ముస్లింలపై అంత గుడ్డి ద్వేషమెందుకు?

ABN , First Publish Date - 2020-11-24T09:37:34+05:30 IST

‘‘బీజేపీ నేతలు మాపై చార్జిషీట్‌ విడుదల చేసి టీఆర్‌ఎస్‌- ఎంఐఎం సర్కారు వైఫల్యం అంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎంఐఎం భాగస్వామిగా ఉందా?

ముస్లింలపై అంత గుడ్డి ద్వేషమెందుకు?

కేంద్రంలోని మోదీ సర్కారుకు మేం మద్దతు ఇవ్వలేదా?

అంత మాత్రానికే బీజేపీకి మిత్రపక్షం అయిపోతామా?

అలాగే మజ్లిస్‌ కూడా మాకు అంశాలవారీ మద్దతు ఇచ్చింది

ఆరేళ్లలో ఏ తప్పూ చేయలేదు.. ఎవరికీ కీడు చేయలేదు

బీజేపీ అబద్ధాలను నమ్మితే మోసపోతారు.. గోసపడతారు

ఈసారి సెంచరీ ఖాయం.. పాతబస్తీలోనూ పది డివిజన్లు

బీజేపీ సోషల్‌ మీడియాలో ఎక్కువ.. సొసైటీలో తక్కువ

ఆరేళ్లుగా ఏమీ చేయని ఆ పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలి?

వరదలొస్తే ప్రధాని రాలేదు.. పైసలు కూడా పంపలేదు

ఇప్పుడే 25 వేల చొప్పున వరద సాయం ఇవ్వొచ్చు కదా

అప్పుడు చప్పట్లు కొడతాం.. డ్యాన్సులు కూడా చేస్తాం

ఎక్స్‌ అఫీషియో అవసరం లేకుండా బల్దియాను జయిస్తాం

రూ.40-50 లక్షల ఇల్లు ఉచితంగా ఇవ్వడం మోసమా!?

టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీ నేతలు మాపై చార్జిషీట్‌ విడుదల చేసి టీఆర్‌ఎస్‌- ఎంఐఎం సర్కారు వైఫల్యం అంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎంఐఎం భాగస్వామిగా ఉందా? అలా చెప్పడానికి సిగ్గు, ఇంగిత జ్ఞానం ఉన్నాయా? ముస్లిములపై అంత గుడ్డి వ్యతిరేకత, ద్వేషం ఎందుకు? అంత విషం చిమ్మడం ఎందుకు? ఒక కార్పొరేషన్‌ కోసం.. నాలుగు ఓట్ల కోసం ఈ రకమైన రాజకీయాలతో దిగజారడమా? ఒక కేంద్ర మంత్రి వచ్చి మరీ చార్జిషీట్‌ విడుదల చేయాలా? ఆయనకు వాస్తవం ఏమిటో తెలుసా?’’ అని పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. జీఎస్టీ, నోట్ల రద్దు, ఉప రాష్ట్రపతి ఎన్నిక సమయంలో తాము బీజేపీకి మద్దతు ఇచ్చామని, మరి, తాము బీజేపీకి మిత్రపక్షం అవుతామా అని ప్రశ్నించారు.

అలాగే, మజ్లిస్‌ కూడా తమకు నాలుగు అంశాల్లో మద్దతు ఇచ్చిందని, అంత మాత్రాన మేం భాగస్వాములమా? అని విరుచుకుపడ్డారు. బీజేపీ ఆటలు అహ్మదాబాద్‌, అక్కడా.. ఇక్కడా నడవొచ్చునని, హైదరాబాద్‌లో సాగవని స్పష్టంచేశారు. బీజేపీ నేతలు మతపరమైన అద్దాల నుంచి బయటికి రావాలని, విషయం చెప్పాలే కానీ విషం చిమ్మటం మానేయాలని సూచించారు. బీజేపీ నేతలను ఢిల్లీ నుంచి వచ్చి వెళ్లే టూరిస్టులుగా అభివర్ణించారు. కరోనా, వరదలు సహా అన్ని వేళలా ప్రజలకు అండగా ఉండేది తమ ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ నేతలేనని చెప్పారు.


