మేమెందుకు ఓటీఎస్‌ కట్టాలి?

ABN , First Publish Date - 2022-01-25T08:17:06+05:30 IST

‘మేం కష్టపడి ఎప్పుడో కట్టుకున్న ఇళ్లు..

మేమెందుకు ఓటీఎస్‌ కట్టాలి?

  • రేపు మరొకరొచ్చి పట్టాలు 
  • చెల్లవంటే మా పరిస్థితేంటి? 
  • మా ఇళ్లు కుదవ పెట్టుకుని 
  • జగన్‌ సార్‌నే తినమనండి
  • అధికారులపై మండిపాటు 


మనుబోలు, జనవరి 24: ‘మేం కష్టపడి ఎప్పుడో కట్టుకున్న ఇళ్లు.. ఇప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలి? రేపు ప్రభుత్వం మారి ఇంకొకాయన వచ్చి పట్టాలు చెల్లవంటే మా డబ్బుల పరిస్థితేమిటి?’ అంటూ నెల్లూరు జిల్లా మనుబోలు మండలం యాచవరం గ్రామస్థులు ఓటీఎ్‌సపై అధికారులను నిలదీశారు. యాచవరంలో ఓటీఎస్‌ కింద 70మంది వరకు లబ్ధిదారులు ఉండగా ఒక్కరూ కూడా రూ.10వేలు కట్టేందుకు సుముఖంగా లేరు. దీంతో వీరికి అవగాహన కల్పించేందుకు మండల టాస్క్‌ఫోర్స్‌ అధికారి ప్రదీ్‌పకుమార్‌ ఆధ్వర్యంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌  నాగరాజు, ఏపీఎం శైలజ సోమవారం గ్రామానికి వచ్చారు. ఓటీఎస్‌ గురించి అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని, సద్వినియోగం చేసుకోవాలని చెబుతుండగా పొదుపు మహిళలు అడ్డుపడ్డారు. ‘‘తాతల కాలంలో కట్టిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలి. మేం ఇళ్లు కట్టుకున్నది బ్యాంకుల్లో తనఖా పెట్టుకునేందుకు కాదు. మేం కట్టలేం.. మా ఇళ్లు కూడా కుదవ పెట్టుకుని జగన్‌  సార్‌నే తినమ ను’’ అంటూ మండిపడ్డారు. ఆపద, అవసరం అన్నప్పుడు పొదుపులో రుణాలు ఇవ్వకుండా, మా అనుమతి లేకుండా ఓటీఎ్‌సకు ఎలా డబ్బులు డ్రా చేయనిస్తారని ప్రశ్నించారు. కూలి పనులు చేస్తేనే పూట గడుస్తుందని, అలాంటప్పుడు పది వేలు ఎక్కడ నుంచి తెచ్చికట్టాలన్నారు. దీనికోసం అప్పు చేస్తే ఎలా తీర్చగలమంటూ వారు ఆవేదన చెందారు. తాము ఓటీఎస్‌ కట్టలేమంటూ గ్రామస్థులు తెగేసి చెప్పడంతో అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు.

Updated Date - 2022-01-25T08:17:06+05:30 IST