మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు?

ABN , First Publish Date - 2021-10-08T07:30:31+05:30 IST

పాలకులను నిరంతరం ప్రశ్నిస్తుండడం మీడియా బాధ్యతల్లో ఒకటి. చిత్రమేమిటంటే మన న్యూస్ మీడియా, ప్రధానంగా ప్రైమ్ టైమ్ టీవీ ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని కాకుండా ప్రతిపక్షాలనే ఎక్కువగా ప్రశ్నిస్తోంది...

మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు?

పాలకులను నిరంతరం ప్రశ్నిస్తుండడం మీడియా బాధ్యతల్లో ఒకటి. చిత్రమేమిటంటే మన న్యూస్ మీడియా, ప్రధానంగా ప్రైమ్ టైమ్ టీవీ ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని కాకుండా ప్రతిపక్షాలనే ఎక్కువగా ప్రశ్నిస్తోంది. ఇది, మీడియాపై ప్రభుత్వ పట్టును ప్రతిబింబిస్తోంది. యూపీఏ ప్రభుత్వాల హయాంలో బలహీనపడిన రాజకీయ నాయకత్వం టీవీ యాంకర్ల నిశిత ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయిపోయేది. మోదీ పాలనలో కథ మారింది. మీడియా కథనాలను నియంత్రించడంలో ప్రస్తుత ప్రభుత్వం కృతనిశ్చయంతో కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. అనివార్యంగా ప్రతిపక్షాలే మీడియా నిశిత పరీక్షకు గురవుతున్నాయి. మరో ముఖ్యమైన విషయమేమిటంటే బీజేపీయేతర రాజకీయపక్షాలలో భావి వ్యూహాల గురించి ఒక తీవ్ర మథనం జరుగుతోంది. తత్కారణంగానే విపక్షాలపై మీడియా తన దృష్టిని కేంద్రీకరించింది. 


మోదీ మహాశక్తికి ప్రత్యామ్నాయమేమిటి? దీని అన్వేషణకే ఆ మథనం. సహజంగానే కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి రాహుల్ గాంధీ పాత్ర చర్చోపచర్చల్లో ఒక ముఖ్యభాగంగా ఉంది. ఈ దేశాన్ని పదిహేడేళ్లు పరిపాలించిన జవహర్ లాల్ మునిమనవడు రాహుల్ గాంధీ ప్రజాజీవితంలోకి ప్రవేశించి 17 సంవత్సరాలు గడిచిపోయాయి. రాహుల్ నిజంగా ఎటువంటి నాయకుడో మీరెవరైనా చెప్పగలరా? ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. ఆయన ఇప్పటికీ ‘అధికారం విషతుల్యమని’ భావిస్తున్న ఆదర్శవాదేనా? భారత జాతీయ కాంగ్రెస్ సంప్రదాయ కులీన నాయకత్వ నిర్మాణాలను కూల్చివేయడం ద్వారా ఆ పార్టీ పూర్వ ప్రతిష్ఠను పునరుద్ధరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. పంజాబ్‌లో ముఖ్యమంత్రి మార్పు జరిగిన తీరుతెన్నులే అందుకొక నిదర్శనం. రాహుల్ కేవలం, స్వతంత్ర భారతదేశ ప్రథమ రాజకీయ కుటుంబపు ఐదోతరం వారసుడు మాత్రమేనా? ఈ ప్రశ్న ఎందుకంటే క్రింది స్థాయి ప్రజలతో ఆయనకు అంతగా సంబంధాలు లేవు. అంతకంతకూ సంక్షోభంలోకి జారిపోతున్న కాంగ్రెస్‌ను ఉద్ధరించేందుకు అవసరమైన రాజకీయ సహనం, వ్యక్తిగత సమ్మోహన శక్తి రాహుల్‌లో కొరవడ్డాయి.


