26 ఏళ్లుగా America లో ఉంటున్న NRI మహిళ అనూహ్య నిర్ణయం.. తల్లిని అయ్యాకే నాకు అర్థమయిందంటూ...

ABN , First Publish Date - 2021-12-11T01:25:24+05:30 IST

అనూ సెహగల్..దాదాపుగా 26 ఏళ్ల నుంచి అమెరికాలోనే ఉంటున్న వ్యక్తి. భారత్‌కు దూరంగా విదేశీ సంస్కృతి మధ్యా కార్పొరేట్ వాతావరణంలో ఉద్యోగం..జీవితం. కానీ.. 10 ఏళ్ల క్రితం ఆమె తల్లైన తొలినాళ్లలో ఆమె మదిలో ఓ భావన మెదిలింది. పిల్లలకు, ముఖ్యంగా అమెరికాలోని భారతీయ సంతతి వారికి భారత్‌తో పాటూ..

26 ఏళ్లుగా America లో ఉంటున్న NRI మహిళ అనూహ్య నిర్ణయం.. తల్లిని అయ్యాకే నాకు అర్థమయిందంటూ...

ఇంటర్నెట్ డెస్క్: అనూ సెహగల్..దాదాపుగా 26 ఏళ్ల నుంచి అమెరికాలోనే ఉంటున్న మహిళ. భారత్‌కు దూరంగా విదేశీ సంస్కృతి మధ్య జీవితం..కార్పొరేట్ వాతావరణంలో ఉద్యోగం. కానీ.. 10 ఏళ్ల క్రితం ఆమె తల్లైన తొలినాళ్లలో ఆమె మదిలో ఓ భావన మెదిలింది. పిల్లలకు, ముఖ్యంగా అమెరికాలోని భారతీయ సంతతి వారికి భారత్‌తో పాటూ దక్షిణాసియా సంస్కృతి సంప్రదాయాలను కూడా వారసత్వంగా అందించాలనే ఆలోచన కలిగింది. అలా ఆమె..  పిల్లలకు సాధారణ చదువులతో పాటూ సాంస్కృతిక అక్షరాస్యత కూడా అందించాలని సంకల్పించారు. ఫలితంగా పుట్టినదే ‘ది కల్చర్ ట్రీ’ సంస్థ..! అలా ఆమె అనూహ్యంగా కార్పొరేట్ ప్రపంచాన్ని వదిలి..సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉదాత్త ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు. 


‘‘నేను తల్లినైన తరువాత.. పిల్లలకు తమ సాంస్కృతిక వారసత్వం గురించి కేవలం పరిచయం చేస్తే చాలదని, లోతైన అవగాహన కల్పించాలని అర్థమైంది. ముందుగా పిల్లలకు వారి మాతృభాష గురించి అవగాహన కల్పించాలన్న టీచర్లు లభించలేదు.’’ అని ఆమె చెప్పారు. పిల్లలకు తమ సాంస్కృతిక వైభవం గురించి తెలిస్తేనే వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి ఓ పరిపూర్ణమైన వ్యక్తులుగా రూపుదిద్దుకుంటారనేది అనూ విశ్వాసం. అసలు అనూ సెహగల్‌కు కూడా భిన్న సంస్కృతులు వారసత్వంగా లభించాయి. ఆమె తల్లి ముస్లిం.. తండ్రి హిందువు. ఇలా భిన్న సంస్కృతుల మధ్య మీరట్‌ నగరంలో ఆమె బాల్యం గడిచింది. అయితే.. కల్చర్ ట్రీ స్థాపించిన తరువాత ఆమె ఇలా భిన్న నేపథ్యాల నుంచి వచ్చి దక్షిణాసియా దేశాల పిల్లలకు వారి వారి సంప్రదాయాలు, భాషల గురించి అవగాహన కల్పించడం ప్రారంభించారు. వారికే కాకుండా ఇతరులకు కూడా దక్షిణాసియా దేశాల గురించి ఆమె అవగాహన కల్పిస్తున్నారు. ఆసియా వారి పట్ల ఉన్న అపోహలు, వివక్ష దూరం చేయడం కోసం తాను శ్రమిస్తున్నట్టు అనూ తెలిపారు. 


ప్రస్తుతం కల్చర్ ట్రీ సంస్థ పిల్లల కోసం భాష, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తొలుత తన ఇద్దరు పిల్లల కోసం అనూ సెహగల్ మాతృభాషను నేర్పడం ప్రారంభించారు. ఆ తరువాత.. చూస్తుండగానే అనేక మంది తల్లిదండ్రులు కూడా ఆసక్తి కనబర్చడంతో తన వద్ద అనేక మంది పిల్లలు చేరారు. ఇలా.. చూస్తుండగానే కల్చర్ ట్రీ పరిధి విస్తరిస్తూ వెళ్లింది. అనేక మంది దక్షిణాసియా వారి మన్ననలు చూరగొంది. 4 నుంచి 12 ఏళ్ల పిల్లల కోసం నిర్వహించే భాషాపరమైన కార్యక్రమాలతో పాటూ మ్యూజియంలు, గ్యాలరీలు, స్కూళ్ల భాగస్వామ్యంతో అనేక ఇతర కార్యక్రమాలు కూడా కల్చర్ ట్రీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రస్తుతం పిల్లలకు అక్కడ హిందీ, ఉర్దూ, పంజాబీ, గుజరాతీ, హిందుస్తానీ భాషలను బోధిస్తున్నారు. కృష్ణ లీలల ఆధారంగా కల్చర్ ట్రీ రూపొందించిన తొలుబొమ్మలాట అమెరికాలో ఎంతో పాపులర్. 


కరోనా సంక్షోభానికి పూర్వం పిల్లల కోసం భారత్‌లో ఓ పర్యటన ఏర్పాటు చేయాలని కూడా ఆమె ప్రణాళిక రచించుకున్నారు. అయితే.. కరోనా కారణంగా అవన్నీ వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ.. అనూ సెహగల్ తన కార్యక్రమాలన్నీ ఆన్‌లైన్ వేదికలకు మార్చారు. టీచర్లకు కూడా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించేందుకు తర్ఫీదును ఇచ్చారు. దీంతో.. లక్ష్యం దిశగా తన ప్రయాణం కొనసాగించేందుకు ఆమెకు వీలుకలిగింది. మేట్రోపాలిటిన్ మ్యూజియమ్ ఆఫ్ ఆర్ట్ వారు నిర్వహించే వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ సందర్భంగా  తోలు బొమ్మల ఆట ప్రదర్శించాలంటూ ఆహ్వానం రావడం కల్చర్ ట్రీ ప్రస్థానంలో ఓ మైలురాయి అని ఆమె పేర్కొన్నారు.  

Updated Date - 2021-12-11T01:25:24+05:30 IST