ఈడబ్ల్యూఎస్‌ కోటా ఎందుకివ్వరు?

ABN , First Publish Date - 2021-01-06T07:29:35+05:30 IST

అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) 10ు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత

ఈడబ్ల్యూఎస్‌ కోటా ఎందుకివ్వరు?

  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం సూటి ప్రశ్న
  • 10% కోటాకు కేంద్రం రాజ్యాంగ సవరణ
  • అయినా మీరెందుకు అమలు చేయట్లేదు?
  • అన్ని కోర్సుల్లోనూ అమలు చేయండి 
  • ఇందుకు సానుకూల నిర్ణయం తీసుకోండి 
  • తెలంగాణ సర్కారుకు హైకోర్టు సూచన
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ


హైదరాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. విద్య, ఉపాధి అంశాల్లో ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 10% రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేసినా ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అన్ని కోర్సులకూ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేసేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈమేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.


ఈడబ్ల్యూఎస్‌ 10% కోటా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేస్తే, కేవలం వైద్య విద్యలో తప్ప ఎక్కడా దీనిని అమలు చేయడం లేదంటూ బీజేపీ తెలంగాణ ఓబీసీ యువమోర్చా అధ్యక్షుడు ఆలె భాస్కర్‌రాజ్‌, మరొకరు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు జారీచేస్తోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అన్నారు. వైద్య విద్యలో మాత్రమే రిజర్వేషన్లు అమలు చేస్తోందని, మిగిలిన కోర్సులకు దీనిని వర్తింప చేయడం లేదన్నారు. 

పిటిషనర్‌ వాదనలు విన్న ధర్మాసనం విధాన నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రభుత్వ వివరణ తీసుకుని చెబుతానని, నాలుగు వారాలు గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 


Updated Date - 2021-01-06T07:29:35+05:30 IST