‘‘గడిచిన ఆరేళ్లలో తెలిసి తెలిసీ ఏ తప్పూ చేయలేదు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతోనే ముందుకు సాగాం. ఎవరికీ కీడు చేయలేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో సమతుల్యత పాటించాం’’అని వివరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున అన్నీ తానై వ్యవహరిస్తున్న మంత్రి కేటీఆర్‌ సోమవా రం ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పార్టీ, ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారి అబద్ధాలను నమ్మితే మోసపోతారని, గోస పడతారని హితవు పలికారు. మంత్రి కేటీఆర్‌ ఇంటర్వ్యూ పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..


గుంత లేని రోడ్డు చూపిస్తే రూ.10 లక్షలిస్తా

బీజేపీ నేతలకు ఇదే నా సవాల్‌! దేశంలోని ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లోని నగరాల్లో మానవ అభివృద్ధి సహా పలు అంశాల్లో హైదరాబాద్‌ కంటే ఏవైనా ముందు నిలిచాయా? నీ ముంబై బాగుందా? నీ అహ్మదాబాద్‌ బాగుందా? ఎందులో బాగుంది? పోదామా? చూద్దామా? హైదరాబాద్‌లో గుంతలు లేని రోడ్లను చూపిస్తే లక్ష రూపాయలు ఇస్తానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని నగరాల్లో గుంతలు లేని రోడ్లను చూపిస్తే లక్ష కాదు.. నేను పది లక్షల రూపాయలు ఇస్తాను. చూపిస్తారా?


  ఇది అభివృద్ధి కాదా!?

ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌లో ఐటీ ఉందా? అక్కడికి మెట్రో రాలేదా? ఉప్పల్‌లో శిల్పారామం రాలేదా? ఎల్బీనగర్‌లో ఎస్‌ఆర్‌డీపీ పనులు కనిపించటం లేదా? పలు చోట్ల మీకు వాటర్‌ రిజర్వాయర్లు రాలేదా? గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు పెట్టలేదా? 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయలేదా? ఇది అభివృద్ధి కాదా?




ఎంఐఎంను ఓడించే దమ్ము బీజేపీకి ఉందా?

గ్రేటర్‌ ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్‌, ఎంఐఎం మాత్రమే ఇక్కడ ఉంటాయి. గత ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ 99 డివిజన్లు గెలిస్తే, మజ్లిస్‌ 44 స్థానాల్లో గెలిచింది. అప్పుడు పోటీ టీఆర్‌ఎస్‌, ఎంఐఎం మధ్యనే జరిగింది. నాడు మజ్లిస్‌ గెలిచిన డివిజన్లలో 12 చోట్ల 500 ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్‌ రెండో స్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో ఎంఐఎంను ఓడించింది టీఆర్‌ఎస్సే. బీజేపీ కాదని గుర్తిస్తే మంచిది. వాళ్లు పాతబస్తీలో ఒక్క సీటు గెలిస్తే, మేం ఐదు సీట్లు గెలిచాం.


ఈసారి కూడా మేం పాతబస్తీలో 10 డివిజన్లు గెలుస్తాం. బీజేపీ ఎన్ని గెలుస్తుందో చూస్తాం!  ఈసారి గ్రేటర్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌, ఎంఐఎం మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. టీఆర్‌ఎస్‌, ఎంఐఎంను జత కట్టి చూపిస్తామనే బీజేపీ నేతలకు ఒక విషయం చెబుతున్నా. వాళ్లకు ఎంఐఎంను ఓడగొట్టే దమ్ము లేదు కావచ్చు. కానీ, టీఆర్‌ఎ్‌సకు ఆ దమ్ము ఉంది. బీజేపీ దూకుడు సోషల్‌ మీడియాలో ఎక్కువ. సొసైటీలో తక్కువగా కనిపిస్తుంది. గ్రేటర్‌ ఫలితాల తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలే చూస్తారు.    


బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలి!?

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. గడిచిన ఆరేళ్లుగా కేంద్రం నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌కు తెచ్చిన నిధులు ఎన్నో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజలకు సూటిగా చెప్పాలి. ఆరేళ్లుగా ఏమీ చేయని బీజేపీని గెలిపిస్తే ఏదో చేస్తానంటే నమ్మడానికి హైదరాబాద్‌ ప్రజలు అమాయకులు కాదు. బీజేపీకి ఇక్కడి జనం ఎందుకు ఓటు వేయాలి? తెలంగాణ ప్రభుత్వం వరద సాయం ఇస్తామంటే అడ్డుకున్న బీజేపీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతోంది. రాష్ట్రాలకు జీఎస్టీ రాబడి తగ్గితే పరిహారం చెల్లిస్తామని చట్టంలోనే చెప్పారు.


ఇప్పుడు యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ అంటున్నారు. అది యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ కాదు.. యాక్ట్‌ ఆఫ్‌ ఫ్రాడ్‌. ఎవరైనా విధానపరమైన నిర్ణయాలపై ప్రశ్నిస్తే, మతాన్ని అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు.  చట్టాలను తుంగలో తొక్కి దేశాన్ని, రాష్ట్రాలను నిస్సిగ్గుగా మతం ముసుగులో రాజకీయం, మోసం చేస్తున్న పార్టీ బీజేపీ.  స్థానిక ఎన్నికల్లో చేసిన అభివృద్ధి గురించి కాకుండా ఏం చెబుతాం? ఇండియా-చైనా యుద్ధం గురించి చెప్పాలా? లేకపోతే ఇండియా, పాకిస్థాన్‌ గురించి చెప్పమంటారా?  




మర మనిషి ఉన్నా నిధులు ఇవ్వాల్సిందే

కేంద్రం నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌కు ఎన్నో నిధులు తెచ్చామని బీజేపీ నేతలు అంటే అవి తెలివితక్కువ మాటలే. రాజ్యాంగబద్ధంగా.. ఫైనాన్స్‌ కమిషన్‌ ప్రకారం కేంద్రంలో ప్రధానిగా మోదీ కాదు.. ఆ స్థానంలో మర మనిషి ఉన్నప్పటికీ మన కు ఆటోమేటిక్‌గా, బై డిఫాల్ట్‌గా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సిందే. మేం ఢిల్లీకి వివిధ పన్నుల రూపంలో రూ.2,75,000 కోట్లు చెల్లిస్తే, తిరిగి రూ.1,40,000 కోట్లు మాత్రమే కేంద్రం తిరిగి చెల్లిస్తోంది.  


ఇవి మినీ అసెంబ్లీ ఎన్నికలూ కాదు..  

గ్రేటర్‌ ఎన్నికలేమీ మినీ అసెంబ్లీ కాదు. హైదరాబాద్‌ కూడా ఒక కార్పొరేషనే. రాష్ట్రంలోని 141 మునిసిపాలిటీల్లో ఇది కూడా ఒకటి. ఒక స్థానిక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వ పాలనకు రెఫరెండమ్‌ ఎలా అవుతుంది? గత ఎన్నికల సమయంలో తాము గెలుస్తామని, గెలవకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చాలెంజ్‌ చేశా. విపక్ష పార్టీల నుంచి ఒక్కరైనా ఆ సవాల్‌ స్వీకరించారా?  


వరద సాయంగా విపక్షాలు ఏం చేశాయి?

