ఇరిగేషన్‌లో 2,000 వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టులు!

ABN , First Publish Date - 2020-08-13T07:25:21+05:30 IST

ఇరిగేషన్‌ శాఖలో భారీ సంఖ్యలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది

ఇరిగేషన్‌లో 2,000 వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టులు!

  • అధికారుల కసరత్తు.. త్వరలో వర్క్‌షాపు 
  • సీఈలకు పూర్తి స్థాయి అధికారాలు 
  • త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన 

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : ఇరిగేషన్‌ శాఖలో భారీ సంఖ్యలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే రెండు వేల పోస్టుల మేరకు నియామకం చేసేందుకు వీలుగా అధికారులు కసరత్తు చే స్తున్నారు. కొత్తగా ఏఈఈలు, ఏఈలు వంటి 576 పోస్టులను కూడా నియమించనున్నారు. అలాగే, ఇరిగేషన్‌ శాఖ పునర్వ్యవస్థీకరణపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రకటన చేసే అవకాశముంది. దీనిపై త్వరలోనే వర్క్‌షాపును నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో సీఎం ప్రత్యేకంగా ప్రసంగించి, పునర్వ్యవస్థీకరణ ద్వారా ఎవరెవరు ఎలా పనిచేయాలి ? ప్రాజెక్టుల నిర్వహణ, రైతులకు సాగునీటి సరఫరా వంటి అనేక అంశాలపై తగు సూచనలను చేసే వీలుంది. ప్రస్తుతం ఉన్న ఇరిగేషన్‌ శాఖలో భారీ మార్పులను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే అనేక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కూడా పలుమార్లు అధికారులతో సమీక్షించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో కూడా సీఎం అధికారులకు పలు సూచనలు చేసినట్టు సమాచారం. ఈ సూచనల మేరకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించినట్టు తెలిసింది. ఇరిగేషన్‌ శాఖ పునర్య్యవస్థీకరణ తర్వాత జల వనరుల శాఖగా మార్చనున్నారు. అలాగే ప్రస్తుతం విడివిడిగా ఉన్న మైనర్‌, మేజర్‌, మీడియం ఇరిగేషన్‌ విభాగాలతో పాటు, ఐడీసీ వంటి అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నారు. అయితే ఈ కొత్త విధానంలో చీఫ్‌ ఇంజనీర్లకు (సీఈ) ప్రత్యేక అధికారాలను కల్పించనున్నారు. ప్రాదేశిక ప్రాంతాలుగా విభజించి, ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక్కో సీఈ నియమించనున్నారు. ఆ ప్రాంతంలోని ఆయకట్టు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాల్వలు, బ్యారేజీలు, ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన అన్నింటినీ సీఈల పరిధిలోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం 24 సీఈ పోస్టులున్నాయి. పదోన్నతి ద్వారా కొత్తగా మరో 7 పోస్టులను కల్పించే అవకాశముంది. ఈ 31 మంది సీఈల్లో 19 మంది ఆయా ప్రాజెక్టుల్లో ఉండనున్నారు. మరో నలుగురు ఈఎన్‌సీ కార్యాయంలో, ఇద్దరు సెక్రటేరియేట్‌లో, ఒకరు విజిలెన్స్‌లో, ఇద్దరు ఎలక్ర్టో మెకానిక్‌ వింగ్‌లో పని చేయనున్నారు. పునర్విభజన తర్వాత సమస్తం సీఈల పరిధిలోకే తీసుకురానున్నారు. క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్‌ ఇంజనీర్ల ప్రాదేశిక ప్రాంతాలుంటే, వాటి సంఖ్యను 19కి పెంచనున్నారు. వీటిల్లో ఆదిలాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, రామగుండం, వరంగల్‌, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్‌, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌ కర్నూల్‌, హైదరాబాద్‌ కేంద్రాలుగా సీఈ ప్రాదేశిక ప్రాంతాలుగా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాదేశిక ప్రాంతాల పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, ఐడీసీ లిఫ్టులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్‌హౌ్‌సలు, కాలువలు, సబ్‌ ేస్టషన్లు అన్ని సీఈ పరిధి కిందికే వస్తాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు కొత్త ప్రాజెక్టులు నిర్మించారు. మరి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి కూడా పూర్తయితే రాష్ట్రంలో దాదాపు 1.25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని భావిస్తున్నారు. అయితే ఆ మేరకు శాఖను పటిష్టం చేయాలని సీఎం నిర్ణయించారు. అందులో భాగంగా భారీగా కొత్త పోస్టులను  కూడా సృష్టించాలని భావిస్తున్నారు. 


ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ 

ప్రాజెక్టుల్లో కింది స్థాయిలో 24 గంటల పాటు పర్యవేక్షించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా భారీగా వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించే అవకాశం ఉంది. సుమారు 2వేల పోస్టుల వరకు నియమించాలని అంచనా వేస్తున్నారు. అయితే... ఈ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను పూర్తి స్థాయిలోనా ? లేక అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియామకం చేయాలా ? అనే  అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే ఐటిఐ, పాలిటెక్నికల్‌ వంటి సాంకేతిక విద్యను పూర్తి చేసిన వారిని వర్క్‌ ఇన్‌స్పెక్టర్లుగా నియమించే అవకాశముంది. అలాగే కొత్తగా 576 ఏఈఈ, ఏఈ  పోస్టులనూ భర్తీ చేయనున్నారు. అవసరం మేరకు ఆయా ప్రాజెక్టుల్లో లష్కర్లనూ నియమిస్తారని సమాచారం. 

Updated Date - 2020-08-13T07:25:21+05:30 IST