రఫాడించాడు

ABN , First Publish Date - 2022-07-07T08:26:03+05:30 IST

వావ్‌..అదీ ఆట..హోరాహోరీ ఐదు సెట్లు..పైగా టైబ్రేకర్‌.. నాలుగు గంటలకుపైగా పోరు..మధ్యలో గాయం..అయినా రఫెల్‌ నడాల్‌ వెరవలేదు..బుల్‌లా పోరాడాడు..

రఫాడించాడు

మహిళల సెమీస్‌లో

హలెప్ X రిబకినా 

జెబ్యూర్‌ X మరియా 

వింబుల్డన్‌ సెమీ్‌సలో స్పెయిన్‌ బుల్‌

హోరాహోరీ క్వార్టర్స్‌లో ఫ్రిట్జ్‌ చిత్తు

ఫైనల్‌ బెర్త్‌ కోసం కిర్గియోస్‌తో ఢీ  


లండన్‌: వావ్‌..అదీ ఆట..హోరాహోరీ ఐదు సెట్లు..పైగా టైబ్రేకర్‌.. నాలుగు గంటలకుపైగా పోరు..మధ్యలో గాయం..అయినా రఫెల్‌ నడాల్‌ వెరవలేదు..బుల్‌లా పోరాడాడు.. ఆఖర్లో తనదైన మ్యాజిక్‌ ప్రదర్శించాడు..ఫలితం వింబుల్డన్‌ సెమీస్‌ ప్రవేశం.. బుధవారం జరిగిన ఉత్కంఠభరిత పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో 36 ఏళ్ల నడాల్‌ 3-6, 7-5, 3-6, 7-5, 7-6 (4) స్కోరుతో 24 ఏళ్ల అమెరికా ఆటగాడు టేలర్‌ ఫ్రిట్జ్‌ను చిత్తు చేశాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాకు చెందిన నికీ కిర్గియో్‌సను రఫా ఢీకొంటాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో కిర్గియోస్‌ 6-4, 6-3, 7-6 (5) స్కోరుతో క్రిస్టియన్‌ గారిన్‌ (చిలీ)ను ఓడించాడు. ఇక మాజీ చాంపియన్‌ సిమోనా హలెప్‌, 17వ సీడ్‌  ఎలెనా రిబకినా మహిళల సింగిల్స్‌ సెమీ్‌సలో అమీతుమీకి సిద్ధమయ్యారు.


మూడేళ్ల కిందట ఇక్కడ టైటిల్‌ గెలిచిన 16వ సీడ్‌ హలెప్‌ (రుమేనియా) 6-2, 6-4 స్కోరుతో 20వ సీడ్‌ అమందా అనిసిమోవా (అమెరికా)ను క్వార్టర్స్‌లో చిత్తు చేసింది. ఇంకో క్వార్టర్స్‌లో రిబకినా 4-6, 6-2, 6-3 స్కోరుతో టొమ్లజనోవిక్‌ (క్రొయేషియా)పై గెలుపొందింది. గురువారం జరిగే రెండో సెమీ్‌సలో మూడో సీడ్‌ జెబ్యూర్‌ (ట్యునీసియా)తో తతజానా మరియా (జర్మనీ) తలపడతారు. 


తొలిసెట్‌ ఫ్రిట్జ్‌దే..: మొదటి సెట్‌ను సొంతం చేసుకోవడం ద్వారా నడాల్‌కు ఫ్రిట్జ్‌ షాకిచ్చాడు. తొలి గేమ్‌లోనే ఫ్రిట్జ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన రఫా..తన సర్వీ్‌సను కూడా నిలబెట్టుకొని ఆధిక్యం ప్రదర్శించాడు. కానీ ఆరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన ఫ్రిట్జ్‌ 3-3తో సమం చేశాడు. అదే ఊపులో వరుసగా ఐదు గేమ్‌లు నెగ్గి మొదటి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్‌ ఆరంభంలోనూ ఫ్రిట్జ్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన స్పెయిన్‌ బుల్‌ 3-0తో ముందంజ వేశాడు. కానీ మొదటి సెట్‌ మాదిరే పోరాడిన టేలర్‌..4-3తో ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించాడు. ఈ దశలో ‘మెడికల్‌ టైమవుట్‌’ తీసుకున్న నడాల్‌ తిరిగి వచ్చాక విజృంభించి రెండో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. మూడో సెట్‌లో రఫా సర్వీస్‌ బ్రేక్‌ చేసిన టేలర్‌ 1-1తో సమంగా నిలిచాడు. అదే జోరులో మూడో సెట్‌ను అమెరికన్‌ గెలుచుకున్నాడు. నాలుగో సెట్లో తన అనుభవాన్ని రంగరించిన నడాల్‌ మూడుసార్లు టేలర్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసి 6-5తో నిలిచాడు.


ఆపై తన సర్వీ్‌సను నిలబెట్టుకొని నాలుగో సెట్‌ నెగ్గి..మ్యాచ్‌ను ఐదో సెట్‌కు మళ్లించాడు. పోటాపోటీగా సాగిన ఐదో సెట్‌లో అద్భుతంగా ఆడిన నడాల్‌ ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి 4-3 ఆధిక్యం ప్రదర్శించాడు. అయితే వెంటనే రఫా సర్వీస్‌ బ్రేక్‌ చేసిన ఫ్రిట్జ్‌ 4-4తో సమం చేయడంతోపాటు తన సర్వీ్‌సనూ నిలబెట్టుకొని 5-4తో ముందంజ వేయగా.. రఫా కూడా సర్వీస్‌ నిలబెట్టుకొని 5-5తో సమం చేశాడు. అలా సాగిన  ఆఖరి సెట్‌ టైబ్రేకర్‌కు మళ్లింది. ఇందులో తిరుగులేని ఆటతో నడాల్‌ మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేశాడు. 

Updated Date - 2022-07-07T08:26:03+05:30 IST