పేషెంట్ల దంతాలు నాశనం చేసి.. కోట్లు దండుకున్న డెంటిస్ట్..! ఎలాగో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2022-03-20T01:53:08+05:30 IST

అమెరికాలో దారుణానికి పాల్పడ్డ ఓ డాక్టర్ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

పేషెంట్ల దంతాలు నాశనం చేసి.. కోట్లు దండుకున్న డెంటిస్ట్..! ఎలాగో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ఎన్నారై డెస్క్: తన సాయం కోసం వచ్చిన ప్రతివ్యక్తికీ చేయగలిగిన మంచి చేస్తానంటూ వైద్య విద్య పూర్తి చేసిన ప్రతివిద్యార్థి ప్రతినబూనతాడు. వృత్తిజీవితంలోకి ప్రవేశించాక వైద్యులు సాధారణంగా ఈ ప్రతినకు కట్టుబడి ఉంటారు. కానీ.. కొందరు మాత్రం డబ్బుకు ఆశపడి పేషెంట్ల నమ్మకాన్ని వమ్ము చేస్తూ అన్యాయాలకు పాల్పడుతుంటారు. అలాంటి ఓ డాక్టర్ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని విస్కాన్సిన్‌ రాష్ట్రానికి చెందిన స్కాట్ చెర్మొలీ దారుణాలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో సంచలనానికి దారి తీస్తున్నాయి. 


ట్రీట్‌మెంట్ కోసం తన వద్దకు వచ్చిన పేషెంట్ల దంతాలను స్కాట్.. డ్రిల్లింగ్‌ మెషిన్‌తో అరిగిపోయేలా చేసి నాశనం చేసేవాడు. ఆ తరువాత పళ్ల రూపుమారిపోయి అందవిహీనంగా తయారయ్యాయంటూ పేషెంట్లను నమ్మించేవాడు. ఎక్స్‌రే ఫిల్మ్‌లను చూపిస్తూ.. కొన్నేళ్ల క్రితమే వారికి ఇలా జరిగిందని మస్కా కొట్టేవాడు. దీనికి చికిత్సగా పాడైపోయిన దంతాలపై కృత్రిమ తొడుగులను(క్రౌన్‌) అమర్చాలని చెప్పడంతో.. మరో గత్యంతరం లేక పేషెంట్లు స్కాట్ చెప్పినట్టే చేసేవారు. ఒక్కో క్రౌన్ అమర్చేందుకు వారి వద్ద నుంచి భారీగా డబ్బు గుంజుతూ.. కోట్లు వెనకేశాడు. 2014లో ఇలాంటి అవకతవకలకు పాల్పడి..ఏకంగా 1.4 మిలియన్ డాలర్లు సంపాదించాడు. 2015లో అతడి సంపాదన 2.5 మిలియన్ డాలర్లకు చేరింది. 


ఇక 2016 నుంచి 2019 మధ్య కాలంలో  నిందితుడు సగటున ఏటా 4.2 మిలియన్ డాలర్ల పోగేసుకున్నాడు. అయితే.. 2019లో అతడు తన క్లినిక్‌ను వేరే వాళ్లకు అమ్మేయడంతో అతడి బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. మునుపటి రికార్డులను పరిశీలించిన కొత్త యాజమాన్యం అధికారులకు ఫిర్యాదు చేసింది. విస్కానిస్ రాష్ట్రంలోని డెంటిస్టులు ప్రతి వంద పేషెంట్లకు ఆరు క్రౌన్లు అమరిస్తే.. స్కాట్ మాత్రం ఏకంగా 32 క్రౌన్లు అమర్చేవాడంటే అతడు ఏ స్థాయిలో అవకతవకలకు పాల్పడ్డాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాగా..  గతంలో స్కాట్  వద్ద వైద్యం చేయించుకున్న 100 మంది పేషెంట్లు అతడిపై కోర్టులో కేసు వేశారు. 2021 ఫిబ్రవరిలోనే అతడి లైసెన్స్ రద్దైంది. ఇక..ఈ కేసుల విషయంలో న్యాయస్థానం జూన్‌లో తీర్పు వెలువరించనుంది.  

Updated Date - 2022-03-20T01:53:08+05:30 IST