విప్రో లాభం రూ.2,972 కోట్లు

ABN , First Publish Date - 2021-04-16T06:00:13+05:30 IST

గత ఆర్థిక సంవత్సరం (2020-21).. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) విప్రో

విప్రో లాభం రూ.2,972 కోట్లు

క్యూ4లో 27.7 శాతం వృద్ధి నమోదు 


న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2020-21).. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) విప్రో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.2,972 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2019-20) ఇదే కాలానికి నమోదైన రూ.2,326.1 కోట్ల లాభంతో పోలిస్తే 27.7 శాతం అధికమిది. క్యూ4లో సంస్థ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 3.4 శాతం పెరిగి రూ.16,245.4 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే సమయానికి రూ.15,711 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో (క్యూ3) కంపెనీ లాభం రూ.2,997.8 కోట్లు, ఆదాయం రూ.15,670 కోట్లుగా నమోదైంది. క్యూ3తో పోలిస్తే, విప్రో లాభం 0.8 శాతం తగ్గగా.. ఆదాయంలో 3.7 శాతం వృద్ధి నమోదైంది. మరిన్ని విషయాలు.. 


 గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి విప్రో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 11 శాతం వృద్ధితో రూ.10,796.4 కోట్లకు.. ఆదాయం 1.5 శాతం పెరుగుదలతో రూ.61,943 కోట్లకు చేరుకుంది. 


 క్యూ4లో ఐటీ సేవల విభాగ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 3.8 శాతం వృద్ధి చెంది 215.24 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఐటీ సేవల నిర్వహణ మార్జిన్‌ వార్షిక ప్రాతిపదికన 3.44 శాతం పెరిగి 21 శాతానికి చేరుకుంది. 


 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) ఐటీ సేవల ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 2-4 శాతం వృద్ధి చెంది 219.5-223.8 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని కంపెనీ అంచనా వేసింది. 


 క్యూ4లో కంపెనీ కస్టమర్ల జాబితాలో కొత్తగా 52 మంది చేరారు. దాంతో, మార్చి 31 నాటికి యాక్టివ్‌ క్లయింట్ల సంఖ్య 1,136కు చేరుకుంది. 


 గడిచిన మూడు నెలల్లో 10 కోట్ల డాలర్లకు పైగా విలువ చేసే ఒక కాంట్రాక్టుతోపాటు 7.5 కోట్ల డాలర్లకు పైగా విలువైన డీల్స్‌ మూడు, 5 కోట్ల డాలర్లకు పైగా విలువైన ఒప్పందాలు రెండు కుదుర్చుకున్నట్లు విప్రో వెల్లడించింది. 


 ఈ మార్చి 31 నాటికి కంపెనీలో 1,97,712 మంది పనిచేస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య నికరంగా 15,000 పెరిగింది. క్యూ4లో ఉద్యోగుల వలసల (అట్రిషన్‌) రేటు 12.1 శాతంగా నమోదైంది. 


 గురువారం బీఎ్‌సఈలో ట్రేడింగ్‌ ముగిసే సమయానికి విప్రో షేరు 2.95 శాతం లాభంతో  రూ.431 వద్ద స్థిరపడింది.




క్యూ4లో 18,000 నియామకాలు 


గడిచిన త్రైమాసికంలో 18,000 మందిని ఉద్యోగంలో చేర్చుకున్నట్లు విప్రో తెలిపింది. అందులో 3,000 మంది ఫ్రెషర్లు. మున్ముందు త్రైమాసికాల్లో హైరింగ్‌ జోరును మరింత పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది. నిర్దిష్ట సంఖ్యను చెప్పకపోయినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరంలో గతసారి కంటే అధిక నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ సంకేతాలిచ్చింది. అంతేకాదు, ఉద్యోగులను నిలుపుకునేందుకు పలు చర్యలను ప్రకటించింది. ఈ జనవరి నుంచి ఉద్యోగుల జీతాలు పెంచిన విప్రో.. ఈ ఏడాది జూన్‌ లో మరోసారి పెంచే యోచనలో ఉంది. అలాగే, ప్రమోషన్లు, నైపుణ్య ఆధారిత బోనస్‌ సైతం ప్రకటించనున్నట్లు కంపెనీ సీఈఓ థియరీ డెలాపోర్ట్‌ వెల్లడించారు. 




వరుసగా మూడు త్రైమాసికాల పాటు ఆదాయం, కొత్త ఒప్పందాలు, నిర్వహణ మార్జిన్ల పరంగా పటిష్ఠమైన పనితీరు కనబర్చగలిగాం. క్యాప్‌కో టేకోవర్‌ ద్వారా కంపెనీ చరిత్రలో అతిపెద్ద కొనుగోలు ఒప్పందాన్ని ప్రకటించాం. ఆర్థిక సేవల రంగానికి చెందిన క్లయింట్లకు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో సేవలు అందించేందుకు ఈ ఒప్పందం దోహదపడనుంది. 

            - థియరీ డెలాపోర్ట్‌, 

                 విప్రో సీఈఓ, ఎండీ 


Updated Date - 2021-04-16T06:00:13+05:30 IST