Abn logo
Jun 17 2021 @ 04:04AM

ఆఫ్రికా ఎందుకు గెలుస్తోంది?

కరోనా సెకండ్‌ వేవ్‌తో భారతదేశం ప్రపంచ దేశాల దృష్టిలో అభాసుపాలైంది. ఒకవేళ అంతా సక్రమంగా జరిగి, టీకా ప్రక్రియ పూర్తయి కరోనా బారి నుంచి తప్పించుకున్నా భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవం మరొకటి రాదనే గ్యారంటీ లేదు. ఉదాహరణకు ప్రతి ఏటా ఏదో ఒక కొత్త రోగం పంటలను ఆశిస్తున్న విషయం రైతులందరికీ తెలుసు. అందుకే ప్రతి ఒకటి రెండు సంవత్సరాలకు వ్యవసాయంలో కొత్త రసాయనం ప్రవేశిస్తూంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. మిరప పంటను ఇబ్బంది పెట్టే బొబ్బర వైరస్‌ లాంటి తెగులుకు ఈరోజు వరకు ఎలాంటి నివారణ మార్గాలు మార్కెట్టులో లేవు. బొబ్బర వైరస్‌ వచ్చిన మొక్కలను కాపాడగలిగే అవకాశం లేదు. పొలం మొత్తంలో అన్ని మొక్కలకు బొబ్బర వైరస్‌ ఆశించదు. పక్కపక్కనే ఉన్న కొన్ని మొక్కలు వైరస్సుకు గురవకుండా ఆరోగ్యంగానే పెరుగుతూ ఉంటవి. అదేవిధంగా కరోనా కూడా కొందరిని ఇబ్బంది పెడుతోంది, ఇంకొందరు ఏ జాగ్రత్తలూ తీసుకోకపోయినా బాగానే ఉన్నారు. ఈ రెండు వర్గాల వారిని క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ వల్ల ఇబ్బంది పడుతున్న వర్గం జీవన సరళినీ, పెద్దగా ఇబ్బంది పడనటువంటి వారి జీవన సరళినీ పరిశోధించి వివరణ ఇవ్వగలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. 


ఇక, ప్రపంచ దేశాలన్నింటినీ పరిశీలించినట్లయితే, ఆఫ్రికా ఖండంలోని ఎక్కువ దేశాలలో కరోనా మృతుల సంఖ్య చాలా తక్కువ. నైజీరియా జనాభా 20కోట్లకు పైమాటే. అంత జనాభాలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2117. అదే అమెరికా జనాభా 32.82కోట్లు, కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 6,15,533. అమెరికాలో టీకా ప్రక్రియ జోరుగాసాగుతున్నందున మరణాల రేటు తగ్గింది. మన దేశంలో ఇప్పటివరకు కరోనా వలన మరణించిన వారి సంఖ్య 3,78,751. మన దేశ జనాభా 136.64కోట్లు. మొత్తంగా పరిశీలించినట్లయితే ఆఫ్రికా దేశాలలో మరణాల రేటు చాలా తక్కువ. ఒక్క దక్షిణ ఆఫ్రికాలో మాత్రమే రేటు ఎక్కువగా ఉంది. తక్కిన ఆఫ్రికా దేశాలైన నైజీరియా, యుగాండా, ఇథోపియా లాంటి దేశాలలో మరణాలు రేటు తక్కువ. ఆఖరికి పోషకాహార లోపంతో విపరీతంగా బాధపడుతున్న సోమాలియాలో కూడా మరణాలు చాలా తక్కువ. 


