Advertisement
Advertisement
Abn logo
Advertisement
Apr 29 2021 @ 11:34AM

వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారా.. ఇలాంటి సైట్లతో తస్మాత్ జాగ్రత్త!?

  • నకిలీ డేటింగ్‌ సైట్లతో వల
  • లక్షలు పోగొట్టుకుంటున్న యువకులు
  • సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే అధికం
  • సైబర్‌ నేరగాళ్లతో జరభద్రం

హైదరాబాద్‌ సిటీ : రాజు (పేరు మార్చాం) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నాడు. ఖాళీ సమయంలో మానసికోల్లాసం కోసం సోషల్‌ మీడియా చూస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి స్పైసీడాట్‌ కామ్‌ అప్లికేషన్‌ వెబ్‌సైట్‌ ప్రకటన కనిపించింది. సరదాగా సెర్చ్‌ చేద్దాం అనుకున్నాడు. ఓపెన్‌ చేయగానే ‘ఫీమేల్‌ ఎస్కార్టు సర్వీస్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోగలరు. అతి తక్కువ ప్యాకేజీతో ఎక్కువ సర్వీసులు అందిస్తాం’ అని ఉంది. ఆకర్షితుడైన రాజు అందులో తన పేరును రిజిస్టర్‌ చేసుకున్నాడు. వెంటనే అందమైన అమ్మాయి లైన్లోకి వచ్చింది. వలపు వల విసిరి అతన్ని ట్రాప్‌ చేసి మాటల్లోకి దింపింది. ఇంపైన మాటలతో కట్టిపడేసింది. అతని వివరాలన్నీ రిజిస్టర్‌ చేయించింది. అతనికి ఒక ఐడీని క్రియేట్‌ చేసింది. ఐడీ తీసుకున్న వారికి వివిధ రకాల ప్యాకేజీలు ఉంటాయని పేరు చెప్పి ఫొటోలు, వీడియోలు పంపుతూ అతని నుంచి విడతల వారీగా రూ. 1.50 లక్షలు దోచేసింది. ఫొటోలు, వీడియోలు తప్ప ఎటువంటి సర్వీసులూ లేవు. పైగా ఇంకా డబ్బులు చెల్లించాలని అడగడంతో రాజు ఇదంతా మోసమని గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టెక్నికల్‌ ఆధారాలతో ఇదంతా సైబర్‌ నేరగాళ్ల పని అని పోలీసులు గుర్తించారు. కోల్‌కతాకు చెందిన ముఠాను కటకటాల్లోకి నెట్టారు.

మరో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రాజేష్‌ (పేరు మార్చాం)కు ఇంకా పెళ్లి కాలేదు. వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నాడు. ఓ రోజు అతనికి టెక్ట్స్‌ మెసేజ్‌ వచ్చింది. ‘అందమైన అమ్మాయిలతో డేటింగ్‌ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ నంబర్లకు ఫోన్‌ చేయండి.’ అని ఉంది. రాజేష్‌ అందులో ఉన్న నంబర్‌కు ఫోన్‌ చేశాడు. అవతలి నుంచి ఓ యువతి తీయటి మాటలతో పరిచయం చేసుకుంది. మాటలతో, కవ్విస్తూ వలపు వల విసిరింది. రాజేష్‌ ఆమె మాయలో పడిపోయాడు. ‘ముందుగా మీ పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకోండి. ఆ తర్వాత అమ్మాయిలతో మీటింగ్‌ ఉంటుంది. మీకు నచ్చిన అమ్మాయితో డేటింగ్‌ చేయొచ్చు. చాటింగ్‌ చేయొచ్చు. ఫొటోలు, వీడియోకాల్స్‌, అవసరమైతే కోరిన చోటుకు పంపిస్తాం’ అని చెప్పింది.


రిజిస్ట్రేషన్‌ ఫీజు చిన్న మొత్తంలో ఉండటంతో వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లించాడు. కొద్దిసేపటి తర్వాత అతనితో ఓ యువతి చాటింగ్‌ చేసింది. రూ. 20 వేలు పంపితే నగ్నంగా వీడియోకాల్‌ మాట్లాడతానని చెప్పింది. రాజేష్‌ ఆ డబ్బు చెల్లించి ఆమెతో వీడియోకాల్‌ మాట్లాడాడు. ఒకానొక క్షణంలో ఒంటిపై దుస్తులు లేకుండా వీడియోకాల్‌ మాట్లాడాడు. ఆ వీడియోకాల్‌ను వారు రహస్యంగా క్యాప్చర్‌ చేశారు. కాల్‌ కట్‌ చేసిన కొద్దిసేపటికి సైబర్‌ నేరగాళ్ల నుంచి ఫోన్‌ వచ్చింది. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతామని, తల్లిదండ్రులకు, స్నేహితులకు పంపుతామని బ్లాక్‌ మెయిల్‌ చేశారు. అతనికి కొన్ని ఫొటోలు పంపారు. ఉక్కిరిబిక్కిరి అయిన రాజేష్‌ వారు చెప్పిన అకౌంట్లో 50 వేలు వేశాడు. దఫాలుగా మొత్తం 2 లక్షలు తీసుకున్నారు. అయినా వేధింపులు ఆపకపోవడంతో రాజేష్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను పరిశీలించిన పోలీసులు ఢిల్లీకి చెందిన సైబర్‌ ముఠా ఈ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.


ఆ యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు

ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అపరిచిత వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లకు స్పందించొద్దు. యువత స్పైసీఫ్రెండిషిప్‌, డేటర్స్‌ హబ్‌, లోకంటో, టిండర్‌, ఇండియా డేట్స్‌ వంటి యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకొని సైబర్‌ నేరగాళ్లకు చిక్కుతున్నారు. అనవసర యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసి అమ్మాయిలతో చాటింగ్‌, వీడియోకాల్స్‌లో మునిగిపోతే ఆ తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. - విజయ్‌కుమార్‌, డీసీపీ, సైబరాబాద్‌.

Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement