హిందూత్వ అవసరం నాకేంటి?

ABN , First Publish Date - 2021-11-20T07:25:02+05:30 IST

తాము హిందువులుగా పుట్టి హిందువులుగా పెరిగామని, ప్రస్తుతం తమను తాము హిందువులుగా గుర్తించుకుంటున్నామని ఇటీవల ప్యూ సర్వేలో వెల్లడించిన81.6 శాతం మంది హిందువులలో నేనూ ఒకడిని.నేను విశ్వసిస్తున్న, నేను ఆచరిస్తున్న హిందూధర్మంతో చాలా సంతృప్తిగా, ఆనందంగా ఉన్నాను. ప్రాచీన తమిళకవి కనియాన్ అన్నట్టు ‘ప్రతి ఒక్కరూ నా బంధువే’.....

హిందూత్వ అవసరం నాకేంటి?

తాము హిందువులుగా పుట్టి హిందువులుగా పెరిగామని, ప్రస్తుతం తమను తాము హిందువులుగా గుర్తించుకుంటున్నామని ఇటీవల ప్యూ సర్వేలో వెల్లడించిన81.6 శాతం మంది హిందువులలో నేనూ ఒకడిని.నేను విశ్వసిస్తున్న, నేను ఆచరిస్తున్న హిందూధర్మంతో చాలా సంతృప్తిగా, ఆనందంగా ఉన్నాను. ప్రాచీన తమిళకవి కనియాన్ అన్నట్టు ‘ప్రతి ఒక్కరూ నా బంధువే’.


ఏమంచిపూవులను ప్రేమించినానో భారతీయ తమిళుడుగా తమిళనాట జన్మించినాను. నేను పుట్టిన గ్రామం ఇప్పుడు శివగంగై జిల్లాలో ఉంది. గతంలో రామనాథపురం జిల్లాలో ఉండేది. నా కన్నఊరుకు దగ్గరలోనే శివగంగై జిల్లాలోనే ఉన్న పూంగున్రం (దీనినే ఇప్పుడు మహీబలన్ పట్టి అంటున్నారు) గ్రామంలో కనియాన్ పూన్గున్రానర్ ఉదయించాడని చెప్పుకునేందుకు నేను ఎంతో గర్వపడతాను. ఆయన ఒక కవీశ్వరుడు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్ది నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్ది దాకా వర్థిల్లిన ‘సంగం యుగ’ కవి కోకిలల్లో ఆయన ఒకరు. ‘యాదమ్ ఊరే యావారంకెలిర్’ (ప్రతి ప్రదేశమూ నా గ్రామమే, ప్రతి ఒక్కరూ నా బంధువే) అన్న స్ఫూర్తిదాయక సత్యవచనంతో ప్రారంభమయే ఒక 13 పంక్తుల కవిత కనియాన్ యశోచంద్రిక. నిజానికి ఆ కవిత అంతా ఒక మానవతా సంవేదన. సార్వకాలిక, సార్వజనీన భావస్రోతస్సు. ఆ కవితలోని మొదటి పంక్తి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయ కుడ్యంపై అంతర్లిఖితమై ఉంది. 2000 సంవత్సరాలకు పూర్వం తమిళుల జీవన విధానాన్ని ఆ పద్యం ప్రతిబింబిస్తుందని విద్వజ్ఞులు విశ్వసిస్తున్నారు.


సంగం యుగంలో విలసిల్లిన మతాలు శైవం, వైష్ణవం అని ప్రాచీన తమిళ సాహిత్యం వెల్లడించింది. సమానం అంటే జైనం, బౌద్ధం అనంతర కాల మతాలు. హిందూ, హిందూ మతం అనే పదాలు పురాతన తమిళ సాహిత్యంలో ఎక్కడా కానరావు. ‘హిందు అనే పదాన్ని విదేశీయులు ఉపయోగించక ముందు ఆ పదం ఏ భారతీయ భాషలోనూ లేదు. మనలను గురించి చెప్పేందుకు పరదేశీలు వాడుకలోకి తెచ్చిన ‘హిందూ’ అనే పదమే మనలను మనం నిర్వచించుకునేందుకు ఆధారమయింది’ అని నా మిత్రుడు శశిథరూర్ అన్నారు.


