హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో గత నెలలో జరిగిన హత్య కేసులో భార్యే హంతకురాలని పోలీసులు తేల్చారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గగన్ అగర్వాల్(38) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే గగన్ అగర్వాల్ తప్పిపోయినట్టుగా ఎల్బీ నగర్లో మిస్సింగ్ కేసు నమోదైందని ఆయన తెలిపారు. ఈ కేసును వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కి కేసును పోలీసులు ట్రాన్స్ఫర్ చేశారని ఆయన తెలిపారు. గగన్ అగర్వాల్ మిస్సింగ్ పై పీఎస్‌లో గగన్ భార్య, మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశారన్నారు. దర్యాప్తు చేసి అగర్వాల్ హత్యకు గురైనట్లు వనస్థలిపురం పోలీసులు తేల్చినట్లు ఆయన తెలిపారు.
ఈ కేసులో గగన్ అగర్వాల్ రెండో భార్య నౌసియా బేగం పోలీసులను మొదట తప్పుదోవ పట్టించిందన్నారు. గగన్ అగర్వాల్ భార్య నౌసియా బేగంపై అనుమానంతో దర్యాప్తు చేశామని ఆయన పేర్కొన్నారు. అగర్వాల్‌ను తానే కత్తితో హత్య చేసి ఇంటి వెనుకాల పూడ్చి పెట్టినట్టు విచారణలో నౌసియా బేగం ఒప్పుకుందని ఏసీపీ తెలిపారు. దీంతో ఇంట్లో ఉన్న అగర్వాల్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు. నౌసియా బేగానికి గతంలో జరిగిన మొదటి పెళ్లితో ఆమెకు నలుగురు కూతుర్లు ఉన్నారన్నారు.
రెండేళ్ల క్రితమే మొదటి భార్యకు గగన్ అగర్వాల్ విడాకులు ఇచ్చాడు. గత జూన్‌లో నౌసిన్ బేగం((మరియాద)ను గగన్ అగర్వాల్ వివాహం చేసుకున్నాడని ఏసీపీ తెలిపారు. మొదటి భర్తతో నౌసిన్ విడిపోయాక గగన్ అగర్వాల్, నౌసియా బేగం ఇద్దరు ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత మన్సురాబాద్‌లోని అగర్వాల్ ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటున్నారని ఆయన తెలిపారు.
నౌసిన్ కూతుర్లపై తన భర్త గగన్ అగర్వాల్ ప్రవర్తన సరిగ్గా లేక పోవడంతో హత్య చేసినట్లు ఆమె చెపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నామని ఆయన అన్నారు. పోలీసుల అదుపులో రెండవ భార్య నౌసిన్ బేగం ఉందన్నారు. ఈ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారో వారందరినీ అరెస్టు చేస్తామని ఏసీపీ పురుషోత్తం రెడ్డి ప్రకటించారు.