‘ఆ సఖ్యత’ రాష్ట్రాలలో ఎందుకు లేదు?

ABN , First Publish Date - 2022-04-12T06:10:23+05:30 IST

భారత సహకార సమాఖ్య వ్యవస్థలో ఒక ముఖ్య భూమికగా భావించబడుతున్న గవర్నర్ స్థానం అది ఏర్పాటైన నాటినుంచి ఏదో ఒకరకమైన వివాదాస్పద వ్యవస్థగా మిగిలిపోయింది...

‘ఆ సఖ్యత’ రాష్ట్రాలలో ఎందుకు లేదు?

భారత సహకార సమాఖ్య వ్యవస్థలో ఒక ముఖ్య భూమికగా భావించబడుతున్న గవర్నర్ స్థానం అది ఏర్పాటైన నాటినుంచి ఏదో ఒకరకమైన వివాదాస్పద వ్యవస్థగా మిగిలిపోయింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారమే ఇందుకొక తాజా తార్కాణం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తన పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నదని ప్రధానమంత్రిని, కేంద్ర హోం మంత్రిని కలిసి తమిళిసై ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి. తనను అవమానిస్తున్నారని, వివక్ష చూపుతున్నారని, గవర్నర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని మీడియా ప్రతినిధులతో ఆమె అన్నారు. అంతటితో ఆగకుండా తాను తలచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పడిపోయేదని తమిళిసై అన్నట్లు కూడా వార్తలొచ్చాయి! మన దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ రాష్ట్రాధినేత. సమస్త కార్యనిర్వాహక అధికారాలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి. రాష్ట్ర శాసనసభ మెజారిటీ సభ్యుల నాయకుడు ఆయన. గవర్నర్ విషయానికొస్తే, రాజ్యాంగం ప్రకారం, ఆయన లేదా ఆమె, రాష్ట్రానికి నామమాత్రపు అధిపతి మాత్రమే. నియమించేది ప్రధాని సిఫారసు మేరకు రాష్ట్రపతి. కేంద్రంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు, విధులు ఉంటాయో రాష్ట్ర స్థాయిలో గవర్నర్‌కు కూడా అలాంటి అధికారాలు, విధులే ఉంటాయి. రాజ్యాంగపరంగా తమకు సంక్రమించిన అధికారాలను సహకార సమాఖ్య స్ఫూర్తితో భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి మాత్రమే గవర్నర్లు ఉపయోగిస్తారని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అయితే అందరూ కాకపోయినా కొందరు గవర్నర్లు, అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అండతో వాటిని దుర్వినియోగం చేయడం వాస్తవం. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో గవర్నర్ అధికారాలను, కేంద్రంలో రాష్ట్రపతి అధికారాలను పోల్చి చూస్తే ఆసక్తికరమైన విషయాలు అవగతమౌతాయి.


భారత రాజ్యాంగ నిబంధనల, ప్రకరణల ప్రకారం అపరిమితమైన అధికారాలు ఉన్నది రాష్ట్రపతికా? లేక ప్రధానమంత్రికా? అన్న ఒక విద్వత్ చర్చ జరిగితే, వచ్చే సమాధానం, నిర్ద్వంద్వంగా రాష్ట్రపతికే విశేషాధికారాలు ఉన్నాయనేది. గవర్నర్లకు అలా అధికారాలు లేవు. భారత రాష్ట్రపతిని లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులు, అంతా కలిసి ఎన్నుకుంటారు కాని ప్రధానమంత్రి కేవలం లోక్‌సభ సభ్యుల్లో మెజారిటీ పార్టీకి మాత్రమే నాయకుడు. పోనీ ఎక్కువలో ఎక్కువ, పార్లమెంటరీ పార్టీ నాయకుడు. దీనర్థం, ప్రాతినిధ్యపరంగా రాష్ట్రపతే ప్రధానికంటే ఎక్కువ. గవర్నర్ విషయంలో అలా కాదు. గవర్నర్ కేవలం నామినేటెడ్ అయిన వ్యక్తే. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యక్తి. 


భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణంలో కూడా, స్పష్టంగా కానీ, పరిపూర్ణంగా కానీ, అస్పష్టంగా కానీ, ఎక్కడా రాష్ట్రపతి కంటే ప్రధానమంత్రికి ఎక్కువ అధికారాలున్నాయని చెప్పడం జరగలేదు. కాకపోతే చాలామంది రాజ్యాంగ నిపుణులు బ్రిటిష్ నమూనాను, అక్కడి అనుభవాలను, సంప్రదాయాలను మన రాజ్యాంగానికి అన్వయించి ఉదాహరణలు ఇస్తుంటారు. వాస్తవానికి మనది చాలావరకు బ్రిటిష్ మోడల్ అయినప్పటికీ దాన్ని మొత్తానికి మొత్తం అనుసరించడం లేదు. కొంతమేరకు మనది పార్లమెంటరీ వ్యవస్థ అయితే, కొంతమేరకు ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అనాలి. అయినప్పటికీ ఇంతవరకూ ఏ రాష్ట్రపతి తన అధికారాలను ఉపయోగించుకున్న దాఖలాలు కాని, దుర్వినియోగపరచిన సందర్భాలు కానీ, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు కాని, తనను అవమానించారని చెప్పడం కాని, తాను తలచుకుంటే కేంద్ర ప్రభుత్వం పడిపోయేది అని అనడం కాని జరగలేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ప్రధానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఆమోదయోగ్యమైన వ్యక్తి కావడమే. గవర్నర్ల విషయంలో అలా కాదు. ముఖ్యమంత్రికి ఆమోదయోగ్యమైన వ్యక్తి అయినా, కాకపోయినా ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. అలా నియమితుడైన వ్యక్తి చాలా సందర్భాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వ్యక్తి అయ్యుంటారు. 


భారత రాజ్యాంగం ప్రకారం నిజమైన కార్యాచరణ వ్యవస్థ రాష్ట్రపతిదే కాని ప్రధానిది కాదు. రాష్ట్రపతికి సహాయపడేందుకు, సలహా ఇచ్చేందుకు మంత్రిమండలి ఏర్పాటుకు సంబంధించి ఆర్టికల్ 74 వివరిస్తుంది. రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సలహాలను, సూచనలను స్వీకరిస్తారని ఆ అధికరణలో పేర్కొనడం జరిగింది. రాష్ట్రాలలో కూడా గవర్నర్ పాత్ర ఇలాంటిదే. ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సూచనలను, సలహాలను పాటించి తీరాల్సిందే. 


భారత గణతంత్ర రాజ్యానికి సర్వాధినేత రాష్ట్రపతి. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకు రాష్ట్రపతే అధిపతి. త్రివిధ దళాలకు ఆయనే కమాండర్ ఇన్ చీఫ్. రాష్ట్రపతి నేరుగా కానీ లేదా తన అధీనంలో పనిచేస్తున్న మరే అధికారి ద్వారా కానీ, తన అధికారాలను అమలు చేయవచ్చునని రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 చెప్తున్నది. వివాదాస్పద, చర్చనీయాంశమైన ఆర్డినెన్సులను జారీ చేసే శాసనాధికారం కూడా రాష్ట్రపతిదే. ఆ విధంగా రాష్ట్రపతికి అపారమైన అధికారాలున్నాయనాలి. కాకపోతే ఇంతవరకు ఎన్నికైన రాష్ట్రపతులందరు ప్రతి విషయంలో ప్రధానమంత్రులకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి విషయంలో తమిళిసై లాగా విభేదించిన సందర్భాలు కేంద్రంలో దాదాపు లేవనే చెప్పాలి. అధికరణ 75 ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధానిని రాష్ట్రపతి నియమించడానికి ఫలానా విధమైన పద్ధతి అని రాజ్యాంగంలో ఎక్కడా ప్రత్యేకంగా నిబంధనలు పొందుపరచలేదు. సంప్రదాయాలుండవచ్చు. అది పూర్తిగా రాష్ట్రపతి విచక్షణాధికారం. 


