ఫ్యాన్‌కు ఎదురుగాలి!

ABN , First Publish Date - 2022-08-03T07:59:52+05:30 IST

ఫ్యాన్‌కు ఎదురుగాలి!

ఫ్యాన్‌కు ఎదురుగాలి!

జగన్‌కు ధరాఘాతం

పీకే టీమ్‌, సొంత సర్వేల ప్రకంపనలు

జగన్‌ మెడకు చుట్టుకున్న స్వీయ స్లోగన్‌!

పన్నుల బాదుడుపై జనాగ్రహం

మా నుంచి డబ్బులు పిండేసి..

మళ్లీ మాకే ఇస్తారా అని కన్నెర్ర

సీఎంలో పెరుగుతున్న అసహనం

ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అలజడి

గడప గడపనా కడిగేస్తున్న మహిళలు


జగన్‌ సర్కారుపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని సొంత సర్వేలే గాక.. ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) టీమ్‌ సర్వే సైతం తేల్చేయడం.. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధుల్లో కలవరం రేపుతోంది. ముఖ్యంగా ధరల పెరుగుదల, పన్నుల బాదుడుపై జనం ఆగ్రహంతో ఉన్నారని వెల్లడైంది. పన్నుపోటుతో తమ నుంచే డబ్బులు పిండి.. అందులో కొంత మాత్రమే ఇస్తూ సంక్షేమమంటూ ప్రచారం చేసుకుంటున్నారని ప్రజలకు తెలిసిపోయింది. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో వైసీపీ ప్రజాప్రతినిధులను, మంత్రులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీనిపై సీఎం జగన్‌ తీవ్ర అసహనంతో ఉన్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

తన ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన సొంత సర్వేలో వెల్లడైనట్లు తెలిసింది. ప్రభుత్వ వ్యతిరేకతపై ఆ సర్వేతో పాటు పీకే టీమ్‌ ఇచ్చిన నివేదికలు ఆయనకు అందాయని వైసీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనివల్లే ఆయనలో అసహనం పెరిగిపోతోందని పార్టీ నేతల్లో చర్చ నడుస్తోంది. వివిధ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం జరిపిన ప్రతిసారీ.. వారికి వస్తున్న ర్యాంకులను జగన్‌  ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్‌ రిపోర్టును చదివి వినిపిస్తున్నారు. ఎవరికీ సరైన మార్కులు రావడం లేదు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వాలంటే ఇక్కడ పనితీరే కొలమానమని కుండబద్దలు కొడుతున్నారు. అయినా వారు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సొంత సర్వేలో, పీకే టీమ్‌ సర్వేలో ఏకంగా ప్రభుత్వంపైనే తీవ్ర వ్యతిరేకత నెలకొందన్న సమాచారం ఆయన్ను కలవరపరుస్తోందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అందుకే తన తీరు మార్చుకున్నారు. ఇన్నాళ్లూ ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చేవారు. తాజా పరిణామాలతో ఇప్పుడు పంథా మార్చి బుజ్జగింపులకు దిగుతున్నారు. అంతేకాదు.. ఇన్నాళ్లూ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వివిధ పథకాల డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో వేసేవారు. ఇప్పుడు జిల్లాల్లో సభలు ఏర్పాటుచేసి వేదికలపైన బటన్‌ నొక్కుతున్నారు. గత మే నెలాఖరులో టీడీపీ మహానాడు కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం కావడం.. ఆ తర్వాత జరిగిన చంద్రబాబు సభలకు జనాదరణ అధికంగా కనిపిస్తుండడం.. గడప గడపలో ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండడం ముఖ్యమంత్రికి రుచించడం లేదని వైసీపీ వర్గాలు అంటున్నాయి. సంక్షేమ పథకాల కింద డబ్బు పంచుతున్నా ఇంతగా ప్రజాగ్రహం పెల్లుబకడానికి కారణాలేంటని ఆయన ఆరా తీశారు. పెట్రోలు, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణమని సర్వేల్లో తేలింది. 


