దయతో ఆదుకోండి

ABN , First Publish Date - 2020-04-03T09:24:07+05:30 IST

దయతో ఆదుకోండి

దయతో ఆదుకోండి

ప్రధాని మోదీకి సీఎం జగన్‌ విన్నపం

కరోనా నివారణకు ఆకస్మిక ఖర్చులు

దీంతో ఖజానా ఖాళీ అయింది

ఉద్యోగులకు 2 విడతలుగా జీతాలిస్తున్నాం

రాష్ట్రాన్ని ఇతోధికంగా ఆదుకోండి

మెడికల్‌ టెస్ట్‌ కిట్లు పంపిణీ చేయండి

ప్రధానికి ముఖ్యమంత్రి జగన్‌ వినతి

పాజిటివ్‌ కేసుల్లో అత్యధికం ‘జమాత్‌’వే

వైరస్‌ కట్టడికి దిశానిర్దేశం చేయండి

లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేస్తున్నాం

నిత్యావసరాల ధరలు నియంత్రించాం: సీఎం


అమరావతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కరోనా నివారణకు అకస్మాత్తుగా వ్యయం చేయాల్సి రావడంతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని.. ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించేందుకూ ఇబ్బందులు తలెత్తాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. దయార్ద్ర హృదయంతో తమను ఆదుకోవాలని ప్రధాని మోదీని అభ్యర్థించారు. రాష్ట్రానికి నిరంతరం మార్గదర్శనం చేస్తూ కరోనా నివారణకు దశాదిశా చూపాలని.. ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కరోనా నిరోధానికి అవసరమైన వైద్య పరికరాలను విరివిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ.. స్వచ్ఛందంగా రెండు వాయిదాల్లో  50 శాతం చొప్పున జీతాలను తీసుకునేందుకు అంగీకరించారన్నారు. లాక్‌డౌన్‌ అమలు, కరోనా కట్టడిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో  తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగన్‌ పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్‌-19 నివారణకు చేపడుతున్న చర్యలను వివరించారు. 


కేంద్రం ఎప్పటికప్పుడు చేస్తున్న సలహాలూ సూచనలు పాటిస్తూ వైరస్‌ కట్టడి చర్యలు చేపడుతున్నామని అన్నారు. పాజిటివ్‌ వచ్చిన రోగులను గుర్తిస్తున్నామని.. వారికి చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రుల్లో వైద్య సేవలను పెంచామన్నారు. రాష్ట్రంలోకి ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 27,896 మంది విదేశాల నుంచి వచ్చారని.. వారితో 80,896 మంది కాంటాక్టు అయినట్లు గుర్తించామని.. వీరికోసం, వైరస్‌ వారిని గుర్తించడానికి ఇంటింటి సర్వే చేపట్టామన్నారు. గ్రామ/వార్డు వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో రెండు దఫాలుగా సర్వే నిర్వహించామని చెప్పారు. నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్‌లో రాష్ట్రానికి చెందిన 1,085 మంది పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రంలో 132 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులుంటే.. ఇందులో జమాత్‌లో పాల్గొన్నవారే 111 మంది ఉన్నట్లు చెప్పారు. ఇది మినహా రాష్ట్రంలో పరిస్థితి నియంత్రణలో ఉందన్నారు. వైద్య సేవల విషయంలో యంత్రాంగాన్ని సిద్ధం చేశామన్నారు. మెడికల్‌ టెస్ట్‌ కిట్‌లను త్వరగా పంపిణీ చేయాలని ప్రధానిని కోరారు. లాక్‌డౌన్‌ అమలుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. లబ్ధిదారులకు ఏప్రిల్‌ నెల రేషన్‌తో పాటు కిలో కందిపప్పును కూడా ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. 1.40 కోట్ల మంది బీపీఎల్‌ కార్డుదారులకు రేషన్‌ పంపిణీ చేశామన్నారు. రైతు బజార్లను వికేంద్రీకరించామని.. ధరలు పెరగకుండా నిత్యావసర దుకాణాల వద్ద ధరల పట్టికలు ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 213 సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిలో 9,695 మంది ఉన్నారని తెలిపారు. వీటికి అధిక వ్యయం కావడంతో మార్చి నెలలో ఉద్యోగుల జీతాలను 50 శాతం కుదించి ఇస్తున్నట్లు చెప్పారు. అకస్మాత్తుగా వ్యయం పెరగడంతో ఖజానా ఖాళీ అయిందన్నారు. ఈ తరుణంలో కేంద్రం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని.. నిరంతరం దిశానిర్దేశం చేయాలని, ఆర్థికంగానూ.. మెడికల్‌ టెస్ట్‌ కిట్‌ల పంపిణీ ద్వారా ఆదుకోవాలని ప్రధానిని జగన్‌ అభ్యర్థించారు.

Updated Date - 2020-04-03T09:24:07+05:30 IST