ధాన్యం సేకరణలో మహిళా చైతన్యం

ABN , First Publish Date - 2021-06-20T10:46:46+05:30 IST

ధాన్యం సేకరణలో మహిళా చైతన్యం వెల్లివిరుస్తోంది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు..

ధాన్యం సేకరణలో మహిళా చైతన్యం

  • కొనుగోళ్లలో స్వయం సహాయక మహిళా సంఘాలు
  • జగిత్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
  • కమీషన్‌ రూపంలో సంఘాలకు రూ.కోట్లలో ఆదాయం
  • ఐదేళ్లలో రూ.48.53 కోట్ల కమీషన్‌ పొందిన సంఘాలు


జగిత్యాల, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ధాన్యం సేకరణలో మహిళా చైతన్యం వెల్లివిరుస్తోంది. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు.. ధాన్యం సేకరణలో సమర్థంగా పనిచేస్తూ ఇటు రైతులు, అటు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న కమీషన్‌తో తమ సంఘాలనూ ఆర్థికంగా బలోపేతం చేసుకుంటున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున ధాన్యం సేకరణలో పాలుపంచుకుంటూ, భారీగా కమీషన్‌ పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాలు.. గడచిన ఐదేళ్లలో 1,51,66,787 క్వింటాళ్ల ధాన్యం సేకరణ జరిపి.. ప్రభుత్వం నుంచి రూ.48.53 కోట్లు కమీషన్‌గా పొందాయి. కరోనా ఉధృతి సమయంలోనూ ధైర్యంగా ధాన్యం సేకరణ కొనసాగించారు. ఈ ఏడాది యాసంగిలోనైతే గతంలో ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 163 ఽకేంద్రాల్లో 564 గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలోని 15,041 మహిళా సంఘాలు ధాన్యం కొనుగోలు చేశాయి. తద్వారా ఈ సంఘాల్లోని 1,77,851 మంది మహిళలకు ఉపాధి లభించినట్లయింది. క్వింటాలుకు రూ.32 చొప్పున ప్రభుత్వం కమీషన్‌ చెల్లిస్తున్నందున.. 19,80,560 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినందుకుగాను రూ.6.33 కోట్ల కమీషన్‌ను పొందనున్నారు.


సంఘాలకు స్వయం సమృద్ధి..

మహిళా సంఘాలు ధాన్యం సేకరణ చేపట్టడం ద్వారా స్వయం సమృద్ధి దిశగా పయనిస్తున్నాయి. గత వానాకాలం, యాసంగి ధాన్యం సేకరణ సీజన్‌లలో కొవిడ్‌ ఉధృతి అధికంగా ఉన్నప్పటికీ సమస్యలను అధిగమించి సేకరణ జరిపారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు ఏర్పాటు చేయడం దగ్గర్నుంచి.. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, సకాలంలో రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవడం వంటి పనులను మహిళా సంఘాల సభ్యులు చేశారు. ఇలా ప్రతి సీజన్‌లో ధాన్యం సేకరణ ద్వారా మహిళా సంఘాలకు  రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. ఈ ఆదాయంతో ఆయా సంఘాల్లోని సభ్యులకు వ్యక్తిగత రుణాలు ఇస్తూ వారి ఆర్థికావసరాలకు తోడ్పడుతున్నారు. 


రైతులకు ప్రభుత్వానికి వారధిగా 

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో మహిళా గ్రామ ఐక్యసంఘాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేస్తూ ఇటు రైతులకు, అటు ప్రభుత్వానికి మద్య వారధిగా పనిచేస్తున్నాం. రైతులకు కనీస మద్దతు ధర అందించడానికి కృషి చేస్తుండడం పట్ల సంతోషంగా ఉంది. 

  1. - పడాల జ్యోతి, వీవో అధ్యక్షురాలు, పోరండ్ల గ్రామం, జగిత్యాల జిల్లా

Updated Date - 2021-06-20T10:46:46+05:30 IST