మళ్లీ అదే రభస

ABN , First Publish Date - 2021-04-12T10:01:01+05:30 IST

మళ్లీ అదే సీన్‌.. ఏమాత్రం మార్పులేదు. అవే ఆరోపణలు.. గొడవల మధ్య రెండోసారి హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) సర్వసభ్య సమావేశం (ఏజీఎం) అర్ధంతరంగా ముగిసింది.

మళ్లీ అదే రభస

వాడివేడిగా హెచ్‌సీఏ ఏజీఎం

అంబుడ్స్‌మన్‌ నియామకంపై అధ్యక్ష, కార్యదర్శుల మధ్య గొడవ

ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్యే ముగిసిన భేటీ


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): మళ్లీ అదే సీన్‌.. ఏమాత్రం మార్పులేదు. అవే ఆరోపణలు.. గొడవల మధ్య రెండోసారి హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) సర్వసభ్య సమావేశం (ఏజీఎం) అర్ధంతరంగా ముగిసింది. ఆదివారం వాడివేడిగా జరిగిన ఈ భేటీలో అంబుడ్స్‌మన్‌ నియామకంపై అధ్యక్షుడు అజరుద్దీన్‌, కార్యదర్శి విజయానంద్‌ మధ్య గొడవ మొదలైంది. 160 మంది సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో.. అంబుడ్స్‌మన్‌గా సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ దీపక్‌ వర్మను నియమిస్తూ అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుందని ఏజీఎంకు అధ్యక్షత వహించిన అజర్‌ ప్రకటించాడు. అలాగే పలు అంశాలపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు అజర్‌ తెలిపాడు. ఆ వెంటనే విజయానంద్‌ లేచి.. అంబుడ్స్‌మన్‌ నియామకంపై అభ్యంతరం తెలిపాడు.


అంబుడ్స్‌మన్‌గా రిటైర్డ్‌ జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూ పేరును ప్రతిపాదిస్తున్నట్టు విజయానంద్‌ తెలపడంతో గందరగోళం నెలకొంది. ‘ఏజీఏం ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరిగింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జస్టిస్‌ దీపక్‌ వర్మను అంబుడ్స్‌మన్‌గా నియమిస్తూ అపెక్స్‌ కౌన్సిల్‌ తుది నిర్ణయం తీసుకుంది’ అని అజరుద్దీన్‌ వర్గం న్యాయ సలహాదారు ఇమ్రాన్‌ మహమూద్‌ తెలిపాడు.  


వేర్వేరు కమిటీలు:

క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)కి ఇరువర్గాలు వేర్వేరు సభ్యులను ప్రకటించారు. వెంకటపతి రాజు, సుదీప్‌ త్యాగి, పూర్ణిమా రావులతో సీఏసీని ఏర్పాటు చేసినట్టు అజర్‌ పేర్కొనగా.. ఎమ్‌వీ నరసింహా రావు, త్యాగి, స్రవంతి నాయుడు సీఏసీ సభ్యులుగా ఉంటారని ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌ చెప్పాడు.  


ఇది నిబంధనలకు విరుద్ధం: విజయానంద్‌

‘సీక్రెట్‌ బ్యాలెట్‌ ద్వారా అంబుడ్స్‌మన్‌ను ఎన్నుకోవాలన్న ప్రతిపాదనకు అజర్‌ అంగీకరించలేదు. అంబుడ్స్‌మన్‌గా రిటైర్డ్‌ జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూ, ఎథిక్స్‌ ఆఫీసర్‌గా రిటైర్డ్‌ జస్టిస్‌ మీనా కుమారిని నియమించాలని 120 మందికిపైగా సభ్యులు సంతకాలు చేశారు’ అని కార్యదర్శి విజయానంద్‌ మీడియాకు వివరించాడు. ఇకనుంచి బీసీసీఐ సమావేశాలకు.. హెచ్‌సీఏ ప్రతినిధిగా శివ్‌లాల్‌ యాదవ్‌ హాజరవుతారని ఆయన ప్రకటించడం గమనార్హం. 


బీసీసీఐకి లేఖ రాస్తా 

‘జస్టిస్‌ దీపక్‌ వర్మను నియమించాలంటూ హైకోర్టు కూడా ఆదేశించాక ఇప్పుడిలా అభ్యంతరం చెప్పడం సబబుకాదు. ఏజీఎంలో కావాలని గొడవ చేసిన వారికి షోకాజ్‌ నోటీసులు ఇస్తాం. అవసరమైతే వారిని సస్పెండ్‌ కూడా చేస్తాం. ఈ పరిణామాలన్నింటిపై బీసీసీఐకి లేఖ రాస్తా. బీసీసీఐ సమావేశానికి హెచ్‌సీఏ ప్రతినిధిగా నేను వెళుతున్నా’ అని అజర్‌ అన్నాడు. 

Updated Date - 2021-04-12T10:01:01+05:30 IST