అన్నంలో పురుగులు.. తినలేక 5 రోజులుగా విద్యార్థినుల పస్తులు

ABN , First Publish Date - 2022-07-05T20:23:26+05:30 IST

నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఐదు రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయి. విద్యార్థినులు

అన్నంలో పురుగులు.. తినలేక 5 రోజులుగా విద్యార్థినుల పస్తులు

భైంసా ‘కస్తూర్బా’లో ఘటన.. 

తినలేక 5 రోజులుగా విద్యార్థినుల పస్తులు

తిన్నవారికి తీవ్ర అస్వస్థత.. పురుగులు ఏరకుండా వంట

పాలమూరులోని ప్రభుత్వ పాఠశాల భోజనంలోనూ పురుగులు

12 మందికి అస్వస్థత.. దవాఖానాకు తరలింపు


భైంసా/మహబూబ్‌నగర్‌ వైద్య/విద్యావిభాగం, జూలై 4: నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(Kasturba Gandhi Girls College)లో ఐదు రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయి. విద్యార్థినులు సిబ్బందికి చెప్పినా, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఆకలికి తాళలేక కొంత మంది విద్యార్థినులు పురుగులతో కూడిన అన్నమే తిని అస్వస్థతకు గురయ్యారు. వారికి వాంతులు, విరోచనాలయ్యాయి. అన్నం తినలేక పస్తులుండటంతో మరి కొంతమంది నీరసించిపోయారు. సోమవారం కండ్లు తిరిగి పడిపోయారు. విద్యాలయ సిబ్బంది వారిని వెంటనే దవాఖానకు తరలించారు. ఫోన్‌ ద్వారా విషయం తెలుసుకొన్న విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన నిర్వహించారు. తమ పిల్లలను ఇండ్లకు తీసుకెళ్లారు. నిర్మల్‌ డీఈవో రవీందర్‌రెడ్డి కస్తూర్బా విద్యాలయంలో విచారణ చేపట్టారు. మెస్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని తేల్చారు. బియ్యంలోని పురుగులను ఏరివేయకుండా వండుతున్నారని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీఈవో స్పష్టం చేశారు. 


బోయపల్లిలో విద్యార్థుల ఆందోళన

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం సమీపంలోని బోయపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కూడా సోమవారం మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి. పురుగులను చూడకుండా తిన్న 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని దవాఖానకు తరలించారు. విద్యార్థులు అన్నాన్ని రోడ్డుపై పారబోసి ఆందోళన వ్యక్తం చేశారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని ఇప్పటికే చాలా సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈవో సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.

Updated Date - 2022-07-05T20:23:26+05:30 IST