అబ్దుల్ సలాం విషయంలో ఒవైసీ సైలెంట్.. బీజేపీ వ్యూహమా?

ABN , First Publish Date - 2020-11-13T00:27:18+05:30 IST

ఆయనే అసదుద్దీన్ ఓవైసీ. బాహర్ దుష్మన్... అందర్ దోస్తాన్. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎంఐఎం పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చల్లో నడుస్తోంది. ప్రధానంగా బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి విపరీతమైన హైప్‌ను తీసుకొచ్చాయి..

అబ్దుల్ సలాం విషయంలో ఒవైసీ సైలెంట్.. బీజేపీ వ్యూహమా?

హైదరాబాద్ కా సుల్తాన్ అని చెప్పుకుంటూ ఉంటారు. ముస్లింల వాయిస్ అని ప్రకటించుకుంటారు. కేసీఆర్, జగన్ ఇద్దరితోనూ దోస్తీ చేస్తారు. కానీ బీజేపీకి ప్రయోజనం కలిగించే వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఆయనే అసదుద్దీన్ ఓవైసీ. బాహర్ దుష్మన్... అందర్ దోస్తాన్. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎంఐఎం పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చల్లో నడుస్తోంది. ప్రధానంగా బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి విపరీతమైన హైప్‌ను తీసుకొచ్చాయి. మీడియాలో సోషల్ మీడియాలో అదే డిబేటబుల్ టాక్ అయింది. ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సైలెంట్ గా అమలు చేస్తున్న వ్యూహాలే ఈ పరిణామాలకు కారణమవుతున్నాయి.  మొదటి నుంచి హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఎంఐఎం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రధానంగా ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత నెమ్మదిగా ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. అసదుద్దీన్ ఓవైసీ ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో తమదైన రీతిలో పావులు కదుపుతూ పార్టీ ఉనికిని వ్యాపింపజేస్తున్నారు. అలా క్రమక్రమంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పాగా వేస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 


ఎంఐఎం గతంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అసదుద్దీన్ ఓవైసీ తమ పార్టీ అభ్యర్థులను పోటీ చేయించారు. ఫలితంగా అతి తక్కువ సంఖ్యలో ఆయన తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల్లోనూ హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఐదుగురు ఎంఐఎం అభ్యర్థులను గెలిపించారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయనున్నట్లు అసదుద్దీన్ ప్రకటించారు. అక్కడ కూడా ఎంఐఎం జెండా ఎగురవేస్తామని చెప్పారు. ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పోటీ చేస్తే పశ్చిమబెంగాల్ రాజకీయ దృశ్యంలో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. దేశంలోనే ముస్లిం జనాభాలో పశ్చిమబెంగాల్ రెండో స్థానంలో ఉంది. బెంగాల్ రాజకీయ రంగంలోకి ఎంఐఎం ప్రవేశిస్తే అది ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో భారీ మద్దుతు పొందుతున్న తృణమూల్ కాంగ్రెస్ కు ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. 


అయితే అసదుద్దీన్ చాపకింద నీరులా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్న తీరుపై వివాదం మొదలైంది. ప్రధానంగా సోషల్ మీడియాలో అసదుద్దీన్ వైఖరిపై చర్చ జరుగుతోంది. బయటకు శత్రువులని చెబుతున్నా బీజేపీకి ప్రయోజనం కలిగించడమే అసదుద్దీన్ వ్యూహంలో భాగమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో పోటీ చేస్తామన్న ప్రకటన కార్యరూపం దాల్చితే అక్కడ కూడా బీజేపీకి కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అసదుద్దీన్‌కు బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని, అందులో భాగంగానే ముస్లిం ఓట్లను చీల్చుతున్నారని, చివరకు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారని కాంగ్రెస్ సర్కార్ సహా పలు పార్టీలు విమర్శిస్తున్నాయి. బిహార్ ఎన్నికల్లో అందుకు నిదర్శనమని కూడా వాదిస్తున్నారు. బిహార్‌లో పోటీ చేయడం వల్ల ముస్లిం ఓట్లు చీలిపోయాయని, దీంతో ఆర్జేడీ, కాంగ్రెస్ గెలవాల్సిన సీట్లు చేజారి పోయాయని ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లోనూ గతంలో అలాగే పోటా చేశారని, ఓట్లు చీల్చడం తోపాటు సీట్లు కూడా గెలుచుకున్నారని ఆయా పార్టీలు విమర్శిస్తున్నాయి. 



అయితే ఇదే సమయంలో అసదుద్దీన్ వైఖరిపై ఏపీలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పక్కనే ఉన్న తోటి తెలుగు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింల సమస్యల గురించి ఆ వర్గం ఎదుర్కొంటున్న కష్టాల గురించి అసదుద్దీన్‌కు పట్టడంలేదన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కర్నూలులో పోలీసులు వైసీపీ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఓ ముస్లిం కుటుంబం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు ఈ సంఘటనపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. అక్కడ ముస్లింలు ప్రశ్నిస్తున్నాయి. కానీ జాతీయ స్థాయిలో ముస్లింలకు ప్రతినిధినంటూ చెప్పుకుంటున్న ఒవైసీ మాత్రం ఈ అంశం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ముస్లిం కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేదు. దీంతో ఇక్కడి ముస్లింల కష్టాలు పట్టించుకోని వాడు.. ఎక్కడికో వెళ్లి ముస్లింలను ఉద్ధరిస్తానంటూ ఉండటం సందేహస్పదంగా ఉందంటున్నారు. దీని వెనుక బీజేపీ, ఎంఐఎం రహస్య వ్యూహం ఖచ్చితంగా ఉండిఉంటుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

Updated Date - 2020-11-13T00:27:18+05:30 IST