మోదం ఎవరికో.. ఖేదం ఎవరికో....

ABN , First Publish Date - 2021-04-15T05:35:49+05:30 IST

జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో కీలకమైన డివిజన్ల రిజర్వేషన్‌ వివరాలు గురువారం వెల్లడి కానున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు 66 డివిజన్ల రిజర్వేషన్ల వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుది జాబితా సైతం అధికారికంగా ప్రకటించనున్నారు.

మోదం ఎవరికో.. ఖేదం ఎవరికో....

నేడే జీడబ్ల్యూఎంసీ  డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు
లాటరీ పద్ధతిలో మహిళా డివిజన్ల ఎంపిక
ఎన్నికల షెడ్యూల్‌ సైతం వెలువడే అవకాశాలు
మొత్తం 878 పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు
ఎల్‌బీ, ఆర్ట్స్‌ కాలేజ్‌లలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు


వరంగల్‌ సిటీ, ఏప్రిల్‌ 14 : జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో కీలకమైన డివిజన్ల రిజర్వేషన్‌ వివరాలు గురువారం వెల్లడి కానున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు 66 డివిజన్ల రిజర్వేషన్ల వివరాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుది జాబితా సైతం అధికారికంగా ప్రకటించనున్నారు. షెడ్యూల్‌ మేరకు 14న ఓటర్ల తుది జాబితా ప్రదర్శన జరగాల్సి ఉంది. అయితే ఓటర్ల జాబితా సిద్ధం అనే ప్రకటన చేసి వివరాలను కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రకటించనున్నట్లు జీడబ్ల్యూఎంసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌ కార్యాలయంలోనే రిజర్వేషన్ల ఖరారు, ఓటర్ల తుది జాబితా, మహిళా డివిజన్లు తదితరమైనవి ప్రకటితం కానున్నాయి.

ఎన్నికలకు మిగిలిన చివరి అంకం నోటిఫికేషన్‌ వెలువడడమే. గురువారం సాయంత్రమే ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా ప్రకటిస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే ఎన్నిక నిర్వహణకు సంబంధించిన అధికారిక ప్రక్రియలు పూర్తయినట్లే. ఇప్పటికే అధికారులు నిర్వహణకు సంబంధించిన అధికారిక చర్యలు, నోటిఫికేషన్లు, ప్రత్యేక బృందాలు, అధికారుల నియామకాలు తదితరమైనవి పూర్తి చేశారు. పోలింగ్‌ సెంటర్ల  ఎంపిక కూడా పూర్తయ్యింది. ఇక నగరా మోగడమే తరువాయి కానుంది.

తొలగనున్న ఉత్కంఠ

జీడబ్ల్యూఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానంగా రాజకీయ పక్షాలు, తాజా మాజీలు, ఆశావహులతోపాటు నగరవాసుల్లో ఉత్కంఠ నెలకొన్న అంశం డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు. ఆయా సామాజికవర్గాలతోపాటు మహిళలకు ఏయే డివిజన్లు దక్కుతాయనేదే హాట్‌ టాపిక్‌గా మారింది. డివిజన్లలో ఓటర్ల సామాజిక వర్గాల లెక్కలను పరిగణనలోకి తీసుకొని ఇప్పటికే రిజర్వేషన్లను అంచనా వేయడమే కాదు.. కొందరు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ కూడా చేసేశారు. దీంతో గందరగోళం ఏర్పడింది. చివరికి అధికారిక వెల్లడి కాదు అని నిర్ధారించుకొని ఊపిరిపీల్చుకోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. బుధవారం కూడా డివిజన్ల రిజర్వేషన్‌ ఫైనల్‌ అయ్యిందంటూ.. ఆవివరాలను కూడా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ ఊహాగానాలకు గురువారం కలెక్టరేట్‌లో అధికారిక వెల్లడితో చెక్‌ పడనుంది. ఇక మహిళా డివిజన్ల ఖరారు కూడా లాటరీ పద్దతిలో చేపట్టేందుకు అధికారులు సిద్ధపడ్డారు. రాజకీయ పార్టీల సమక్షంలో కలెక్టర్‌ డివిజన్ల రిజర్వేషన్లు, ఓటర్ల తుది జాబితా తదితరమైనవి ప్రకటిస్తారు.

878 పోలింగ్‌ స్టేషన్ల ఎంపిక
జీడబ్ల్యూఎంసీ ఎన్నికల నిర్వహణ కోసం 878 పోలింగ్‌స్టేషన్లను ఎంపిక చేశారు. 298 పోలింగ్‌ ప్రాంతాలుగా అధికారులు వెల్లడించారు. వీటిలో సమస్యాత్మకం, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ఆ మేరకు భద్రతా చర్యలను పటిష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ఎన్నికల కోడ్‌ నియామావళి పర్యవేక్షణకు బృందాలను ఏర్పాటు చేశారు. 12 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు.

నామినేషన్ల స్వీకరణ కేంద్రాల ఎంపిక
కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో కాకుండా ఎల్‌బీ కళాశాల, ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీని నామినేషన్‌ సమర్పణ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. నామినేషన్ల సమర్పణ, పరిశీలన, విత్‌ డ్రా, బరిలో నిలిచిన అభ్యర్థులు జాబితా ప్రక్రియ అంతా ఇక్కడే జరుగుతుంది. అంతే కాదు అభ్యర్థులు నామినేషన్‌ ఫీజు చెల్లింపునకు కూడా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. హెల్స్‌ డెస్స్‌ తదితర సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టారు. వరంగల్‌ ములుగురోడ్డులోని ఎల్‌బీ కళాశాలలో ఎంపిక చేసిన 32 డివిజన్ల నుంచి పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తారు. ఒక్కో డివిజన్‌కు ఒక్కో గదిని కేటాయించారు. రిటర్నింగ్‌ అధికారి బాధ్యతలు నిర్వహిస్తారు. హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో 34 డివిజన్ల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది.



Updated Date - 2021-04-15T05:35:49+05:30 IST