వరద సహాయక చర్యల్లో నేను ఒక్కడినే కాదు. స్థానిక కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, హైదరాబాద్‌ మంత్రులు అంతా భాగస్వాములయ్యారు. వరద బాధితులను సీఎం కేసీఆర్‌ పరామర్శించలేదని అంటున్నారు. ఆయన అనుమతి, చొరవ, అంగీకారం లేకుండానే వరద బాధితులకు రూ.650 కోట్లు ఇచ్చామా? ప్రధాని మోదీ రాలేదు. పైసలు కూడా పంపలేదు. గుజరాత్‌లో వరదలు వస్తే ప్రధాని అక్కడికి వెళ్లారు. మరి హైదరాబాద్‌కు ఎందుకు రాలేదు? టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వరద బాధితుల కోసం రెండు నెలల జీతాలను విరాళంగా ప్రకటించారు. విపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఒక్కరైనా ఆ పని చేశారా? కనీసం ప్రజల్లో తిరిగారా?  


అభివృద్ధిని చూడ్డానికి అహ్మదాబాద్‌ వెళ్లలేదు

అహ్మదాబాద్‌లో టెక్స్‌టైల్‌ సమ్మిట్‌ జరిగితే సంబంధిత శాఖ రాష్ట్ర మంత్రిగా నేను అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. బీజేపీ వాళ్లకు అహ్మదాబాద్‌ అనేది ప్రపంచ రాజధాని. కేంద్రంలోని ఆ పార్టీ ప్రభు త్వం ఢిల్లీలో పెట్టాల్సిన ఆ సదస్సును అందుకే అక్కడ పెట్టింది. అంతే తప్ప, అభివృద్ధిని చూడటానికి నేను అక్కడికి వెళ్లలేదు.


గుంతలున్నాయని ఒప్పుకొంటే తప్పేంటి?

రోడ్లపై గుంతలనేవి ఒక్క హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా అన్ని నగరాల్లోనూ ఉన్నా యి. అయినా, హైదరాబాద్‌ రోడ్లపై గుంత లు ఉన్నాయని ఒప్పుకొంటే తప్పేంటి? ఇటీవల వరదలు వచ్చాయి. నీరు అనేది తారుకు శత్రువు. మన డ్రైనేజీ సిస్టమ్‌ బాగాలేదు. చేయాల్సిన బాధ్య త మాపై ఉంది. చేస్తాం. ఐదేళ్లలో విద్యుత్‌, నీటిసరఫరా బాగు చేసుకున్నాం. రోడ్లు కొంత బాగు చేసుకున్నాం. పిండికొద్దీ రొట్టె. ఎట్లా డబ్బు ఉంటే అట్లా ప్రాధా న్యం మేరకు పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. హైదరాబాద్‌లో కోటి మంది ఉన్నారు. వారిలో ఓ పది మంది గొడవ చేస్తే అదేదో అంతర్జాతీయ విషయం అన్నట్టు చూస్తున్నారు. అదీ ఒక్క చోట.. ఒక్క కాలనీలో జరిగింది. దానికే టీఆర్‌ఎస్‌ నేతలను నిలదీస్తున్నారని అంటున్నారు.

మరి, బీజేపీ రాష్ట్ర ఆఫీసులోనే గలాటా జరిగింది. కుత్బుల్లాపూర్‌లో బీజేపీ ఆఫీసు పగిలింది. కూకట్‌పల్లిలో వాళ్ల ఆఫీసును తగలబెట్టారు. ఆ పార్టీ నేతలు గన్‌ఫౌండ్రీలో బట్టలు చింపుకొని కొట్టుకుంటున్నారు. అంటే, బీజేపీ మొత్తం అస్తవ్యస్తమై ఢిల్లీనుంచి కింది దాకా దొమ్మీలు చేసుకొని కొట్టుకుంటున్నారని అనాలా?


111 స్థలాల్లో ఇళ్లు లేకపోతే మాకు ఓట్లేయవద్దు

హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల 111 స్థలాల్లో ఇళ్లు లేకపోతే ఈ గ్రేటర్‌ ఎన్నికల్లో మాకు ఓట్లేయవద్దు. పనులు జరుగుతున్నాయా? లేదా? అక్కడ లక్ష ఇళ్లు ఉన్నది వాస్తవమా? కాదా? దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవాలపై నివేదిక ఇవ్వాలని, ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నా. అందుబాటులో ఉన్న స్థలాలకు అనుగుణంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టాం. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ తరహాలో రూ.18 వేల కోట్ల వ్యయంతో ఇళ్ల నిర్మాణం ఎక్కడైనా జరుగుతోందా? ఒకవేళ ఎక్కడైనా ఉన్నాయని చెబితే, నేను కూడా వెళ్లి చూసి వస్తా.  


