4న యాదాద్రికి సీఎం కేసీఆర్‌?

ABN , First Publish Date - 2021-02-28T08:18:51+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ మార్చి 4న సందర్శించనున్నట్టు సమాచారం.

4న యాదాద్రికి సీఎం కేసీఆర్‌?

ప్రధానాలయం, ఇతర పనులపై ప్రత్యేక దృష్టి

ఉద్ఘాటనకు ఆలయ సంసిద్ధతే ప్రధానాంశం

యాదాద్రి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ మార్చి 4న సందర్శించనున్నట్టు సమాచారం. దీంతో ఆలయ అధికారులతో పాటు వైటీడీఏ యంత్రాంగం సన్నద్ధమైంది. సీఎంవో నుంచి అందిన మౌఖిక ఆదేశాల మేరకు వైటీడీఏ, రెవెన్యూ అధికార యంత్రాంగం వారం, పది రోజులుగా కేసీఆర్‌ పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రధానాలయంతో పాటు కొండపై మౌలిక పనులు దాదాపు పూర్తి కావస్తుండటం, మరో మూడు మాసాల్లో ఉద్ఘాటనకు ముహూర్తం నిర్ణయించాల్సి ఉండటంతో ఆలయాన్ని స్వయంగా పరిశీలించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున సీఎం పర్యటనను అధికారికంగా ధ్రువీకరించడం లేదని తెలుస్తోంది. యాదాద్రి ప్రధానాలయం, పురవీధులు, శివాలయం, పుష్కరిణితో పాటు రింగురోడ్డు నిర్మాణం, గండిచెరువు వద్ద నిర్మాణాలు, ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌ను పరిశీలిస్తారని తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ కారణంగా కేవలం వైటీడీఏ, ఆలయ అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులకే పరిమితమై సీఎం పరిశీలన చేస్తారని భావిస్తున్నారు.  ఏ ఏ పనులు పూర్తికావల్సి ఉంది, ఎన్ని రోజుల్లో వాటిని పూర్తిచేస్తారని అంచనా వేసేందుకు సీఎం పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. పనుల తీరు తెలుసుకున్నాక చినజీయర్‌ స్వామితో చర్చించి ఆలయ ఉద్ఘాటనపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.


ఈవో గీతారెడ్డి పదవీకాలం పొడిగింపు

యాదాద్రి ఆలయ ఈవోగా ఎన్‌.గీతారెడ్డి పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూశాఖ డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో యాదాద్రి ఈవోగా బాధ్యతలు చేపట్టిన గీతారెడ్డి 2020 ఫిబ్రవరి 29న ఉద్యోగ విరమణ పొందారు. అయితే 2015 నుంచి ఆలయ ఈవోగా ఆమె పనిచేస్తుండగా, ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నందున 2021 ఫిబ్రవరి వరకు పదవీ కాలం పొడిగించారు. ఈ పొడిగింపు ఆదివారంతో ముగియనుండటంతో మరోమారు పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-02-28T08:18:51+05:30 IST