ఎందుకు సార్, ఉన్నట్టుండి అంత కోపం?

ABN , First Publish Date - 2022-02-03T06:21:49+05:30 IST

ఆలోచిస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. విలువలు పోయి విగ్రహాలు వెలియడం, అనుయాయులు అంతరించి భక్తులు మిగలడం, పరిత్యాగులకు పసిడి తాపడాలు తొడగడం విచిత్రంగానే అనిపిస్తాయి...

ఎందుకు సార్, ఉన్నట్టుండి అంత కోపం?

ఆలోచిస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. విలువలు పోయి విగ్రహాలు వెలియడం, అనుయాయులు అంతరించి భక్తులు మిగలడం, పరిత్యాగులకు పసిడి తాపడాలు తొడగడం విచిత్రంగానే అనిపిస్తాయి. కరుణకు, అహింసకు మారుపేర్లయిన బోధకుల పేరుతో బానిసత్వాలు, ఆధిపత్యాలు, రక్తపాతాలు కొనసాగడం, అంతరాలకు భగవంతుడే ఆమోదముద్ర వేయడం, ప్రశ్నలు వెలిగే బుద్ధికి విలోమసత్యాలుగానే కనిపిస్తాయి.


వెయ్యేళ్ల కిందటి మతసంస్కర్త, దేవుడి ఎదుట అంతరాలు లేవని, జ్ఞానానికి ఏ సామాజిక హద్దులు వద్దని చెప్పాడు. అప్పటికి అదే పెద్ద అడుగు కావచ్చు. ఇంతకాలం తరువాత, ఆ గురువు సంస్కారం, ఒక ప్రత్యేకమైన మతంగానో, మతశాఖగానో స్థిరపడిన తరువాత, ఆ పరంపరలో మరిన్ని అడుగులు పడి ఉండాలి కదా? కులం, మతాలు ఉండాల్సిందేనని, వాటి మధ్య అంతరాలు, ఆధిపత్యాలు ఉండకూడదని, ఎవరి ధర్మం వారు నెరవేర్చడమే సమత్వమని కొత్త వ్యాఖ్యానాలు చెబితే ఎక్కడికి చేరుకున్నట్టు మనం? ఒక్క రామానుజుడినే కాదు, తమ కాలానికి సాహసమో విశేషమో అనదగ్గ సంస్కరణలనో ఉద్యమాలనో నడిపిన ప్రతి మహావ్యక్తినీ దేవుణ్ణి చేసి, దైవప్రతినిధిని చేసి, ఆధునిక కాలంలో అయితే మహా నాయకుడిని చేసి, వారి ఆశయాలను మాత్రం పలచబరిచి తిరిగి వ్యవస్థ గాటికే కట్టివేయడాన్ని చూస్తాము.


భగవద్రామానుజులు ఇప్పుడు జీవించి ఉంటే, సోమవారం నాడు చినజీయర్ మాట్లాడిన అనేక అంశాలను అంగీకరించగలరా అన్న సందేహం కలగడం సహజం. విగ్రహాలతో ఉన్న సదుపాయం అదే. అవి మాట్లాడలేవు. రామానుజుల సంగతి పక్కనపెడితే, చినజీయర్ అభిప్రాయాలు కొన్నిటితో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మాత్రం ఏకీభవిస్తారా అన్న మరో ప్రశ్న తలెత్తుతుంది. కుల వ్యవస్థను, అణచివేతను, అస్పృశ్యతను ప్రత్యేకంగా, స్పష్టంగా వ్యతిరేకించకపోయినా, ఇటీవల సామాజిక మాధ్యమాలలో వచ్చిన విమర్శల దృష్ట్యా కావచ్చు, అసమానతల గురించి, కులం హద్దులు దాటవలసిన అవసరం గురించి చినజీయర్ జాగ్రత్తగానే మాట్లాడారు. సామాజిక అభిప్రాయాలు సరే, కానీ, రాజకీయ అభిప్రాయాలు కెసిఆర్‌కు అంతగా రుచించకపోవచ్చు. ‘‘ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నటువంటి వారు లభించడం అదృష్టమ’’ని, దేశాన్ని మన ధర్మం వైపు నడపాలన్న, జాతికి మళ్లీ జీవం పోయాలన్న ఆలోచన ఇంతకాలం ఎవరికీ రాలేదని, ఇప్పటి పాలకులలో అది అంకురించిందని చినజీయర్ అన్నారు. చంద్రశేఖరరావు తన రాజకీయాలలో భాగంగాను, వ్యక్తిగతంగానూ సంచరించే ఆధ్యాత్మిక ప్రపంచంలో చినజీయర్ ముఖ్యులు. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణంలో జీయర్ ప్రభుత్వానికి కీలక సలహాదారులుగా ఉన్నారు. ఇప్పుడు, హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌లో భక్తులకు, పర్యాటకులకు ఆకర్షణగా ఆవిష్కృతమవుతున్న ‘సమతామూర్తి’, జీయర్ ఆశ్రమానికి మరింత ప్రాధాన్యాన్ని తెస్తుంది. రాజగురువుగా మాత్రమే ఉన్న త్రిదండి పరివ్రాజకులు, ఇప్పుడు యావత్ తెలంగాణకు ఆధ్మాత్మిక మార్గదర్శకులుగా పరిగణన పొందుతారు.


