Abn logo
Jun 30 2020 @ 10:26AM

వైసీపీ ఎమ్మెల్యే నిర్ణయాలతో రెండు వర్గాలైన పార్టీ..?

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నిర్ణయాలు ఎందుకు వివాదస్పదం అవుతున్నాయి? ఎమ్మెల్యే తీరుపై ఎలాంటి విమర్శలు వినిపిస్తున్నాయి? స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎమ్మెల్యే వ్యూహం ఎక్కడ బెడిసికొట్టింది? పి.గన్నవరం వైసీపీలో క్యాడర్‌ రెండు వర్గాలుగా ఎందుకు చీలిపోయింది? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో తెలుసుకోండి.


    తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తీసుకుంటున్న నిర్ణయాలు, పాటిస్తున్న విధానాలు తరచూ వివాదాస్పదం అవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించే స్థాయిలో ఆయన నిర్ణయాలు ఉండటంతో ఈ అంశం పార్టీలో కూడా చర్చకి దారితీస్తోంది. నియోజకవర్గంలో తన ముద్ర ఉండాలన్న పట్టుదలతో ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారని కొందరు చెప్పుకుంటున్నారు. 


    ఈ మధ్య స్థానిక ఎన్నికల సందడి మొదలైనప్పుడు ఎమ్మెల్యే కొండేటి వ్యవహారశైలి దుమారం రేపింది. విషయం ముఖ్యమంత్రి జగన్ వరకూ వెళ్ళింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే పెద్దకుమారుడు వికాస్‌కు అయినవిల్లి జడ్పీటీసీ స్థానాన్ని ఆయన కేటాయించుకున్నారు. మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ ఈ అంశాన్ని ప్రకటించారు. పి.గన్నవరం, అంబాజీపేట, మామిడికుదురు, అయినవిల్లి జడ్పీటీసీ స్థానాలను ఎమ్మెల్యే తనకు నచ్చిన వారికే కేటాయించుకున్నారని పార్టీ వర్గాలు సైతం చెప్పుకున్నాయి. అయితే స్థానిక వైసీపీలోని కొందరు ముఖ్యులు ఈ పరిణామాన్ని వ్యతిరేకించడంతో పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నిర్ణయించిన వారిని కాదని వైసీపీ హైకమాండ్‌ వేరే వారిని అభ్యర్థులుగా నిర్ణయించింది. దీంతో పి.గన్నవరం ఎమ్మెల్యే తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పార్టీ బీ-ఫారాలు తన వద్ద ఉంచుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నియోజకవర్గ వైసీపీ నేతలు మరోసారి ఈ విషయాన్ని జగన్‌ దృష్టికి తెచ్చారు. దీనిపై సీఎం యమ సీరియస్‌ అయ్యారు. ఇక చేసేది ఏంలేక  ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అజ్ఞాతం వీడి బయటికొచ్చారు. పార్టీ పెద్దలు నిర్ణయించిన అభ్యర్థులకే బీ-ఫారాలు అందజేశారు. కనీసం తన కుమారుడుకి కూడా జడ్పీటీసీ స్థానాన్ని ఎమ్మెల్యే దక్కించుకోలేకపోవడం గమనార్హం.


    ఇప్పుడు మరొక ఉదంతంలోకి వద్దాం. కరోనా కారణంగా ఈ మధ్యకాలంలో లాక్‌డౌన్‌ కొనసాగిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలోనే లాక్‌డౌన్ నిబంధనలను ఎమ్మెల్యే చిట్టిబాబు అతిక్రమించారన్న ఆరోపణలొచ్చాయి.  సోషల్ డిస్టెన్స్ పాటించకుండా.. కనీసం మాస్కులు కూడా ధరించకుండా "నగరం మార్కెట్ కమిటీ'' ఛైర్మన్ ఎన్నికలు జరిపించారు. ఈ వ్యవహారం కూడా వివాదాస్పదం అయ్యింది. ఎమ్మెల్యే తన కారుకు నెంబరు ప్లేట్‌కు బదులు "ఏపీ సీఎం జగన్'' అన్న బోర్డు పెట్టుకోవడం పైనా విమర్శలు చెలరేగాయి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సైతం అసహనం వ్యక్తంచేశారట. ఈ అంశంపై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారం కావడంతో ఎమ్మెల్యే తన కారుకి ఏర్పాటు చేసుకున్న "ఏపీ సీఎం జగన్'' అన్న బోర్డును తొలగించక తప్పలేదు.


    పి.గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల నియోజకవర్గ పార్టీ నేతలు రెండు గ్రూపులుగా చీలిపోయారన్న టాక్‌ కూడా ఉంది. సోషల్ మీడియా వేదికగా ఈ రెండు గ్రూపులు విమర్శలకి దిగుతున్నాయి. పార్టీలో మొదటినుంచి కష్టపడిన వారికి కాకుండా తన బంధువులకు, సన్నిహితులకు ఎమ్మెల్యే చిట్టిబాబు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదనలున్నాయి. పి.గన్నవరంలో ఇళ్ల స్థలాలను మెరక చేసే నెపంతో తన సన్నిహితుల ద్వారా ఇసుక మాఫియాను కూడా ఎమ్మెల్యే నడిపిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 


    ఆ మధ్య ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కుమారుడు వికాస్ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న తీరు కూడా వార్తల్లోకి ఎక్కింది. అంబాజీపేట సెంటర్లో నడిరోడ్డుపై నాలుగు గంటలపాటు ఈ వేడుకలు నిర్వహించడంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘటన కూడా ఎమ్మెల్యే చిట్టిబాబుకి చెడ్డ పేరు తెచ్చిందని లోకల్ టాక్‌! మొత్తానికి ఇదండీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కథాకమామిషు. మరి ఈయనగారిని పార్టీ పెద్దలు ఎలా కట్టడిచేస్తారో చూడాలి! 

Advertisement
Advertisement
Advertisement