ఇళ్ల కోసం ఓపిక పడితే తప్పేమిటి?

హైదరాబాద్‌లో సొంత ఇల్లు అనేది సామాన్యుడి కల. అలాంటిది పైసా భారం లేకుండా రూ.40-50 లక్షల విలువైన ఇల్లును ఇస్తున్నప్పుడు ఆరు నెలలు జాప్యమైతే అవుతుంది. అప్పటి వరకు ఓపిక పడితే తప్పేమి ఉంది? మేం నాణ్యత విషయంలో రాజీపడటం లేదు. కరోనా వచ్చిన విషయం మర్చిపోతే ఎలా? లక్షల మంది కార్మికులు వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఆ సైట్లలో ఎవరు పనిచేయాలి? సహజంగానే రోడ్లు సహా అన్ని పనులూ స్లో అయ్యాయి. ఈ క్రమంలోనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు నెమ్మదించాయనేది వాస్తవం. కేటాయింపులో జాప్యం జరిగింది వాస్తవం. దీనిలో మేం మోసం చేయటం ఏముంది? ఫ్రీగా ఇళ్లు ఇవ్వటం మోసమా? ఇప్పటి వరకు ఎన్నో కొన్ని అయితే ఇళ్లు ఇచ్చాం కదా?


అన్ని పార్టీల్లోనూ పురుష పెత్తనమే కదా?

మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఉన్నా.. వారి భర్తలే పెత్తనం చలాయించడం అన్ని పార్టీల్లోనూ ఉంది. ఎన్నికలు లేని సమయంలోనూ మహిళలు రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలి. పని చేయకుండా ఎన్నికల టైంలోనే వస్తామంటే సరికాదు. 


నాకు కరోనా ఇప్పుడు వస్తే వస్తుంది

కరోనా బారిన పడకుండా ఉండటానికి మాస్క్‌ పెట్టుకోవడం, శానిటైజ్‌ చేసుకోవటానికి మించిన ఉపాయం లేదు. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో మాస్క్‌ తీసేసి మాట్లాడాల్సి వస్తోంది (నవ్వుతూ). నాకు కరోనా ఇప్పుడు వస్తే వస్తుంది!? అయినా, ఎన్నికల ప్రచార గడువు ముగిసే వరకు నాకు కరోనా రావద్దని కోరుకుంటున్నాను.




కబ్జాలు నిజమే

హైదరాబాద్‌ పరిధిలో కొన్ని దశాబ్దాలుగా ఆక్రమణలు, నాలాలు, చెరువుల కబ్జాలు జరిగాయి. ఇది ఏదేని ఒక ప్రభుత్వ హయాంలోనే జరిగిందని నిందించను. మా ప్రభుత్వం వచ్చాక ఆక్రమణలు, కబ్జాలు జరగలేదని చెప్పను. వాటితోపాటు భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో వరద ఇబ్బందులు తలెత్తాయి. అందుకే, గతంలో ఎస్‌ఆర్‌డీపీ అమలు చేసినట్లే.. ఈసారి స్ట్రాటజిక్‌ నాలా డెవల్‌పమెంట్‌ అనే ఇంకో కార్యక్రమం తీసుకోబోతున్నాం. నాలాలు, చెరువులు, మూసీ నదిని అనుసంధానం చేస్తాం. ఇది ఒక్క టీఆర్‌ఎ్‌సకే సాధ్యమవుతుంది. ఎందుకంటే, కేంద్రం పైస ఇవ్వదు. చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. బ్రహ్మాండంగా హైదరాబాద్‌ను ఆధునీకరిస్తాం.


