తిరుపతిలో చంద్రబాబుపై రాళ్లదాడి వెనకున్న పెద్దలెవరు..!?

ABN , First Publish Date - 2021-04-18T19:37:43+05:30 IST

దక్కుతుందన్న గెలుపు దూరం అవుతోందన్న అసహనం వారిలో వ్యక్తమవుతోందా?...

తిరుపతిలో చంద్రబాబుపై రాళ్లదాడి వెనకున్న పెద్దలెవరు..!?

తిరుపతి వైసీపీలో ప్రస్ట్రేషన్‌ అధికమైందా? అక్కడ జరిగిన లోక్‌సభ ఉపఎన్నికలో టీడీపీకి సానుకూల వాతావరణం ఏర్పడుతుండటాన్ని ఆ పార్టీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారా? దక్కుతుందన్న గెలుపు దూరం అవుతోందన్న అసహనం వారిలో వ్యక్తమవుతోందా? చంద్రబాబుపై రాళ్లదాడి తమ పని కాదని ఎవరూ అడగక ముందే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరూ పట్టించుకోని ఓ అంశం ఏమిటి? అసలు ఆ ఘటనపై తిరుపతి వాసుల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? అనే విషయాలను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం.


తీవ్రంగా స్పందించిన బాబు..

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో జరిగిన రాళ్లదాడిపై తిరుపతి వాసుల్లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. అలాగే ఆ ఘటన వెనుక ఎవరు ఉన్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. నిజానికి ఘటన జరిగిన రోజున.. చంద్రబాబు సభ దాదాపు ముగిసే సమయం ఆసన్నమైంది. అప్పుడు ఆయన ఏం మాట్లాడాలో కూడా జనం సూచిస్తున్నారు. రమణ దీక్షితులు గురించి, మద్యం ధరల గురించి ఇలా చాలా అంశాలు సభలోని వారే చంద్రబాబుకు గట్టిగా అరిచి చెబుతున్నారు. ఈలోపు ఓ వ్యక్తి తనపై రాయిపడిందని అరవడంతో చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.


పోలీసులు ఎవ్వరూ లేరా..!?

పిరికిపందల్లా దాక్కుని రాళ్లు వేయటం ఏమిటి? దమ్ము ఉంటే బయటకు రండి తేల్చుకుందాం అన్నారు. గాయపడిన వ్యక్తిని తన వ్యాను ఎక్కించారు. ఇంతలో మరో వ్యక్తి తనపై రాయిపడిందన్నారు. ఆ తర్వాత మరో మహిళ.. ఇలా వరుసగా రాళ్లు పడ్డవారు స్పందిస్తున్నారు. చంద్రబాబు గాయపడిన వారినుంచి రాయి తీసుకుని జనానికి కూడా చూపించారు. అదే విధంగా పోలీసులకు కూడా చూపించే ప్రయత్నం చేశారు. అయితే చూసేందుకు పోలీసులు లేరు. దీంతో చంద్రబాబు ఆశ్చర్యపోయారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ప్రతిపక్షాలు అడుగు తీసి అడుగు వేయాలంటే.. అడ్డు తగులుతున్న పోలీసులు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నికల్లో మచ్చుకు ఒక్కరు కూడా కన్పించలేదు. పోలీసులు ఎవ్వరూ లేరా? అని జనాన్నే చంద్రబాబు అడిగారు. వారు లేరని సమాధానం రావడంతో చంద్రబాబు వ్యాన్ దిగి రోడ్డుపై బైఠాయించారు.


రాజకీయ కోణంలో కాదా..!?

చంద్రబాబు రోడ్డుపై బైఠాయించిన విషయం తెలియగానే పోలీసులు వచ్చారు. అయితే ఎస్పీ వచ్చే వరకు తాను లేవనని చెప్పిన ఆయన.. తానే స్వయంగా ఎస్పీ కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ ఎస్పీ లేకపోవటంతో అడిషనల్ ఎస్పీ సుప్రజ, మునిరామయ్యలు చంద్రబాబు వద్దకు వచ్చారు. జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న తన పర్యటనలో ఏదైనా జరిగితే అన్ని అయ్యాక వస్తారా? అని ఆయన నిలదీశారు. ఇందుకు పోలీస్‌ అధికారుల నుంచి సమాధానం లేదు. అయితే చంద్రబాబుపై రాళ్లదాడి ఘటనను అందరూ రాజకీయ కోణంలో చూస్తున్నారు తప్ప పోలీసుల వైఫల్యం కోణంలో ఎవ్వరూ ఆలోచించటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు రోడ్డుపైన బైఠాయించింది కూడా రాజకీయ కోణంలో కాదట.


