పేరుకే మహిళా సాధికారికత

ABN , First Publish Date - 2021-03-30T06:03:58+05:30 IST

కదనరంగంలో వెన్నుచూపని పోరాట స్ఫూర్తికి మనం భారత నారి ఝాన్సీ లక్ష్మీబాయిని తరచూ కీర్తిస్తూంటాం. ఇంటి నిర్వహణలోనే కాదు,...

పేరుకే మహిళా సాధికారికత

కదనరంగంలో వెన్నుచూపని పోరాట స్ఫూర్తికి మనం భారత నారి ఝాన్సీ లక్ష్మీబాయిని తరచూ కీర్తిస్తూంటాం. ఇంటి నిర్వహణలోనే కాదు, కదన రంగంలోనూ మహిళ ఏమాత్రం తీసికట్టు కాదని ప్రస్తుతిస్తూ ఉంటాం. రాజ్యాంగంలోనూ సమానత్వపు హక్కును ప్రత్యేకంగా ప్రస్తావించాం. కానీ కట్టెదుటి వాస్తవాలు మాత్రం అందుకు భిన్నం. సైన్యంలో క్షేత్ర పోరాటంలో మహిళలకు కమాండర్లుగా అర్హత లేదన్న ప్రభుత్వ వాదనే దీనికి తార్కాణం. ఈ విషయంపై న్యాయస్థానాల్లో కేసులు నడిచి, స్వయంగా సుప్రీంకోర్టు మహిళా సైనికాధికారులను శాశ్వత కమాండర్లుగా నియమించమని ఆదేశాలు ఇచ్చి సంవత్సరం దాటినా ప్రభుత్వంలో స్పందన లేదు. పైగా మరిన్ని కుంటిసాకులు వెదుకుతోంది. ఇటీవల ఈ విషయమై జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు కీలకమైనవి. ‘ఈ సమాజ నిర్మాణం పురుషులు కోసం పురుషులు ఏర్పాటు చేసుకున్నదన్న వాస్తవాన్ని మనం గుర్తించక తప్పదు. పైకి మాత్రమే కొనసాగుతున్న ఈ సమానత్వ ప్రదర్శన రాజ్యాంగంలో నెలకొన్న విలువలకు పూర్తి తిలోదకాలిస్తోంది,’ అంటూ ఆయన ఆవేదన వెలిబుచ్చారు. పది నుంచి ఇరవై ఏళ్ళ సర్వీసు అనుభవం కలిగి 30 నుంచి 50 ఏళ్ళ మధ్య వయసు గల ఈ మహిళలను పాతికేళ్ల వయసు గల పురుషులతో పోటీ మనడంలోని సమానత్వమేముందని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో మంకుపట్టు వీడి సర్వోన్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తుందని ఆశిద్దాం.

ఆర్. శ్రీనివాసరాజు

Updated Date - 2021-03-30T06:03:58+05:30 IST