తమిళులలో అత్యధికులు, హిందూధర్మాన్ని మనసా వాచా కర్మణా ఆచరిస్తున్న కుటుంబాలలో జన్మించినవారే. గ్రామీణ దేవతలతో సహా అనేక మంది వేల్పులను వారు ఆరాధిస్తారు. పొంగల్, దీపావళి లాంటి పండుగలను ఎనలేని ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. పాల్ కుడమ్, కావాడి మొదలైన ఆచారాలను భక్తితత్పరతతో పాటిస్తారు. తమిళ హిందువులు శతాబ్దాలుగా హిందూయేతర మతాలను అనుసరిస్తున్న వారితో తోబుట్టువుల వలే సహజీవనం చేస్తున్నారు. రెండు వేల సంవత్సరాలుగా క్రైస్తవం, ఎనిమిది వందల సంవత్సరాలుగా ఇస్లాం తమిళుల జీవన ప్రాంగణాలలో పరిఢవిల్లుతున్నాయి. తమిళ భాషను కాలానుగుణంగా ఆధునికీకరించినవారిలోనూ, తమిళ సాహిత్యాన్ని సమున్నతం చేసినవారిలోనూ ముస్లిం, క్రైస్తవ విద్వాంసులు, రచయితలు చాలామంది ఉన్నారు. నాకు తెలిసినంతవరకు తమిళ హిందూ రాజన్యులు ఎవరూ హిందూమత ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు ఇతర మతాలపై ఏ విధమైన యుద్ధమూ చేయలేదు.


హిందూ మతమే నిజమైన మతం అన్న స్వోత్కర్ష ఆ మతానికి లేనే లేదు ‘ప్రపంచానికి సహన భావమూ, విశ్వజనీన ఆమోదమూ రెండూ బోధించిన మతానికి చెందిన వాడినైనందుకు నేను గర్విస్తున్నాను. పరమత సహనాన్ని విశ్వసించడమే కాదు, అన్ని మతాలు నిజమైనవేనని కూడా మేము అంగీకరిస్తాం’ అని స్వామి వివేకానంద అన్నారు. హిందూమతానికి చర్చి లాంటి ఒక సువ్యవస్థిత సంస్థా నిర్మాణం కానీ, పోప్ లాంటి ఒక సర్వోన్నత ఆచార్యుడు కానీ, మహమ్మద్ లాంటి ఒక ప్రవక్త కానీ, ఒక పవిత్ర గ్రంథం కానీ, ఒకే ఆచారం గానీ లేనే లేవు. అనేకం నుంచి దేనినైనా ఎంపిక చేసుకునేందుకు లేదా అన్నిటినీ తిరస్కరించేందుకు హిందువుకు స్వేచ్ఛ ఉంది. హిందువు అయిన వ్యక్తి హిందూధర్మాన్ని ఆచరిస్తూనే ఆస్తికుడు గానూ, నాస్తికుడు గానూ, అజ్వేయవాది గానూ కూడా ఉండవచ్చని హిందూమత ప్రాజ్ఞులు అభిప్రాయపడ్డారు.


లౌకిక వ్యవహారాలలో హిందూమతం విశాల వైఖరిని అనుసరిస్తుంది. వివాహం విషయంలో గానీ, వారసత్వ వ్యవహారాలలో గానీ అది ఒకే విధానాన్ని నిర్దేశించదు. హిందూ న్యాయశాస్త్ర సంస్కరణలు (1955–56) హిందూమతంలో ఒక ఏకత్వాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నించాయి. అయితే ఇప్పటికీ హిందూ లౌకిక వ్యవహారాలు అన్నిటా బహుళత్వం విలసిల్లుతున్నది. ఒక హిందువు ఇతర మతాల దేవుళ్ళను, పుణ్యపురుషులను పూజించడాన్ని హిందూ మతం అనుమతిస్తుంది.


