ఎవరిని చంపుతారు?

ABN , First Publish Date - 2021-01-24T08:03:45+05:30 IST

‘‘ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పలుకులే ఉద్యోగ సంఘాలకు చెందిన కొందరు నేతలు మాట్లాడుతున్నారు.

ఎవరిని చంపుతారు?

  • ఎన్నికలు ప్రకటించిన కమిషనర్‌నా!
  • పెట్టుకోవచ్చన్న న్యాయమూర్తులనా?
  • ఉద్యోగ నేతల భాష దురదృష్టకరం: టీడీపీ

అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి పలుకులే ఉద్యోగ సంఘాలకు చెందిన కొందరు నేతలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వమే వారితో ఇష్టానుసారం మాట్లాడిస్తోంది. ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం అనుకొంటే ఆ మాటే కోర్టులో ధైర్యంగా చెప్పి ఉండాల్సింది. దానిబదులు ఉద్యోగ సంఘాల్లో తమ చేతిలో ఉన్నవారితో మాట్లాడించడం ఎందుకు?’’ అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘రాష్ట్ర సచివాలయం ఉద్యోగులకు ఎన్నికల విధులు ఉండవు. ఎన్నికలు పెడితే ఊరుకోబోమని సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. ఆయనకు ఏం సంబంధం? సీఎం మెప్పు పొందవచ్చని నోరు పారేసుకోవడం సరికాదు. ఉద్యోగుల డిమాండ్లపై నోరు తెరిచే శక్తిలేని కొందరు నేతలు ఇప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహంతో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఉద్యోగ సంఘాల చరిత్రలో ఇటువంటి దురదృష్టకర పరిస్థితి ఎన్నడూ లేదు’’ అని అశోక్‌బాబు అన్నారు. అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మాట్లాడుతూ ‘‘పంచాయతీ ఎన్నికల విషయంలో జగన్‌ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభాన్ని కొని తెచ్చుకొంటోంది. తమ ప్రతినిధులను ఎన్నుకోవడం ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దానిని కాలరాయాలని చూస్తే అది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీయడం ఖాయం. ఉద్యోగ సంఘం నేతల్లో కొందరు తాడేపల్లి ప్యాలె్‌సకు లొంగిపోయి మాట్లాడటం బాధాకరం. ఎన్నికలు పెడితే చంపుతామని ఒక నేత మాట్లాడుతున్నారు. ఎన్నికలు పెడతామన్న ఎన్నికల కమిషనర్‌ను చంపుతారా లేక ఎన్నికలు పెట్టుకోవచ్చునని చెప్పిన హైకోర్టు న్యాయమూర్తులనా?’’ అని పట్టాభి ప్రశ్నించారు.


ఆర్టికల్‌ 356 అమలుకు దోహదం చేస్తున్న జగన్‌: యనమల

‘‘గ్రామ స్వరాజ్యం అన్న గాంధీజీ సిద్ధాంతం... రాజ్యాంగ పరిరక్షణ, పాలనలో బలహీన వర్గాలకు భాగస్వామ్యం అన్న అంబేద్కర్‌ సిద్ధాంతాలను జగన్‌రెడ్డి ఖూనీ చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు డివిజన్‌ బెంబ్‌ ఆదేశాలను ధిక్కరించడం కోర్టు ధిక్కరణే. ఎన్నికల సంఘం అధికారాలకు అడ్డుపడుతూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఆర్టికల్‌ 356 అమలుకు తానే దోహదం చేస్తున్నారు’’ అని యనమల రామకృష్ణుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 


రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలి: అచ్చెన్నాయుడు

‘‘ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అప్రజాస్వామిక పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గవర్నర్‌ కల్పించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలి. కోర్టు తీర్పులను సైతం ముఖ్యమంత్రి గౌరవించడం లేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి హాని కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో గవర్నర్‌ మౌనం దాల్చడం సరికాదు’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా రాజాంలో అన్నారు. ‘‘ఏపీలో పరిస్థితులు రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసేవిధంగా వున్నాయి. కేంద్రం జోక్యం చేసుకోవాలి. రాష్ట్రపతి పాలన విధించాలి’’ అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు సహకరించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

Updated Date - 2021-01-24T08:03:45+05:30 IST