తనకు, తన ఆప్తులకు ఇంతగా ముఖ్యులైన చినజీయర్, కేంద్రప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తడమేకాకుండా, ప్రస్తుత ఢిల్లీ పాలకుల ద్వారా ధర్మపరిరక్షణ జరగనున్నదని చెప్పడం కెసిఆర్‌కు రుచిస్తుందా అన్నది సహజమైన అనుమానమే. చిన జీయర్ మాట్లాడిన మరునాడే, కేంద్రబడ్జెట్ అనంతరం కెసిఆర్ కేంద్రం మీద, ప్రధాని మీద, ఆర్థిక మంత్రి మీద తీవ్ర పదజాలంతో విమర్శలు, కొండొకచో దూషణలు కూడా గుప్పించారు. శనివారం నాడు జరగబోయే సమతామూర్తి ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కెసిఆర్ కలసి పాల్గొనవలసి ఉన్నది. మంగళవారం నాటి కెసిఆర్ గుప్పించిన వాగ్బాణాలకు భారతీయ జనతాపార్టీ నుంచి ప్రతిస్పందనల వెల్లువ మొదలయింది. రానున్న రెండు రోజులలో ఈ వేడి పెరుగుతుందే తప్ప, తగ్గుముఖం పట్టదు. మరి, ముచ్చింతల్‌లో ముభావాలు తప్పవా?


అసలింతకూ, కెసిఆర్‌కు కేంద్రం మీద ఎందుకు కోపం వచ్చింది? ఈ ప్రశ్న అందరికీ సహేతుకంగా కనిపించకపోవచ్చు. అదేమిటి, కెసిఆర్ ఈ మధ్య కాలంలో కేంద్రంతో పోరాడుతున్నారు కదా, అందులో భాగమే ఈ విమర్శలు! అని సమాధానం రావచ్చు. బడ్జెట్‌లో రాష్ట్రాలకు అన్యాయం జరిగింది నిజమే కదా అని కూడా జవాబు రావచ్చు. కానీ, ప్రత్యక్షంగా కనిపిస్తున్నదీ, వినిపిస్తున్నదీ వాస్తవమేనా? కార్యకారణాలకు అందే వైఖరులేనా అవి?