ఇందిరాగాంధీ హత్యానంతరం అప్పటి రాష్ట్రపతి జైల్ సింగ్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీవ్ గాంధీని ఎన్నుకోక ముందే ఆయన్ను ప్రధానిగా పదవీ ప్రమాణస్వీకారం చేయించారు. 1989 సాధారణ ఎన్నికల అనంతరం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విముఖత వ్యక్తపరచడంతో వీపీ సింగ్‌ను ప్రధానిగా నియమించడానికి, ఆ తరువాత ఆయన రాజీనామా దరిమిలా, మొదలు రాజీవ్ గాంధీని, తరువాత చంద్రశేఖర్‌ను ఆహ్వానించడానికి, అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ తన విచక్షణాధికారాలను పూర్తిగా వినియోగించుకున్నారు.


ఇంతవరకూ చెప్పిన ఉదాహరణలు రాష్ట్రపతి విచక్షణాధికారాలకు సంబంధించినవి కాగా, 1979లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా వ్యవహరించిన తీరు ఆ పదవికి ఉన్న ప్రాధాన్యతను తెలియచేస్తుంది. మొరార్జీ దేశాయి ప్రభుత్వం విశ్వాస నిరూపణలో ఓటమి తరువాత మొదలు వైబీ చవాన్‌ను ఆహ్వానించడంలో, తరువాత, మొరార్జీకి మరో చాన్స్ ఇవ్వకుండా ఉండడంలో, చరణ్ సింగ్‌ను చివరకు ప్రధానిగా నియమించడంలో రాష్ట్రపతి పాత్ర ప్రాముఖ్యత సంతరించుకున్నదే కాకుండా ఆ వ్యవస్థకున్న విశేష అధికారాలను కూడా ప్రస్ఫుటపరుస్తున్నది. ఆ తరువాత చరణ్ సింగ్‌ను విశ్వాస పరీక్షకు ఆదేశించారు రాష్ట్రపతి. అలా ఆదేశించడం అదే అప్పటికి మొదటిసారి. 25 రోజుల్లోపలే చరణ్ సింగ్ ప్రధానిగా రాజీనామా చేసి పార్లమెంట్‌కు పోని మొదటి-, చివరి ప్రధానిగా చరిత్రపుటల్లో మిగిలిపోయారు. లోక్‌సభను రద్దు చేయమన్న ఆయన సిఫార్సుకు నీలం సంజీవరెడ్డి అంగీకరించారు. చరణ్ సింగ్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగమన్నారు. దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రపతిని విమర్శించాయే కాని ఆయన అధికారాలను కుదించలేకపోయాయి. ఎందుకంటే రాష్ట్రపతి అధికారం అంత గొప్పది కాబట్టి. ఈ ఉదాహరణలన్నీ ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ప్రధానమంత్రి, ఆయన మంత్రిమండలి వందకు వంద శాతం రాష్ట్రపతి అభిమతానికి అనుగుణంగానే పదవిలో కొనసాగుతారు. కొనసాగి తీరాలి. ఇంతవరకూ జరగకపోయినా, ఇక ముందు జరిగే అవకాశాలు ఏమాత్రం లేకపోయినా, రాజ్యాంగంలోని అంతర్లీన అర్థం ప్రకారం, సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ, తాను నియమించిన ప్రధానిని, ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. కాని అలా జరగడం కాని, రద్దు చేస్తాననడం కానీ జరగలేదు. రాష్ట్రాలలో కొందరు గవర్నర్ల లాగా కేంద్రంలో రాష్ట్రపతి కూడా ప్రవర్తిస్తే స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిస్థితి ఏమయ్యుండేదో? ఇన్ని అధికారాలున్న ఏ భారత రాష్ట్రపతి ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ వివాదాస్పదం కాలేదు. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నుకోబడిన రాష్ట్రపతి, ఒక నీలం సంజీవరెడ్డి లాగానో, ఒక ప్రణబ్ ముఖర్జీ లాగానో తాము ఎన్నుకోబడిన తరువాత వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా వివాదరహితంగా ప్రధానితో కలివిడిగా, సఖ్యతగా పనిచేశారు. కేంద్రంలో రాష్ట్రపతికి ఉన్నట్లుగా రాష్ట్రాలలో అధికారాలు లేని గవర్నర్లు కొందరి విషయంలో అలా ఎందుకు జరగడం లేదనేది కోటి రూకల ప్రశ్న.

వనం జ్వాలా నరసింహారావు

Updated Date - 2022-04-12T06:10:23+05:30 IST