స్వీయ స్లోగన్‌తో తంటా..

జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో, ఎన్నికల ప్రచార సమయాల్లో.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై చార్జీలు, పన్నులను విపరీతంగా వేస్తోందని.. బాదుడే బాదుడు అంటూ నినదించారు. ఆ స్వీయ స్లోగన్‌ ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంటోంది. పెట్రోలు, డీజిల్‌, వంట నూనెలు, పప్పులు, నిత్యావసరాలపై జగన్‌ సర్కారే ఇప్పుడే తెగ బాదుతోంది. టీడీపీ కూడా ‘బాదుడేబాదుడు’ కార్యక్రమంతో జనంలోకి వెళ్తోం ది.  దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు ‘గడప గడపకూ’ కార్యక్రమంలో భాగంగా తమ వద్దకు వచ్చినప్పుడు జనం గట్టిగా నిలదీస్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గనకే మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. గతంలో రూ.100 ఉన్న వంటనూనె ధర రూ.200 అయిందని.. తమ నుంచి పిండేసిన డబ్బునే తమకు ఇస్తున్నారంటూ కొందరు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోనే కాదని.. ఇతర రాష్ట్రాల్లోనూ పెరిగాయంటూ మంత్రి వారికి లెక్కల కథలు చెప్పడానికి ప్రయత్నించారు. ఇలాంటివి తమకు చెప్పొద్దంటూ వారే ఎదురు లెక్కలు చెప్పడంతో ఆయన కాలికి బుద్ధి చెప్పాల్సి వచ్చింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితే అంబటి రాంబాబుకూ ఎదురైంది.


సంక్షేమం మోత..

సంక్షేమ పథకాల కింద ఇస్తున్న సొమ్ము కంటే.. ధరల పెరుగుదల వల్ల కలుగుతున్న నష్టంపై ప్రతి కుటుంబమూ తీవ్ర ఆగ్రహంతో ఉందని వైసీపీ సొంత సర్వేలో తేలింది. 2019 ఎన్నికలకు ముందున్న నిత్యావసరాల ధరలకు, ఇప్పటి ధరలకూ మధ్య భారీ వ్యత్యాసం ఉందని.. రెండింతల నుంచి మూడింతలు పెరిగాయని మహిళల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. మరీ ముఖ్యంగా వంటనూనెల ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరగడంతో వారికి ఆ సెగ గట్టిగానే తగులుతోంది. కందిపప్పు, మినప్పప్పు సహా ఇతర నిత్యావసరాల ధరలూ చుక్కలు చూపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్‌పై పన్ను తగ్గించినా.. మన రాష్ట్రంలో జగన్‌ ససేమిరా అన్నారు. పైగా ప్రతి లీటరుపై రూపాయి చొప్పున రోడ్డుసెస్‌ వసూలు చేస్తున్నారు. పెట్రోలు ధరలను కేంద్రమే తగ్గించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నా.. జనం వినిపించుకోవడం లేదు. ఇక మద్య నిషేధం విషయంలో జగన్‌ సర్కారు తీరుపైనా మహిళలు ఆగ్రహంతో ఉన్నట్లు పీకే టీమ్‌ సర్వేలో వెల్లడైంది. దశలవారీ నిషేధం ఉత్తదేనని తేలిపోవడంతో.. ఎన్నికల ముందు, తర్వాత జగన్‌ ఇచ్చిన హామీలను వారు గుర్తుచేసుకుని మరీ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. అన్నిటినీ మించి కరెంటు చార్జీలు సామాన్యులకు షాకిస్తున్నాయి. తమ సర్కారుకు నిత్యావసరాల షాక్‌ తప్పదని తెలిసే.. వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్రంపై విమర్శలు చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.



Updated Date - 2022-08-03T07:59:52+05:30 IST