ప్రొఫెసర్ వెండీ డొనిజెర్ (షికాగో విశ్వవిద్యాలయంలో మత అధ్యయనాల విదుషీమణి) అర్ధశతాబ్దికి పైగా సంస్కృత భాషా సాహిత్యాలను, ప్రాచీన భారతీయ మతాలను అధ్యయనం చేస్తున్నారు. ‘పురాతన యుగాలలోని హిందువులు పశుమాంసాన్ని తినేవారన్న విషయం పండితులకు తెలుసని’ ఆమె అన్నారు. ఇందుకు మద్దతుగా రుగ్వేదం, బ్రాహ్మణాల నుంచే కాకుండా వేదాంతి యాజ్ఞ్యవల్క్యుడు, సామాజిక శాస్త్రవేత్త ఎమ్ ఎన్ శ్రీనివాస్‌ల నుంచి కూడా అనేక ఉటంకింపులను ఆమె ఉదహరించారు. వర్తమాన హిందువులలో అనేకమంది మాంసాహారులు, మత్స్యభుక్కులు. అయితే పశు మాంసాన్ని తినరు. చాలామంది హిందువులు శాకాహారులు. గోవధను నిషేధించాలని గాంధీజీ ఎన్నడూ పిలుపునివ్వలేదని ఆమె పేర్కొన్నారు. ‘గోవులను చంపకూడదన్న భావన లేని వారిని మూగజీవాలను చంపకూడదని నేను ఎలా ఒత్తిడి చేయగలను? భారతదేశంలో హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు, పార్సీలు, క్రైస్తవులు, ఇంకా ఇతరమతాల వారు ఉన్నారు’ అని మహాత్ముడు అన్నారని ఆమె తెలిపారు. చాలా మంది ముస్లింలు, క్రైస్తవులు గొడ్డు మాంసాన్ని తినరు. చాలా మంది మాంసాహారులు బీఫ్ తినరు.


1936లో డాక్టర్ అంబేడ్కర్ ‘కుల నిర్మూలన’ అనే వెలువరించని ప్రసంగంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (1885లో స్థాపితం), ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ (1887లో స్థాపితం) మధ్య విభేదాల మూలాలను వివరిస్తూ ‘సాంఘిక సంస్కర్తల’ కంటే ‘రాజకీయ సంస్కర్తల’ ప్రభావ ప్రాబల్యాలే అధికంగా ఉండడం పట్ల విచారం వ్యక్తం చేశారు. రాజకీయ దృక్పథంతో ఆలోచించే హిందువులకు ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు. ‘ప్రజలు తమకు ఇష్టమైన దుస్తులు ధరించేందుకు, ఆభరణాలు పెట్టుకునేందుకు అనుమతించని మీరు రాజకీయ అధికారం చెలాయించడానికి అర్హులేనా? ప్రజలు తాము ఇష్టపడే ఆహారాన్ని తినేందుకు అనుమతించని మీరు రాజకీయ అధికారానికి అర్హులేనా? ఎంత వాస్తవమైనవి ఈ ప్రశ్నలు! ఒక భిన్న సందర్భంలో వాటి ప్రాసంగికత నేటికీ ఉంది సుమా. 


శశిథరూర్ వలే నేనూ ‘ఒక హిందువుగా జన్మించాను, ఇక హిందువుగా పెరిగాను, నా జీవితమంతా నన్ను నేను ఒక హిందువుగా పరిగణించుకుంటాను’. తాము హిందువులుగా పుట్టి హిందువులగా పెరిగామని, ప్రస్తుతం తమను తాము హిందువులుగా గుర్తించుకుంటున్నామని ఇటీవల ప్యూ సర్వేలో వెల్లడించిన 81.6 శాతం మంది హిందువులలో నేనూ ఒకడిని. నేను విశ్వసిస్తున్న, నేను ఆచరిస్తున్న హిందూధర్మంతో చాలా సంతృప్తిగా, ఆనందంగా ఉన్నాను. ప్రాచీన తమిళకవి కనియాన్ అన్నట్టు ‘ప్రతి ఒక్కరూ నా బంధువే’. మరి హిందూత్వ అవసరం నాకేంటి?



పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2021-11-20T07:25:02+05:30 IST