భద్రతా వైఫల్యమే..!

ప్రత్యక్షంగా అక్కడ ఉన్నవారికే ఆయన అంతరంగం అర్థం అయిందట. పోలీసుల వైఫల్యాన్నే చంద్రబాబు ప్రశ్నించారు. సాధారణంగా వీవీఐపీ భద్రత నేపథ్యంలో వారి సభలు, సమావేశాలకు పోలీసులు ముందస్తుగా భద్రతా చర్యలు తీసుకుంటారు. భవనాలపై కాపలా ఉంటారు. అయితే అలాంటి జాగ్రత్తలేవీ అప్పుడు చంద్రబాబు ప్రచారానికి తీసుకున్నట్లు కనిపించలేదు. సభ జరుగుతుండగా.. పోలీసులు ఎవ్వరూ లేకపోవటం భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపింది. చంద్రబాబుతోపాటు ఉంటే బ్లాక్ క్యాట్ కమాండోలు తప్ప, పోలీసులు ఎవ్వరూ లేరు. దీనిపై ప్రభుత్వం ఏం చెబుతుంది? ఈ వైఫల్యాన్ని ఎలా కప్పిపుచ్చుకుంటుంది? అని టీడీపీ నేతలతోపాటు రాజకీయ వర్గాలవారు ప్రశ్నిస్తున్నారు.


ఈ దాడి వెనుక ఎవరున్నారు..!?

ఇంతకీ చంద్రబాబుపై రాళ్లదాడి వెనుక ఎవరు ఉన్నారు? ఏం చేయాలనుకున్నారు? అన్న ప్రశ్నలు తలెత్తిన క్రమంలో.. ఆ ఘటనతో తమ పార్టీకేమీ సంబంధం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. అయితే ఆయన స్పందించిన తీరు.. గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు పర్యటనలో యువత, సాధారణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారు. పార్టీలతో సంబంధం లేనివారు చంద్రబాబు సభలకు వస్తున్నారు. ఆయన చెప్పింది ఆసాంతం వింటున్నారు. ఆలోచిస్తున్నారు. ఇలాంటి వారిని టార్గెట్‌ చేసుకునే చంద్రబాబుపై రాళ్లదాడి చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సభలకు టీడీపీ క్యాడర్‌ వరకు వస్తే ఫర్వాలేదట. ఆలోచనాపరులు రాకూడదన్నదే లక్ష్యమట. వారిని లక్ష్యంగా చేసుకునే చంద్రబాబుపై రాళ్లదాడికి ఒడిగట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి.


తిరుపతి వాసులు ఏమనుకుంటున్నారు..!?

ఇక తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరడంతో.. తెలుగుదేశం పార్టీ జోరు పెంచింది. ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. టీడీపీ నేతల సభలకు సాధారణ ప్రజలు భారీగా హాజరవుతున్నారు. చంద్రబాబు ప్రచారానికి జనాలు పోటెత్తుతున్నారు. ఈ పరిణామాలన్నీ అధికార వైసీపీ నాయకులను కంగారు పెడుతున్నాయట. తొలుత ఏదో మెజారిటీ తగ్గితే తగ్గవచ్చునన్న స్థాయి నుంచి.. ఇప్పుడు అసలు గెలుస్తామో లేదో అనే పరిస్థితి నెలకొందట. దీన్ని జీర్ణించుకోలేనివారు నిరాశ, నిస్పృహ భావంలో కుంగిపోయి రాళ్లదాడి ద్వారా అసహనాన్ని ప్రదర్శించారట. అసలు ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఇలా వ్యవహరించారని కొందరు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి ఇటీవల తెలుగుదేశం పార్టీ సభలకు వస్తున్న జనం, స్పందనను దెబ్బకొట్టడానికే ఈ దాడి జరిగిందనే చర్చ తిరుపతి వాసుల్లో జరుగుతోంది.



Updated Date - 2021-04-18T19:37:43+05:30 IST