వరవరరావు నాకు రాజకీయ గురువు: కరుణాకర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-07-18T21:48:54+05:30 IST

విరసం నేత వరవరరావును కాపాడాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి లేఖ రాశారు. ఎమర్జెన్సీ సమయంలో

వరవరరావు నాకు రాజకీయ గురువు: కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: విరసం నేత వరవరరావును కాపాడాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి లేఖ రాశారు. ఎమర్జెన్సీ సమయంలో వరవరరావుతో తనకున్న అనుబంధాన్ని లేఖలో గుర్తుచేశారు. ఎంతో బరువెక్కిన హృదయంతో రాసినట్లు అనిపిస్తున్న.. ఈ లేఖ ఎవరినైనా కదిలించేలా ఉంది. 


‘‘వరవరరావు నిర్బంధం, అనారోగ్యం గురించి మీకు తెలిసే ఉంటుంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఆయన బందీగా ఉన్నారంటే హృదయం చెమ్మగిల్లుతోంది. 48 సంవత్సరాల క్రితం నాలో రాజకీయ ఆలోచనల అంకుర్భావ దశలో నాకు లభించిన ఎందరో గురువులలో ఆయనా ఒకరు. నలభై‌ ఆరు సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు, నేను ఇరవై ఒక్క నెలలు ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు ఆయన మన సహచరుడు. సాహచర్యం భావజాలంలో కాదు గానీ, కటకటాల వెనుక కలిసి ఉన్నాము, రాజకీయ సిద్ధాంతంలోనూ, జనక్షేమంకై నడిచే మార్గంలోనూ ఎవరి భావాలు వారివే. కానీ మనం మనుషులం. శరీరం మంచానికి కట్టుబడే 81 సంవత్సరాల వయసులో, అందులోనూ అనారోగ్యంతో ఉన్న ఆయనపైన ప్రభుత్వం దయ చూపాల్సిన అవసరం ఎంతో ఉంది. యాభై మూడు సంవత్సరాలుగా అడవులలో ఆయుధాలు పట్టుకుని తిరిగే సాయుధులు సాధించలేని విప్లవం మంచం పట్టిన వృద్ధుడు సాధించగడా ?.  ఈ స్థితిలో ఆయన ఇంకా నిర్బంధంలో ఉంచడం అవసరమా?  రాజకీయాలతో సంబంధం సంబంధం లేకుండా మానవాళి మంచికి ఎన్నో కార్యక్రమాలు చేసిన మీరు దయతో ఆలోచించండి. రాజ్యం ఇంత కాఠిన్యమా, న్యాయం  ఇంత సుదూరమా అని ఏ మేధావి ఈ దేశంలో భావించకూడదు. అహింసయే పరమ ధర్మం, శత్రువులు సైతం క్షమించాలి, వేదాంత వారసత్వ భారతదేశపు ఉప రాష్ట్రపతి అయిన మీరు... వరవరరావు విడుదల విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని సజల నయనాలతో విన్నవించుకుంటున్నాను. అనారోగ్యంతో అడుగులు తడబడుతూ నిస్సహాయంగా ఉన్న ఓ సిద్ధాంతం నిబద్ధ వృద్ధుడిని ప్రజాస్వామ్యవాదులులైన మీరు సానుభూతితో కాపాడమని కోరుకుంటున్నాను’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు.





Updated Date - 2020-07-18T21:48:54+05:30 IST