ఈసారి ‘సెంచరీ’ కొడతాం


ఈసారి కచ్చితంగా బల్దియాపై ‘గులాబీ’ జెండా ఎగురుతుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మేయర్‌ అవుతారు. గత ఎన్నికల్లో 150 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ 99 చోట్ల గెలిచి చరిత్ర సృష్టించింది. ఇదివరకు ఒక పార్టీ సొంతంగా జీహెచ్‌ఎంసీని కైవసం చేసుకున్న దాఖలాలు లేవు. మిగిలిన పార్టీలకు ప్రజలు అవకాశం ఇవ్వకుండా టీఆర్‌ఎ్‌సకి గెలుపు కట్టబెట్టారు. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఈసారి కూడా ఎక్స్‌ అఫీషియో ఓట్లు అవసరం పడకుండానే బల్దియాను జయిస్తామనే విశ్వాసం నాకు ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ చెమటోడుస్తున్న పరిస్థితి లేదు. నాకున్న సమాచారం మేరకు గ్రేటర్‌లో మెజారిటీ ప్రజల మద్దతు టీఆర్‌ఎ్‌సకి ఉంటుంది.


రూ.25 వేల సాయం చేయండి...డ్యాన్సులు కూడా చేస్తాం

గ్రేటర్‌ ఎన్నికల్లో గెలిస్తే వరద బాధితులకు రూ.25 వేల ఆర్థిక సాయం చేస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. గెలుపు దాకా ఎందుకు? కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా? ప్రభుత్వం సాయం చేసిన 6.5 లక్షలమంది జాబితాను నేను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పంపిస్తాను. వాళ్లలో ప్రతి ఒక్కరికీ రూ.25 వేల చొప్పున కేంద్రం నుంచి ఆర్థిక సాయం విడుదల చేయండి. గ్రేటర్‌ ప్రజల మనసు కొల్లగొట్టండి. అలా చేస్తే మాకేమీ అభ్యంతరం లేదు. వాళ్లు ఆ డబ్బు ఇస్తే దీపాలు వెలిగిస్తాం.. చప్పట్లు కొడతాం.. డ్యాన్సులు కూడా చేస్తాం.


ప్రజలే మా బలం

ప్రజలు ఆశీర్వదిస్తే, ఏ పార్టీ అయినా దూసుకెళ్తుంది. అందుకు టీఆర్‌ఎస్సే నిదర్శనం. 2009లో గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం లేని దశ నుంచి ఈ స్థాయికి చేరుకున్నాం. ఏ నాయకుడిని అయినా అధికారంలోకి తీసుకురావాలన్నా, అధికారం నుంచి దించి వేయాలన్నా ప్రజలే కారణం. అందుకే మేం వారిని బలంగా నమ్ముతాం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. పేదలకు అండగా నిలబడుతున్నాం. టీఆర్‌ఎస్‌ పనితీరు బాగుండటం వల్లనే ఇప్పటికే ఒకసారి హైదరాబాద్‌ సహా అన్ని మునిసిపాలిటీలు గెలిచాం. జిల్లా పరిషత్‌లు గెలిచాం, 2018లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం. ప్రజల ఆదరణ ఉంటే ఏదైనా సాధించవచ్చు. అది మాకు ఉందని విశ్వసిస్తున్నా.


కరెంటు, నీళ్లు, రోడ్ల విషయంలో సక్సెసయ్యాం

గ్రేటర్‌ పరిధిలో గడిచిన ఐదేళ్లలో మంచినీటి వసతి మెరుగు కోసం బలమైన ప్రయత్నం చేసి, చాలా వరకు సఫలీకృతం అయ్యాం. కరెంట్‌ సరఫరా మెరుగుపర్చాం. రోడ్లు బాగు చేశాం. శానిటేషన్‌ మెరుగుపర్చాం. ఇలా ఎన్నో చేశాం. చేస్తున్నాం కూడా. గత, ఇప్పటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌కు పెద్దగా తేడా లేదు. షార్ట్‌ షెడ్యూల్‌ అనేది నిజం కాదు. అప్పుడు కూడా 15 రోజుల వ్యవధిలోనే ఎన్నికలు జరిగాయి.