ఆర్థికంగా ఆఫ్రికా దేశాలు పేద దేశాలు కావచ్చేమో కాని ఆరోగ్యపరంగా అవి చాలా దేశాలకంటే ధనిక దేశాలు. నిజానికి అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలతో పోలిస్తే ఆఫ్రికా దేశాలలో శుభ్రత తక్కువ. నేను నాలుగున్నర సంవత్సరాలు నైజీరియాలోని క్వారా స్టేట్‌లో ఉన్నాను. నైజీరియాలో ఒకే గిన్నెలో ఎక్కువమంది ఆహారాన్ని తింటూంటారు. చేతుల శుభ్రత గురించి ఎక్కువగా పట్టించుకోరు. నదులు, కాలువలలో పారే నీటినే తాగుతారు. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. అక్కడ ప్రజలు పెద్దగా మాస్కులు ధరించలేదు, శానిటైజర్లు ఉపయోగించలేదు. టాంజానియాలో ఉన్న నా స్నేహితుడు ‘మేము మాస్కులు పెట్టుకోవడం లేదు, జాగ్రత్తలు తీసుకోవడం లేదు’ అని చెప్పాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా అక్కడ మరణాల రేటు మన కంటే తక్కువగా ఉన్నదంటే వారి వద్ద నుంచి మనం నేర్చుకోవలసింది ఉన్నట్టే. కరోనా వలన ఆఫ్రికా దేశాలలో మరణాల రేటు ఎందువలన తక్కువన్నది తెలుసుకుని మనం తగిన జాగ్రత్తలు తీసుకోగలగాలి. 


మిగతా అన్ని జాతుల లాగానే మనిషి కూడా ఒక జంతువే. వివిధ రకాల కారణాల వలన మనిషి తనను మిగతా జంతువులకన్నా గొప్పగా భావిస్తూ ప్రకృతికి దూరం జరుగుతూ తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకొంటున్నాడు. అభివృద్ధి ముసుగులో అవసరాలను తోసిపుచ్చి అనుకరణలకు ప్రాముఖ్యతనిస్తూ కృత్రిమ జీవనానికి అలవాటుపడుతున్నాడు. ఇదే మానవ వినాశనానికి మూలం అవుతుంది. ఎవరయితే ప్రకృతికి దూరం జరగకుండా, ఆరోగ్యకర జీవనానికి అవసరమైన వృత్తిలో కొనసాగుతున్నారో అలాంటి వారిని కరోనా వంటి వైరస్‌లు ఎక్కువగా ఇబ్బంది పెట్టడం లేదు. ప్రస్తుతం ఉన్న వృత్తులలో వ్యవసాయ వృత్తి ఆరోగ్యకర వృత్తి అని చెప్పవచ్చు. ఆరోగ్యకర జీవనానికి అసరమైన జీవన సరళి వ్యవసాయంలో సహజసిద్ధంగా దొరుకుతుంది. మన దేశం వ్యవసాయ దేశమైనప్పటికీ కరోనా వల్ల మరణాలు ఎక్కువ ఉండటానికి కారణం- మన ప్రజలు పెద్ద సంఖ్యలో వ్యవసాయానికి దూరం జరగటమే. అలాగే మన దేశంలో వైద్యం ఒక వ్యాపారంగా మారడం వల్ల కూడా మరణాల రేటు ఎక్కువ ఉంది. అంతేగాక, మన వ్యవసాయంలో రసాయనాల వినియోగం బాగా పెరిగింది. ఆహార పదార్థాలలో ఉండే విష రసాయనాలు మనలోని వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తున్నాయి. ఆఫ్రికా దేశాలలో పంటల సాగులో రసాయనాలు అతి తక్కువ వాడతారు. కొన్ని పంటలలో అసలు వినియోగించరు. కాబట్టి అక్కడి ప్రజలు తమ ఆహారంలో 60శాతానికి మించి ప్రకృతి సిద్ధంగా పండించినవే ఎలాంటి ప్రాసెసింగ్ లేకుండా తింటున్నారు. అందువలన అక్కడి ప్రజలలో రోగనిరోధక వ్యవస్థ సహజంగా పనిచేస్తోంది. ప్రస్తుత కరోనా నుంచి గుణపాఠం నేర్చుకొని ప్రకృతికి అనుకూలంగా జీవిస్తూ, రసాయనాలు లేని ఆహారాన్ని తింటూ, శారీరక శ్రమ చేస్తూ, మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోగలిగితే మన భవిష్యత్తు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది.

డి. ప్రసాదరావు

(రైతునేస్తం మాసపత్రిక)

ప్రత్యేకంమరిన్ని...