ఎన్ని విమర్శలు చేసినా, కెసిఆర్‌లో ఒప్పుకోవలసిన నైపుణ్యం, వాగ్ధార. ఆయన ఎవరి మీద అయినా గురిపెట్టి విమర్శలు, వ్యాఖ్యలు గుప్పిస్తూ ఉంటే, అంతకు మించి శ్రోతలను కట్టిపడేసేది మరేదీ ఉండదు. గంటల తరబడి పత్రికా సమావేశాలు కూడా వార్తాచానెళ్లు లైవ్‌లో ప్రసారం చేయడానికి కారణం, మరే వినోద కార్యక్రమం ఉన్నా కూడా జనం కెసిఆర్ మాటలు వినడానికే ఇష్టపడతారు. ఆయన ఉద్యమనేతగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా తొలిరోజుల్లోనూ, ఆ వాగ్ధారకు తోడు విశ్వసనీయత అధికంగా ఉండేది. ఈ ఏడేళ్ల కాలంలో, ఆయన మాటలో ఉన్న తీవ్రత తీవ్రత కాదని, వాగ్దానాలు నెరవేరి తీరవలసినవి కావని ఆయన అభిమానగణంలో కూడా ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. ఆయన నెరవేర్చినవేమీ లేవని, ఆయన రాష్ట్రానికి చేసిన గొప్ప ఉపకారాలు లేవని కాదు. ఆయన చెప్పేవాటిలో అతిశయపు మాటలేమిటో, జరిగేవేమిటో తెలుసుకునే శక్తి కూడా ఈ మధ్య జనానికి అలవడింది. అట్లా, కొంతకాలంగా కెసిఆర్ కేంద్ర వ్యతిరేక వైఖరి కూడా అనుమానాలకు ఆస్కారం ఇస్తూ వచ్చింది. పార్లమెంటులో అనేక సందర్భాలలో కేంద్రవిధానాలకు మద్దతు ఇవ్వడం, ఢిల్లీలో అగ్రనేతలతో తరచు భేటీ కావడం, రాష్ట్రాల అధికారాలలోకి ఆక్రమణ జరుగుతున్నా కిమ్మనకుండా ఉండడం,- వీటన్నిటి నేపథ్యంలో ఇటీవలి బిజెపి వ్యతిరేక భాషణలు పూర్తి నిజాయితీతో కూడినవి కావేమోనన్న అభిప్రాయం కలిగింది. ఆయన మాట తీరు తెలిసినవారు కాక, మొదటిసారిగా ఎవరైనా మంగళవారం నాడు కెసిఆర్‌ను వినిఉంటే, భారతదేశంలో మమతాబెనర్జీ, స్టాలిన్ ఎందుకూ పనికిరారని, 2024లో ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించే నిబద్ధత, శక్తి కెసిఆర్‌కే ఉన్నదని నమ్మడం ఖాయం.


ఈ మధ్యనే ఎవరో సర్వే చేశారు. తెలంగాణలో బిజెపికి ఆరు లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నదని, ఆ మేరకు ఆ పార్టీ బలం పెరిగిందని ఆ సర్వే సూచించింది. దుబ్బాక దగ్గర నుంచి మొదలుపెట్టి, తెలంగాణ రాష్ట్రసమితి క్రమంగా భారతీయ జనతాపార్టీతో వైరమైత్రి కొనసాగిస్తున్నదని, ప్రత్యర్థి ప్రతిపత్తి నుంచి కాంగ్రెస్‌ను తొలగించడమే కెసిఆర్ ఉద్దేశ్యం కావచ్చునని ఊహాగానాలు సాగుతున్నాయి. అందుకు అనుగుణంగానే బిజెపికి బలం పెరుగుతున్నట్టు వార్తలు రావడం, లాలూచీ కుస్తీ సిద్ధాంతానికి బలం చేకూర్చింది. బిజెపిని ప్రత్యేకంగా పెంచి పెద్దచేయాలని అనుకోకపోవచ్చును కానీ, కాంగ్రెస్, బిజెపి రెంటినీ రెండో స్థానం కోసం పోటీపడేటట్టు చేస్తే, తన పరిస్థితి సురక్షితంగా ఉంటుందని కెసిఆర్ ఆలోచించి ఉండవచ్చు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో, భారతీయ జనతాపార్టీ బలహీనపడకపోయినా గట్టి పోటీలలో నిమగ్నమయింది కాబట్టి, తన విమర్శలను ఢిల్లీ పెద్దలు సీరియస్‌గా తీసుకోరనే నమ్మకమూ ఉండవచ్చు. ఇప్పుడిక కేంద్రంలో భాగస్వామ్యం సాధ్యపడకపోయినా, 2024 తరువాత ఏర్పడే ఏ ప్రభుత్వంలో అయినా చేరే అవకాశం ఉండాలని టిఆర్ఎస్ కోరుకుంటున్నది. కేంద్రం మీద విమర్శలు గుప్పిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వాలే కొంత మెరుగ్గా ఉండేవని ఒక అరుదైన సానుకూల వ్యాఖ్య కెసిఆర్ చేయడం గమనార్హం.