కాంగ్రెస్ పతనానికి రాహుల్ నాయకత్వాన్ని (లేదా నాయకత్వ దక్షత లేకపోవడాన్ని) తప్పుపట్టడం సమంజసం కాదు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహులే మళ్ళీ చేపట్టినా లేక ఆయన స్థానంలో మరో నాయకుడు వచ్చినా భారత జాతీయ కాంగ్రెస్ తిరిగి ఉత్థానం చెందడం సులభ సాధ్యం కాదు. పలువురు తరచు సూచిస్తున్నట్టు, ఓటర్లను ఆకర్షించే సామర్థ్యాలు గాంధీ కుటుంబానికి కొరవడడం వల్లే ఆ పార్టీకి సమస్యలు తలెత్తలేదు. దేశ రాజకీయాలలో మౌలికంగా వచ్చిన ఒక స్పష్టమైన మార్పులో కాంగ్రెస్ సమస్యల మూలాలు ఉన్నాయి. బీజేపీ మతప్రేరిత జాతీయవాద రాజకీయాలు, నరేంద్ర మోదీ నాయకత్వ శైలి కలసికట్టుగా కాంగ్రెస్‌ను అన్నివిధాల బలహీనపరిచాయి. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నానా అప్రతిష్ఠలను మూటగట్టుకుంది. మోదీ నేతృత్వంలోని బీజేపీకి అది ఒక విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం కాలేకపోతోంది. కాగలదని ప్రజలూ విశ్వసించలేకపోతున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు సంస్థాగతంగా బలహీనపడడమే కాదు, సైద్ధాంతికంగా రాజీపడుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా వివిధ సామాజికవర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఇప్పుడు ఆ మద్దతు పూర్తిగా కొరవడింది. ‘కోల్పోయిన భూములు, ఇతర సిరిసంపదల గురించిన స్మృతులతో బతుకుతున్న పాత జమిందారీ వ్యవస్థలా కాంగ్రెస్ మనుగడ సాగిస్తోంద’ని నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్ పవార్ ఇటీవల ఈ కాలమిస్ట్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. 


అయితే పాత బంగారాన్ని పారవేయగలమా? లేదు. కాంగ్రెస్ ఎంతగా బలహీనపడినప్పటికీ ఈనాటికీ అఖిలభారత స్థాయిలో విశేష గుర్తింపు ఉన్న రాజకీయపక్షం. కనీసం ఒక డజన్ రాష్ట్రాలలో 35 శాతానికి పైగా ఓట్ల బలం కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఉంది. జాతీయ పాలక పక్షం లేదా ప్రతిపక్షం కాదగిన సంపూర్ణ అర్హత కాంగ్రెస్‌కే ఉన్నదనడంలో సందేహం లేదు. ఆ బలాన్ని సొంతం చేసుకునేందుకే బీజేపీ, మిగతా ప్రతిపక్షాలు ఏకకాలంలో ప్రయత్నిస్తున్నాయి. బీజేపీయేతర రాజకీయ పక్షాలలో అనేకం గతంలో విస్తృత కాంగ్రెస్ ‘పరివార్’లో భాగంగా ఉన్నవే కావడం గమనార్హం. వేటలో ఉన్న సింహపు పిల్లల్లా అవి తీవ్రంగా పరస్పరం పోటీపడుతున్నాయి. ఆధిపత్యానికి ఆరాటపడుతున్నాయి. భారత రాజకీయాలలో కాంగ్రెస్ స్థానాన్ని అవి స్వాధీనం చేసుకోగలుగుతాయా? 


