టీటీడీ బాటలో యాదాద్రి!

ABN , First Publish Date - 2020-05-23T08:25:33+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో బల్క్‌ ఆర్డర్లలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి లడ్డూలు విక్రయించేందుకు తెలంగాణ

టీటీడీ బాటలో యాదాద్రి!

  • బల్క్‌ ఆర్డర్లపై స్వామివారి లడ్డూ
  • కల్యాణ మండపాల వద్ద కౌంటర్‌
  • సర్కారు అనుమతిస్తే ఆచరణలోకి


హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో బల్క్‌ ఆర్డర్లలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి లడ్డూలు   విక్రయించేందుకు తెలంగాణ దేవాదాయ శాఖ సిద్ధమవుతోంది. పెళ్లిళ్లు, పుట్టిన రోజు, ఇతర శుభకార్యాల్లో ఆహూతులకు స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని కానుకగా ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న భక్తులు బల్క్‌లో లడ్డూలు బుక్‌ చేసుకోవచ్చు. యాదాద్రిలోని కల్యాణ మండపాన్ని, హైదరాబాద్‌ బర్కత్‌పురాలో కొత్తగా నిర్మించిన మరో కల్యాణ మండపాన్ని బుక్‌ చేసుకునే వారినిబల్క్‌లో లడ్డూలు కావాలా? అని అడిగి వారు సరే అంటే సరఫరా చేస్తారు. రెండు కల్యాణ మండపాల వద్ద చిన్నపాటి స్టాళ్లు ఏర్పాటు చేసి స్వామివారి ప్రసాదం, లాకెట్‌, క్యాలెండర్‌, ఇతర వస్తువుల్ని భక్తులకు విక్రయిస్తారు. ఇలా చేయడం వల్ల స్వామి వారిని భక్తులకు చేరువ చేయడంతో పాటు విక్రయాల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చనేది అధికారుల ఆలోచన. ఈ మేరకు దేవాదాయ శాఖ రూపొందించిన ప్రతిపాదనలను త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అనుమతి రాగానే ఆచరణలో పెట్టనున్నారు. టీటీడీలో బల్క్‌లో లడ్డూలు అమ్మడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో యాదాద్రి లడ్డూల విషయంలో సీఎం ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.  కాగా, యాదాద్రిలో పులిహోరతో పాటు చక్కెరతో చేసిన లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. కొంతకాలంగా బెల్లంతో చేసిన లడ్డూలను కూడా పరిమితంగా అందుబాటులో ఉంచుతున్నారు. 80 గ్రాముల బెల్లం లడ్డూ రూ.25కు విక్రయిస్తున్నారు. చక్కరతో చేసిన లడ్డు 100 గ్రాము లు రూ.20కు, కల్యాణ లడ్డు 500 గ్రాములు రూ.100 కు విక్రయిస్తున్నారు. ప్రత్యేక సందర్భాల్లో 25 వేల లడ్డూలు అమ్ముడవుతాయి. లడ్డూలను నెయ్యి, శనగపిండి, కాజు, కిష్మిష్‌, ఇలాచి, జాజికాయ, పచ్చకర్పూరం, చక్కెర/బెల్లం మిశ్రమంతో చేస్తారు. బెల్లం లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. 

Updated Date - 2020-05-23T08:25:33+05:30 IST