మండలి సమావేశాలకు ఏబీఎన్ ఛానల్‌ను అనుమతించాలి: యనమల లేఖ

ABN , First Publish Date - 2020-11-29T19:15:07+05:30 IST

శాసనమండలి సమావేశాలకు ఏబీఎన్ ఛానల్‌ను అనుమతించాలని ఛైర్మన్ షరీఫ్‌కు టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు

మండలి సమావేశాలకు ఏబీఎన్ ఛానల్‌ను అనుమతించాలి: యనమల లేఖ

అమరావతి: శాసనమండలి సమావేశాలకు  ఏబీఎన్ ఛానల్‌ను అనుమతించాలని ఛైర్మన్ షరీఫ్‌కు టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు.  ‘మండలి సమావేశాల కవరేజీకి అన్ని మీడియా ప్రతినిధులను అనుమతించక పోవడం అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం. ఇది పార్లమెంటరీ వ్యవస్థకు భంగం. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం,  సత్ సంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడం శోచనీయం. చట్టసభలకు ఈటీవీ,  టీవీ5, ఏబీఎన్‌పై ఆంక్షలు విధించడాన్ని ఖండిస్తున్నాం. సదరు మీడియా ప్రతినిధులను, కెమెరాలను కూడా శాసనమండలి ప్రాంగణంలోకి అనుమతించడం లేదు. గ్యాలరీల్లోకి కూడా రానివ్వడం లేదు. బ్లూ మీడియాను మాత్రమే అనుమతించి మిగిలిన మీడియా సంస్థల ప్రతినిధులను అనుమతించక పోవడం అప్రజాస్వామికం. ఈ పోకడలు ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలైన చట్టసభలకే విరుద్ధం.  పార్లమెంటరీ వ్యవస్థకు తూట్లు పొడిచేలా వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను గర్హిస్తున్నాం’ అని యనమల అన్నారు.


చట్టసభలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి..

‘ప్రజాప్రతినిధులు చట్టసభలకు జవాబుదారీతనంగా ఉండాలి. చట్టసభలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేది మన రాజ్యాంగ పెద్దల ఆకాంక్ష. సభా ప్రసారాలను ప్రత్యక్షంగా చూసే హక్కు ప్రజలకు ఉంది. ప్రసార సంస్థలు, పార్లమెంటరీ వ్యవస్థ మధ్య బలమైన బంధం ఉంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత వీటిపైనే ఉంది. కొన్ని మీడియా సంస్థలు సభా ప్రాంగణంలోకే రాకూడదు, కెమెరాలు తీసుకు రాకూడదు, గ్యాలరీలోకి వెళ్లకూడదు, లాబీల్లో తిరగరాదనే ఆంక్షల విధింపు అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, పార్లమెంటరీ వ్యవస్థనే కించపర్చడమే.  రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఘనుడు. సీఎం సొంత మీడియా ప్రతినిధులను, తన అనుకూల సంస్థల ప్రతినిధులను, కెమెరాలనే సభలోకి అనుమతించడం ఏకస్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యం కాదు’ అని లేఖలో తెలిపారు.


‘రేపటినుంచి ప్రారంభం కానున్న సభా సమావేశాల్లో దీనినే ప్రధానాంశంగా చేపడ్తాం. దీనిపై శాసనమండలిలోని ఇతర పార్టీల ప్రతినిధులను కూడా కలిసి రావాలని విజ్ఞప్తి  చేస్తున్నాం. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఛైర్మన్ సముచిత రీతిన స్పందించి, కౌన్సిల్ ప్రాంగణంలోకి మీడియాను అనుమతించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతున్నాం.  శాసనమండలి సభ్యులకు అందుబాటులో ఉండేలా కౌన్సిల్ లో మీడియా సెంటర్ ను ఏర్పాటు చేయాలి. నిష్పక్షపాతంగా కౌన్సిల్ ప్రసారాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. మీడియా ప్రతినిధులకు రక్షణ, పూర్తి భద్రత కల్పించాలి. మీడియాకు వ్యతిరేకంగా స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు కౌన్సిల్ కు వర్తింపచేయకుండా శాసనమండలి ఛైర్మన్  సముచిత నిర్ణయం తీసుకోవాలి’ అని యనమల లేఖలో విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-11-29T19:15:07+05:30 IST