జూబ్లీహిల్స్ ఘటనలో బాధితురాలికి అండగా ఉమెన్ కమిషన్:chair person Sunita Laxma reddy

ABN , First Publish Date - 2022-06-05T00:28:43+05:30 IST

మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన చాలా బాధాకరమని తెలంగాణ మహిళా కమిషన్(telangana women comission) ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి (sunita laxma reddy) ఆవేదన వ్యక్తం చేసారు.

జూబ్లీహిల్స్ ఘటనలో బాధితురాలికి అండగా ఉమెన్ కమిషన్:chair person Sunita Laxma reddy

హైదరాబాద్: మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన చాలా బాధాకరమని తెలంగాణ మహిళా కమిషన్(telangana women comission) ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి (sunita laxma reddy) ఆవేదన వ్యక్తం చేసారు. ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. భాధిత కుటుంబానికి మహిళా కమీషన్, ప్రభుత్వం అండగా ఉంటుందని చైర్ పర్సన్ భరోసా ఇచ్చారు. ప్రపంచ రుతుక్రమం పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ సారథ్యంలో శనివారం నాడు హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ సుల్తాన్ షాహిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ ఋతుక్రమం అనేది ప్రతి నెలా జరిగే ప్రక్రియ అని ఆ ప్రత్యేక రోజులలో మహిళలు/అమ్మాయిలు పరిశుభ్రత పాటించాలని అవగాహన కల్పించడానికి, ప్రోత్సహించడానికి ఈ రోజును జరుపుకుంటామని అన్నారు. 


నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత పద్ధతులపై అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమంది అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు. రుతుక్రమం సమయంలో శానిటరీ ప్యాడ్స్‌ వాడాలని, వాటిపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. నెలసరి సమయాల్లో ఐరన్‌, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే మంచి సమతుల ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఐరన్‌ మిళితం కావడానికి విటమిన్‌ సి ఉపయోగపడుతుందని అందుకే విటమిన్‌ సి కలిగిన ఆహారం తీసుకోవాలని కోరారు.నెలసరి సమయంలో నీరు ఎక్కువగా తాగాలని దాని వల్ల నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతాయని పేర్కొన్నారు. సులభమైన వ్యాయామాలు చేయడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పి ఉండదని వివరించారు. నెలసరి సమయంలో కొంత శారీరక బలహీనత ఉండే అవకాశం ఉందని, ఎక్కువ శారీరక శ్రమ ఉండరాదనే ఉద్దేశంతో కొన్ని నిబంధనలు పాటించడం జరుగుతోందని చెప్పారు. 


సమాజంలో కొంతమంది అపోహతో అపవిత్రంగా భావించడం జరుగుతుందని, ఇది అవసరం లేదని చెప్పారు. మహిళలు నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి ఐసిడిఎస్‌ అందిస్తున్న సేవలు వినియోగించుకోవాలని, సూచించారు. ఈ కార్యక్రమంలో అమ్మాయిలకు / మహిళలకు ఉచితంగా శానిటరీ పాడ్స్ పంపిణీ చేశారు. అనంతరం షాహిన్ ఉమెన్ వెల్ఫేర్ ఎన్జీఓ రుతుస్రావం పై అవగాహన కల్పించేందుకు నుక్కడ్ నాటకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా మహిళల ఆరోగ్యం, సంక్షేమం పట్ల అనేక పథకాలు చేపట్టిందని, రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలలో నాణ్యమైన భోజన వసతి, విద్య కల్పించారని తెలిపారు. మహిళల హెల్ప్ లైన్ 198 లేదా పోస్టల్, ట్విట్టర్, ఇ మెయిల్ తదితర మార్గాల ద్వారా లేదా కమీషన్ నెంబర్ 9490555533 కు మహిళలు  సమస్యలను తెలుపవచ్చునని గుర్తుచేశారు. 

Updated Date - 2022-06-05T00:28:43+05:30 IST