కాంగ్రెస్‌ మద్దతు లేకుండా.. ఏ థర్డ్‌ ఫ్రంటూ అధికారంలోకి రాదు

ABN , First Publish Date - 2021-12-04T07:54:58+05:30 IST

సోనియా, రాహుల్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ మద్దతు లేకుండా ఏ థర్డ్‌ ఫ్రంటూ అధికారంలోకి రాలేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌ మద్దతు లేకుండా.. ఏ థర్డ్‌ ఫ్రంటూ అధికారంలోకి రాదు

  • రాహుల్‌ ముందు ప్రశాంత్‌ కిషోర్‌.. ఓ చీమ
  • తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ది కొట్లాటే
  • బీజేపీది ఎప్పటికీ మూడో స్థానమే: జగ్గారెడ్డి


హైదరాబాద్‌, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): సోనియా, రాహుల్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ మద్దతు లేకుండా ఏ థర్డ్‌ ఫ్రంటూ అధికారంలోకి రాలేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఒక జాతీయ పార్టీగా లోక్‌సభలో 150 నుంచి 300 సీట్లు సాధించగలిగే సత్తా కాంగ్రెస్‌కే ఉందని అన్నారు. శరద్‌ పవార్‌, మమత బెనర్జీ.. ఆయా రాష్ట్రాల్లో బలవంతులైనా, దేశ వ్యాప్తంగా చూసుకుంటే వారికి వంద సీట్లైనా వస్తాయా? అని ప్రశ్నించారు. ప్రశాంత్‌ కిషోర్‌ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని మండిపడ్డారు. ‘‘ప్రశాంత్‌ కిషోర్‌ పుట్టింది ఎప్పుడు? దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్‌ గురించి ఆయనకు ఏం తెలుసు? కాంగ్రెస్‌, రాహుల్‌పైన మాట్లాడేంత వయస్సు ఆయనకు ఎక్కడిది? రాహుల్‌ నాయకత్వం ముందు ఆయన ఓ చీమలాంటి వాడు’’ అని వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌కు వచ్చి చూస్తే చాలామంది ప్రశాంత్‌ కిషోర్‌లు కనిపిస్తారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గాంధీ కుటుంబంతోనే ఉంటుందన్నది చరిత్ర అని, కాంగ్రెస్‌ అంటేనే సోనియా, రాహుల్‌, ప్రియాంక నాయకత్వమని అన్నారు. కాంగ్రెస్‌ లేకుండా మూడో ఫ్రంట్‌ ఏర్పాటైనా.. బీజేపీని ఓడించడం సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోకి రమ్మంటూ ప్రశాంత్‌ కిషోర్‌ను ఎవరూ బొట్టు పెట్టి పిలవలేదని తెలిపారు. ప్రశాంత్‌ కిషోర్‌కు రాజకీయ జ్ఞానం లేదని, దుయ్యబట్టారు.  రైతుల కోసం పోరాడే పార్టీ కాంగ్రెస్‌ అని గుర్తు చేశారు. ‘‘జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ తల్లి పాత్ర పోషిస్తుంది. తల్లి కోడి దగ్గరికి పిల్లలు వస్తయా.. పిల్లల దగ్గరికే తల్లి కోడి పోతదా?తల్లి.. తిడితే పడుతుంది.. మళ్లీ దగ్గరికి తీసుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సతో కాంగ్రెస్‌ది కొట్లాటేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ ఎప్పుడైనా మూడో స్థానంలోనే ఉంటుందని అన్నారు. తెలంగాణలో ఏ రకంగా ముందుకు వెళ్లాలన్నది సోనియా, రాహుల్‌లే నిర్ణయిస్తారని తెలిపారు. 


మమ్మల్ని చూసి టీఆర్‌ఎస్‌ భయపడుతోంది

మెదక్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 230 మంది ప్రజాప్రతినిధులున్న కాంగ్రె్‌సను చూసి 700కు పైగా ప్రజాప్రతినిధులున్న టీఆర్‌ఎస్‌ భయపడుతోందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. తమ పార్టీ ఓటర్లపై తమకు నమ్మకం ఉన్నందునే కాం్యపు పెట్టలేదని తెలిపారు. ప్రజాప్రతినిధులను ఉత్తర భారతదేశ యాత్రకు పంపిన టీఆర్‌ఎస్‌.. తిరిగి తనపైనే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని అన్నారు. మంత్రి హరీశ్‌రావు దగ్గరుండి ప్రజాప్రతినిధులను క్యాంపు కోసం బస్సులు ఎక్కిస్తుంటే ఎన్నికల కమిషన్‌ నిద్రపోతోందా? అని ప్రశ్నించారు. 300 మందిని ఉత్తర భారతదేశంలో తిప్పుతున్నారని, వంద మందిని బెంగళూరులో, మరో వంద మందిని మైసూరు క్యాంపులో ఉంచారని, రోజుకు వంద మందికి తిరుమల దర్శనం చేయిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించడం వల్లే తమకు గుర్తింపు దక్కిందన్న భావనతో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు తమకు ఓటేస్తారని అనుకుంటున్నట్లు చెప్పారు. 

Updated Date - 2021-12-04T07:54:58+05:30 IST