టీడీపీ లాయర్లే జడ్జిలయ్యారు

ABN , First Publish Date - 2020-09-19T09:36:19+05:30 IST

న్యాయవ్యవస్థపై పార్లమెంటులో వైసీపీ వరుసగా రెండోరోజూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. దానికి, టీడీపీకి ముడిపెట్టి వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి శుక్రవారం లోక్‌సభలో ఆరోపణలు చేస్తుండగా..

టీడీపీ లాయర్లే జడ్జిలయ్యారు

నిష్పాక్షిక తీర్పులు ఆశించలేం

కొలీజియం వ్యవస్థను పునఃపరిశీలించాలి

వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి 

సిట్‌ దర్యాప్తుపై స్టే ప్రస్తావన

పత్రికా ప్రకటనలు, పేర్లు చదవొద్దని ప్యానెల్‌ స్పీకర్‌ సూచన

రికార్డుల నుంచి తొలగించేందుకు మిథున్‌ వ్యాఖ్యల పరిశీలన


న్యూఢిల్లీ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): న్యాయవ్యవస్థపై పార్లమెంటులో వైసీపీ వరుసగా రెండోరోజూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. దానికి, టీడీపీకి ముడిపెట్టి వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి శుక్రవారం లోక్‌సభలో ఆరోపణలు చేస్తుండగా.. టీడీపీ ఎంపీలు అడ్డుకున్నారు. అనుబంధ పద్దులపై చర్చ సందర్భంగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. టీడీపీకి న్యాయవాదులుగా వ్యవహరించిన వారు న్యాయమూర్తులు అయ్యారని.. కాబట్టి నిష్పక్షపాత తీర్పులను ఆశించలేమని వ్యాఖ్యానించారు. చట్టసభల అధికారాలను న్యాయవ్యవస్థ తీసుకోరాదని.. రాష్ట్ర ప్రయోజనాలను కాపావాలని కేంద్రాన్ని కోరారు. అమరావతి భూముల్లో అక్రమాలకు సంబంధించి సిట్‌ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించిందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఏసీబీ కేసును ప్రస్తావించారు. న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థను పునఃపరిశీలించాలని అన్నారు. అమరావతి భూముల కొనుగోళ్ల ఆరోపణలపై, ఫైబర్‌ గ్రిడ్‌ నిధుల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు.


బీజేపీ రాష్ట్ర శాఖ కూడా ఇదే డిమాండ్‌ చేసిందన్నారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతున్నంత సేపూ టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌ రామ్మోహన్‌నాయుడు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఐటీ సోదాల్లో రూ.2 వేల కోట్ల లెక్కకు రాని (అన్‌అకౌంటెడ్‌) డబ్బు ఉన్నట్లు గుర్తించామని, ప్రముఖ వ్యక్తి వ్యక్తిగత కార్యదర్శి నుంచి ఆధారాలు స్వాధీనం చేసుకున్నామని ఫిబ్రవరిలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు పత్రికా ప్రకటన విడుదల చేసిందని చెప్పారు. ఈ ప్రముఖ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అని చెప్పబోతుండగా.. సభాధ్యక్ష స్థానంలో ఉన్న ప్యానెల్‌ స్పీకర్‌ ఎన్‌.కె.ప్రేమచంద్రన్‌ అడ్డుకున్నారు. పత్రికా ప్రకటనలను, సభలో లేని వారి పేర్లను సభలో ప్రస్తావించవద్దని స్పష్టం చేశారు. మిథున్‌ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించేందుకు పరిశీలిస్తానని తెలిపారు.


రాష్ట్రాన్ని ఆదుకోండి..

కరోనాతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని మిథున్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్‌ నుంచి జీఎస్టీ పరిహారాన్ని చెల్లించడం లేదని, రూ.4,594 కోట్లు రావలసి ఉందని చెప్పారు. 2017-18లో రూ.237 కోట్లు, 2019-20లో మరో రూ.32 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ నిధులను విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి నాబార్డులో రివాల్వింగ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 6-7 నెలల నుంచి ప్రాజెక్టుకు నిధులు రావడం లేదని తెలిపారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించడానికీ నిధులివ్వాలని కోరారు. స్థానిక సంస్థలకు రూ.2,279 కోట్లు ఇవ్వాలని అన్నారు. చివరిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-09-19T09:36:19+05:30 IST