18వ లోక్‌సభకు 2024 సంవత్సరంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా ఎంతో వ్యవధి ఉన్నప్పటికీ ఒక కీలక ప్రశ్న ఇప్పటి నుంచే దేశ రాజకీయాలలో సుడులు తిరుగుతోంది. తదుపరి సార్వత్రక ఎన్నికలలో ఎవరు ప్రతిపక్ష ‘ముఖం’గా ఉంటారు? హిందీ చానెల్‌ న్యూస్ టీవీ మాటల్లో చెప్పాలంటే ‘కౌన్ బనేగా ఛాలెంజర్’ అన్నదే ఆ ప్రశ్న. ప్రధానమంత్రి కాగల స్థానంలో ఉండేది ఎవరు అన్న ప్రశ్నే తలెత్తకపోవడం గమనార్హం. కనుకనే కాంగ్రెస్‌లో సంక్షోభం ప్రతిపక్షాలలో రాజకీయ పునరేకీకరణ అవకాశాలకు బాగా ఆస్కారమిస్తోంది. చరిత్రాత్మక బెంగాల్ విజయోత్సాహంలో ఉన్న మమతా బెనర్జీ వంగభూమి వెలుపల తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ను విస్తరింపచేసేందుకు ఎందుకు తొందరపడుతున్నారో మీకు ఇంకా విశదం కాలేదా? పొరుగున ఉన్న ఈశాన్య భారత రాష్ట్రాలకే కాదు, సుదూరాన ఉన్న గోవాలో సైతం పాగా వేయడానికి ఆమె పకడ్బందీగా ప్రయత్నిస్తున్నారు. తద్వారా తనపై బెంగాల్ ‘ప్రాంతీయ నాయకురాలు’ అన్న ముద్రను పోగొట్టుకునేందుకు ఆమె కృతనిశ్చయంతో ఉన్నారనేది స్పష్టం. బీజేపీని జాతీయస్థాయిలో దీటుగా సవాల్ చేయగల శక్తిమంతమైన నేతగా దేశ ప్రజల ముందుకు వెళ్ళాలని బెంగాల్ ముఖ్యమంత్రి సంకల్పించుకున్నట్టు స్పష్టమవుతోంది. 


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయితే బీజేపీని ఎప్పటినుంచో సవాల్ చేస్తున్నారు. పురుషుల ఆధిపత్యం బలీయంగా ఉన్న రంగంలో ఏకైక ధిక్కార మహిళగా ఉండడం మమతకు ఒక ప్రయోజనకరమైన అనుకూలత. హిందీ భాషీయుడు కావడంతో పాటు వ్యవస్థా వ్యతిరేకిగా పేరు పడ్డ మధ్యతరగతి విద్యాధికుడు కావడం కేజ్రీవాల్ అనుకూలతలు. ఆయన నాయకత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ ఇప్పటికీ సంప్రదాయ కుల, ప్రాంతీయ విధేయతల సంకుచితత్వాల్లో చిక్కుకోలేదు. మమత వలే కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ బలహీనపడ్డ రాష్ట్రాలలో తమ పార్టీని విస్తరింపచేసేందుకు ఆరాటపడడంలో ఆశ్చర్యమేమీ లేదు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ విజయం సాధించిన పక్షంలో దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా ఆ పార్టీని విస్తరింపచేసేందుకు ఆయన సకల ప్రయత్నాలు చేస్తారనడంలో సందేహం లేదు. 


రాహుల్‌కు ఉన్నట్టుగా కేజ్రీవాల్‌కు, మమతకు సుప్రసిద్ధ కుటుంబ నేపథ్యం లేదు. అది ఆ ఇరువురికీ ఒక అనుకూలత. దీని ఆధారంగా ‘చాయివాలా నుంచి ప్రధానమంత్రి దాకా’ అన్న మోదీ విజయగాథను, అంతే భావోద్వేగం, స్ఫూర్తి కలిగించే తమ విజయగాథలతో సవాల్ చేసేందుకు ఢిల్లీ, బెంగాల్ ముఖ్యమంత్రులు ఇరువురికీ అవకాశం ఉంది. ఈ ఇరువురూ తమ రాజకీయ విజయాలను, మోదీ విజయం వలే, రాజకీయ వారసత్వంపై ఆధారపడి సాధించినవి కావు. స్ఫూర్తిదాయక ఆదర్శనేతల కోసం ఎదురు చూస్తున్న ఇరవై ఒకటో శతాబ్ది యువ ఓటర్లు ఆ ఇరువురి పట్ల తప్పక ఆకర్షితులవుతారనడంలో సందేహం లేదు. 


