రతను తగ్గించేందుకు పోలీసులే ఇదంతా చేశారా..? పొంతన కుదరని పోలీసుల కథనం అవుననే బదులిస్తోంది. ఉదయ భాస్కర్‌ నివసిస్తున్న కొండయ్యపాలెంలోని అపార్ట్‌మెంట్‌ సమీపంలో  సుబ్రహ్మణ్యానికి, ఆయనకు మధ్య గొడవ జరిగిందని, కోపంతో కొట్టి నెట్టడంతో... గేటు తలకు తగిలి, గాయపడి డ్రైవర్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని సోమవారం కాకినాడ ఎస్పీ తెలిపారు. దీనిపై అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ శ్రీనుతో ‘ఆంధ్రజ్యోతి’  మాట్లాడింది.  ఆ రోజు ఉదయభాస్కర్‌ సాయంత్రం 4 గంటలకు బయటకు వెళ్లి రాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చి దుస్తులు మార్చుకుని మళ్లీ వెళ్లిపోయారని శ్రీను పేర్కొన్నారు. పోలీసులు చెబుతున్నట్టు రాత్రి 8 నుంచి 11 మధ్య ఇంటి దగ్గర్లో ఎలాంటి గొడవా  జరగలేదన్నారు. మరోపక్క వందల కోట్లకు పడగలెత్తిన ఉదయభాస్కర్‌ రూ.20వేల కోసం డ్రైవర్‌ను హత్య చేశాడంటే  నమ్మశక్యంగా  లేదని ఆయన పార్టీ వర్గాలే అంటున్నాయి.


తమ కుమారుడిని ఇంటినుంచి ఉదయభాస్కర్‌ తీసుకువెళ్లినట్లు సుబ్రహ్మణ్యం తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ సుబ్రహ్మణ్యం ఎక్కడో దారిలో తాగి కనిపిస్తే కారులోకి ఉదయ భాస్కర్‌ ఎక్కించుకున్నాడని ఎస్పీ చెప్పారు. మద్యం తాగిన ఆనవాళ్లు లేవని, తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో ఉంది. శరీరంపై 30 గాయాలు ఉన్నట్లు గుర్తించారు. సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించేందుకు ఎమ్మెల్సీయే మృతదేహంపై ఆ గాయాలు చేసినట్లు ఎస్పీ చెప్పడం గమనార్హం. హత్య జరిగిన రోజు ఉదయభాస్కర్‌ గన్‌మెన్‌ ఎక్కడ ఉన్నారనేది ఇప్పటికీ గుట్టుగానే ఉంచారు. ఎమ్మెల్సీకి రక్షణగా ఇద్దరు గన్‌మెన్‌ ఉన్నారు. ఆ రోజు రాత్రి వారు ఏమైనట్లు? హత్య జరిగిన చోట వీరు కూడా ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గన్‌ మెన్‌ లేకుండా ఉదయభాస్కర్‌ బయటకు వెళ్తే వాళ్లు పైఅధికారులకు సమాచారం ఇచ్చారో లేదో తెలియదు. ఆ  ఇద్దరినీ సస్పెండ్‌ చేసినట్టు పోలీసు బాస్‌ ప్రకటించారు. కానీ అధికారికంగా చెప్పడం లేదు. ఈ ఇద్దరిని విచారిస్తే కచ్చితంగా నిజాలు బయటకు రావచ్చు. కానీ పోలీసులు వీరిని విచారిస్తున్నారో లేదో తెలియడం లేదు.


ఖైదీ నంబర్‌ 9204


అనంతబాబుకు జైలులో  కేటాయింపు

ముగ్గురున్న బ్యారక్‌లో ఎమ్మెల్సీ 


రాజమహేంద్రవరం, మే 24 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్‌భాస్కర్‌కు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఆర్‌పీ నంబర్‌ 9204 కేటాయించారు. ముగ్గురు ఖైదీలున్న బ్యారక్‌లో తొలిరోజు గడిపారు. 302, 201 సెక్షన్లతోపాటు అట్రాసిటీ చట్టం కింద ఆయన రిమాండ్‌కు వచ్చారని సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. భోజన వసతిపై ఆరా తీయగా, ఎవరికైనా ఇక్కడి భోజనమే పెడతామని, అనంతబాబుకు తొలిరోజు చపాతీ ఇచ్చామని తెలిపారు.

Updated Date - 2022-05-25T08:15:36+05:30 IST