టీఆర్‌ఎ్‌సపై వ్యతిరేకతనేది సరికాదు

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని ఎక్కువ ఊహించుకుంటున్నారు. నేను మాత్రం దానిని భూతద్దంలో చూడటంలేదు. దుబ్బాకలో గెలిచిన బీజేపీ 2012లో మహబూబ్‌నగర్‌ ఉప ఎన్నికల్లోనూ గెలిచింది. కానీ, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. అలాగే, బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో 4 స్థానాల్లో గెలిచాక జరిగిన పరిషత్‌, మునిసిపల్‌ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. టీఆర్‌ఎస్‌ 2014 నుంచి ప్రతి ఎన్నికలోనూ అప్రతిహత విజయాలను సాధిస్తూనే ఉంది. ఒక్కసారి, అదీ ఒక ఉప ఎన్నికలో ఓడిపోతే సీరియ్‌సగా తీసుకోవాల్సిన పనిలేదు.

స్థానిక పరిస్థితుల వల్ల దుబ్బాక ఫలితంలో తేడా వచ్చి ఉండవచ్చు. అంతేతప్ప టీఆర్‌ఎ్‌సపై వ్యతిరేకత ఉందనేది కరెక్ట్‌ కాదు. దుబ్బాక అసెంబ్లీ స్థానం పరిధిలో ఉన్న ఓటర్లు 2 లక్షల మంది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న ఓటర్ల సంఖ్య 2 కోట్లు. 74 లక్షల మంది ఓటర్లున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఏం చెబుతుందో చూద్దాం.  


బిన్‌ లాడెన్‌ గురించి మాట్లాడొచ్చా?

హైదరాబాద్‌ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మేం పక్క రాష్ట్రం గురించి మాట్లాడవద్దు. కానీ, బీజేపీ నేతలు బిన్‌ లాడెన్‌, అక్బర్‌, బాబర్‌, పాకిస్థాన్‌ గురించి మాట్లాడవచ్చా? ఇది ఏం లాజిక్‌? కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బెంగళూరులో వచ్చిన వరదలపై ఎందుకు మాట్లాడరు?




రైతులకు సాయాన్ని ఆపుతున్నది కేంద్రమే


ఎన్నికలున్నాయనే హైదరాబాద్‌లో వరద సాయం చేశారనేది తప్పు. ఎన్నికలు లేనిచోట్ల కూడా వరద సాయం అందించాం. వరదలతో దెబ్బతిన్న పంటల వివరాలను కేంద్రానికి నివేదించాం. కేంద్రం, రాష్ట్రం కలిసి నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సి ఉంది. ఎప్పటి మాదిరిగానే వారికి ఇప్పుడూ ఇన్‌పుట్‌ సబ్సిడీ, నష్టపరిహారం అందుతాయి. రైతు బంధు.. బీమా తెచ్చిన సీఎం కేసీఆర్‌కు రైతుల విషయంలో ప్రేమ లేదని మాట్లాడితే సిల్లీగా ఉంటుంది. సన్న వడ్లకు మద్దతు ధర ఇవ్వకుండా కేంద్రమే ఆపుతోంది.

చివరికి బోనస్‌ ఇద్దామన్నా మోకాలడ్డుతోంది. దీనిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాదనగలరా? ఎఫ్‌సీఐ నిబంధనల కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ఇచ్చి సన్న వడ్లను కొనలేకపోతోంది. రైతుల కోసం సీఎం కేసీఆర్‌ రూ.వెయ్యి కోట్లు పెట్టటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఆపుతున్నది.. అడ్డుపడుతున్నది కేంద్ర ప్రభుత్వమే. దాంతోనే రైతులకు నష్టం జరుగుతోంది.


Updated Date - 2020-11-24T09:37:34+05:30 IST