ప్రతిపక్షాలకు జనసమ్మోహక నేతలే కాదు, సమస్త ప్రజా జీవన రంగాలలో మౌలికమార్పులు సాధించగల స్ఫూర్తిదాయక ఆర్థిక, సామాజిక, రాజకీయ కార్యక్రమాలు కూడా చాలా అవసరం. మోదీ నేతృత్వంలోని బీజేపీ ఇప్పటికే ఆసేతు హిమాచలం విస్తరించి ఉంది. మోదీ సర్కార్ అమలుపరుస్తున్న పేదల అనుకూల సంక్షేమ పథకాలు, బీజేపీ అనుసరిస్తు‍న్న హిందూ జాతీయవాద విధానాలు ఓటర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతిపక్షాలకు ఉన్న అవకాశాలు పరిమితమైనవని చెప్పక తప్పదు. వామపక్ష భావజాల అనుయాయులను రాహుల్ గాంధీ ఇటీవల కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. అలా చేరిన కన్నయ్య కుమార్, జిగ్నేష్ మేవానీల తోడ్పాటుతో కార్పొరేట్ వ్యతిరేక, హిందుత్వ వ్యతిరేక ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేస్తుందనడంలో సందేహం లేదు. అలాగే మోదీ వ్యతిరేక ప్రచార సరళి కూడా మరింత తీవ్రస్థాయిలో ఉండడం ఖాయం. ఇందుకు భిన్నంగా వాస్తవిక రాజకీయాలను ఆచరించడంలో మమత, కేజ్రీవాల్ ఇరువురూ చాలా నిపుణులు. తమ ‘లౌకిక’, ‘సామాజిక న్యాయ’ నిబద్ధతలను త్యజించకుండానే హిందూ ఓటర్లను ఆకట్టుకునే నేర్పు వారికి ఉంది. మరి ఈ ప్రతిపక్షనేతలు అందరూ అంతిమంగా ఒక ఉమ్మడి లక్ష్యానికి రాగలరా? ఒక సమైక్య కార్యక్రమాన్ని రూపొందించుకోగలరా? కలసికట్టుగా అధికారపక్షాన్ని సవాల్ చేస్తారా? లేక ఎవరికి వారే విజేత అయ్యేందుకు పరస్పరం పోరాడుకుంటారా? ఇవీ ఇప్పుడు మన ముందున్న ప్రశ్నలు. సమాధానాలు ఏవైనప్పటికీ, అవి అనేక సంభావ్యతలను మన ముందుంచుతాయి. ఈ కారణంగా ప్రతిపక్షాల పరిస్థితిపై మన శ్రద్ధాసక్తులు రాబోయే నెలల్లో కూడా కొనసాగుతాయి. 


తాజా కలం: అధికార పక్షానికి ఇబ్బంది కలిగించే ప్రశ్నలను అత్యంత అరుదుగా వేస్తున్న మీడియా వైఖరి గురించి ఈ కాలమ్ ఆరంభంలో ప్రస్తావించాను. విస్తృత చర్చ అవసరమైన ఒక ఆందోళనకర ప్రశ్నను ఈ వ్యాసానికి ముగింపుగా వేయదలిచాను. పిఎం కేర్స్ ఫండ్ భారత ప్రభుత్వ నిధి కాదని, కనుక దాని విషయంలో సమాచారహక్కు చట్టం వర్తించదని కేంద్రం నిస్సిగ్గుగా ప్రకటించింది. ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయవలసిన అవసరం లేదా?


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2021-10-08T07:30:31+05:30 IST