కేంద్రరాష్ట్ర సంబంధాల గురించి మాట్లాడుతూ, ఉమ్మడి జాబితాను అడ్డం పెట్టుకుని కేంద్రం పెడుతున్న ఇబ్బందులను కెసిఆర్ ప్రస్తావించారు. ఆ సందర్భంలోనే రాజ్యాంగాన్ని మార్చాలని మాట జారారు. రాజ్యాంగస్ఫూర్తి గురించి మాట్లాడకుండా, రాజ్యాంగాన్ని కూడా ఒక విగ్రహంగా మార్చి ఆరాధించేవారు ఎక్కువయ్యారు. ఈ రాజ్యాంగం ఉనికిలో ఉండగానే, దేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రైవేట్ రంగ వ్యవస్థగా పరిణామం చెందింది. ఈ రాజ్యాంగం ఉండగానే, దానికి విపరీత అన్వయాలు, వ్యాఖ్యలు చేసి, హక్కుల ఉల్లంఘనలు, నల్లచట్టాలు వంటివి అమలులోకి తెచ్చారు. అనేక పర్యాయాలు రాజ్యాంగానికి సవరణలు ప్రతిపాదించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ సారథ్యంలో రూపొందిన నవస్వతంత్ర భారత రాజ్యాంగంలో ఒక స్ఫూర్తి ఉన్నది. ఆ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, రాజ్యాంగాన్ని మాత్రం గౌరవిస్తున్నామని పాలకులు చెబుతున్నారు. ఇదే ఉమ్మడి జాబితా గత 70 ఏళ్లుగానూ ఉన్నది. అనేక ప్రభుత్వాలు ఫెడరల్ స్ఫూర్తిని గౌరవిస్తూ వచ్చాయి, కొన్ని దెబ్బతీశాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ప్రజాస్వామికంగా ఉండాలని ప్రస్తుత జాతీయ అధికారపార్టీ కూడా ఉద్యమాలు చేసింది. కానీ, అదే పార్టీ, మరే పార్టీ చేయని విధంగా, రాష్ట్రాల అధికారాలను, ప్రమేయాన్ని నామమాత్రం చేస్తున్నది. ఈ దాడిని ఒక క్రమపద్ధతిలో వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటితో గొంతు కలపడానికి కెసిఆర్ సిద్ధపడలేదు. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడడం, సమస్య మూలం ఎక్కడుందో తెలియకపోవడమే. సమస్య రాజ్యాంగంలో లేదు. దాన్ని ఆచరణలో భ్రష్టుపట్టిస్తున్న వారిలో ఉంది. రాజ్యాంగం చుట్టూ ఉన్న మనోభావాలను కూడా రాజకీయ వాది పట్టించుకోవాలి. పైగా, రాజ్యాంగ స్ఫూర్తితోనే పేచీ ఉన్నవాళ్లు, కొత్త రాజ్యాంగం కావాలనే వాదనను ఎప్పటినుంచో మొదలుపెట్టారు. మొదటి ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రతిపాదనకు రెక్కలు తొడగడం మొదలుపెట్టారు. తెలిసో తెలియకో కెసిఆర్ అటువంటి ఆలోచనకు మద్దతు ఇస్తున్నారా? ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత, కేంద్రం తీసుకోబోయే పెద్ద నిర్ణయాలలోను, మారే రాజకీయ చిత్రపటంలోను తమకు ఎదురయ్యే అవకాశాలకు లేదా ప్రమాదాలకు ఆయన ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారా?


కె. శ్రీనివాస్

Updated Date - 2022-02-03T06:21:49+05:30 IST