మంత్రుల పన్ను ప్రభుత్వమే చెల్లించాలా?

ABN , First Publish Date - 2020-03-22T10:25:22+05:30 IST

మంత్రుల పన్ను ప్రభుత్వమే చెల్లించాలా?

మంత్రుల పన్ను ప్రభుత్వమే చెల్లించాలా?

  • ఇప్పటికీ దశాబ్దాల నాటి మూస ధోరణేనా!
  • యూపీలో మారిన తీరు ఏపీలో అమలు కాదా?
  • సచివాలయ ఉద్యోగుల్లో చర్చోపచర్చలు


అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఏపీలో మంత్రుల ఆదాయపన్ను ప్రభుత్వమే చెల్లించాలా? ప్రభుత్వమే చెల్లించాలనే నిబంధన ఎన్నో దశాబ్దాల నాటిది. అప్పటి మంత్రుల స్థితిగతులు ఏమిటి, ఇప్పుడు మంత్రుల స్థాయి ఏమిటి? పైగా ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదు కదా! ఉద్యోగులు, అధికారులు సొంతంగా ఐటీ చెల్లిస్తున్నప్పుడు మంత్రులు కట్టుకోలేరా?... సచివాలయ ఉద్యోగులు ఇలా చర్చోపచర్చలు ప్రారంభించారు. ఇటీవల పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఒక జీవో ఈ చర్చకు కారణమైంది. ఏటా మంత్రులకు ప్రభుత్వం చెల్లించే వేతనాలపై ప్రభుత్వమే ఆదాయపన్ను కడుతూ ఉంటుంది. అలాగే ఈ ఏడాదీ మంత్రులకు ఐటీ చెల్లిస్తూ ప్రభుత్వం కొన్ని రోజులుగా ఉత్తర్వులు జారీ చేస్తోంది.


మంత్రులందరికీ వేతనాలు సమానమే అయినా వారికోసం ప్రభుత్వం చెల్లిస్తున్న ఆదాయపన్నుల్లో భారీ తేడాతో ఈ జీవోలు జారీ అయ్యాయి. రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఎక్సైజ్‌, వాణిజ్యపన్నుల శాఖ మంత్రి నారాయణ స్వామి, దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివా్‌సకి సంబంధించిన ఉత్తర్వులు ఇటీవల వెలువడ్డాయి. హోదాలు వేరైనా ఈ ముగ్గురికీ ఒకే రకంగా రూ.1,57,840 ఆదాయపన్నుగా చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక ఏడాదికి వేతనం ద్వారా వీరి స్థూల రాబడి రూ.11,30,900గా ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.


కానీ, విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేశ్‌ కోసం ఇచ్చిన జీవోలో ఈ ఆదాయపన్నును ఏకంగా రూ.3 లక్షలుగా పేర్కొన్నారు. పైగా ఆ జీవోలో వేతనం ద్వారా ఆ మంత్రికి వస్తున్న వార్షిక స్థూలరాబడి, ఇతర వివరాలు ఏమీ పేర్కొనలేదు. దీంతో, ఈ జీవోపై పలు అనుమానాలు తలెత్తాయి. మంత్రులందరికీ సమానవేతనాలు అందుతున్నప్పుడు ఆదాయపన్నులో ఇంత భారీ తేడా ఎందుకొచ్చిందని ఆ శాఖ అధికారులను సంప్రదించగా... లెక్కింపులో జరిగిన పొరపాటు వల్ల వచ్చిందని, త్వరలో సవరించిన ఉత్తర్వులు వెలువరిస్తామని చెప్పారు. దీంతో ప్రజలకు సేవ చేస్తున్న మంత్రులకు ప్రభుత్వం వేతనం, ఇతర అలవెన్సులు ఇస్తోంది కదా దానిపై ఆదాయపన్ను కూడా ప్రజాసొమ్ము నుంచి ప్రభుత్వమే చెల్లించాలా అనే చర్చ ఊపందుకొంది.


అదే ప్రజాసేవలో భాగంగా ఉద్యోగం చేస్తున్న ప్రభుత్వోద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులకూ ప్రభుత్వం వేతనం, అలవెన్సులు ఇస్తోంది. కానీ, ఆదాయపన్ను మాత్రం ఉద్యోగులు, అధికారులే స్వయంగా చెల్లించుకుంటున్నారు. అలాంటిది మంత్రులస్థాయి వ్యక్తులకు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉందా? అని చర్చించుకుంటున్నారు. 


పరిస్థితి మారింది కదా!

రాష్ట్రంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వమే మంత్రులకు చెల్లించే వేతనాలకు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మంత్రులే వారి వేతనాలకు సంబంధించిన ఆదాయపన్ను సొంతంగా చెల్లిస్తారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా ఇలాంటి ఆర్డినెన్స్‌ ఒకటి తీసుకొచ్చారు. ఇక నుంచి మంత్రులు తమ వేతనాలకు సంబంధించిన ఆదాయపు పన్ను వారే స్వయంగా చెల్లించుకోవాలనేది ఈ ఆర్డినెన్స్‌ సారాంశం. గతంలో ప్రజాసేవలోకి వచ్చి మంత్రులైన పేదలు కూడా ఉండడంతో వారి ఆదాయపన్ను ప్రభుత్వమే చెల్లించేలా అప్పట్లో ఉత్తర్వులు ఇచ్చారు. కానీ నేడు పరిస్థితి మారింది. మంత్రులుగా ఉన్న వారి ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే ప్రభుత్వమే ఐటీ చెల్లించాల్సిన పరిస్థితి లేదని అంటున్నారు.

Updated Date - 2020-03-22T10:25:22+05:30 IST