విత్తనంపైనా వైసీపీ పెత్తనం

ABN , First Publish Date - 2022-07-07T08:33:13+05:30 IST

విత్తనంపైనా వైసీపీ పెత్తనం

విత్తనంపైనా వైసీపీ పెత్తనం

ఆర్బీకేల్లో పత్తి విత్తనాలు బ్లాక్‌ మార్కెట్‌

బినామీ పేర్లతో సేకరించి అధిక ధరకు అమ్మకం 

రైతుల ముసుగులో అక్రమార్కుల దందా


(అమరావతి-ఆంధ్రజ్యోతి)  

మట్టి, ఇసుక మాదిరిగానే ఇప్పుడు పత్తి విత్తనాలపై అక్రమార్కుల కన్ను పడింది. బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌గా ఉన్న హైబ్రిడ్‌ పత్తి విత్తనాలను రైతు ముసుగులో పెద్ద మొత్తంలో సేకరించి, బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ విక్రయిస్తున్న పత్తి విత్తనాలను కొందరు బినామీ పేర్లుతో తీసుకుంటున్నారు. ఒక్కో రైతు పేరుతో పదుల సంఖ్యలో పత్తి విత్తనాల ప్యాకెట్లను బుక్‌ చేస్తున్నారు. ఆర్బీకే సిబ్బందిని ఒత్తిడి చేసి, ఎమ్మార్పీ రేటుకు తీసుకున్న పత్తి విత్తనాలను బయట మార్కెట్‌లో అధిక ధరకు అమ్ముకుంటున్నట్లు తెలిసింది. అంతేగాకుండా తమకు అనుకూలురైన రైతులకే విత్తనాలు అందించేలా అధికార పార్టీ నేతలు ఆర్బీకేల్లో చక్రం తిప్పుతున్నారు. రాజధాని పరిసర ప్రాంతాల్లోని కొన్ని ఆర్బీకేల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పత్తి అధికంగా సాగు చేసే పల్నాడు, ప్రకాశం, కర్నూలు, ఎన్టీఆర్‌ జిల్లాలోని ఆర్బీకేల్లోనూ ఈ తరహా వ్యవహారం జరుగుతున్నట్లు సమాచారం. 450 గ్రాముల  హైబ్రీడ్‌ (బీజీ2) పత్తి విత్తనాల ప్యాకెట్‌ ధరను రూ.810గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే ధరకు ఆర్బీకేల్లోనూ అమ్మాలని వ్యవసాయ శాఖ ఆదేశించింది. కొన్ని కంపెనీల విత్తనాలు ప్యాకెట్‌కు రూ.20-30తేడాతో ఉన్నాయి. అయితే కొన్ని రకాల విత్తనాలు బయట మార్కెట్‌లో రూ.1200దాకా అమ్ముతున్నారు. దీంతో ఆర్బీకేల్లో బినామీ పేర్లతో తీసుకున్న విత్తనాలను అక్రమార్కులు బయట రేట్లకు అమ్ముకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది వర్షాలు కాస్త తక్కువగా కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనలతో పత్తి సాగుకు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 13.5లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ ఏడాది 15.37 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దీంతో పత్తి విత్తనాలకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రైవేటు వ్యాపారులు అమ్మే విత్తనాల నాణ్యత ప్రశ్నార్ధకంగా ఉంటుండగా, ధర కూడా అధికంగా ఉంటోంది. ఈ కారణంగా నాణ్యమైన విత్తనాలను ఆర్బీకేల్లో విక్రయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు పత్తి విత్తనాలను ఆర్బీకేల్లో పేర్లు బుక్‌ చేసుకుంటున్నారు. అయితే కొన్ని ఆర్బీకేల్లో స్థానిక నేతలు తమకు అనుకూలమైన వారికి ముందుగా ఇచ్చేలా ప్రభావం చూపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.  ఆర్బీకేల్లో కొంతమందికి తక్కువగా, మరికొంతమందికి ఎక్కువ ప్యాకెట్లు ఇచ్చేలా స్థానిక నేతలు ఆర్బీకే సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

Updated Date - 2022-07-07T08:33:13+05:30 IST