White House లో కరోనా కలకలం.. Biden ను కలిసిన ఉద్యోగికి పాజిటివ్.. అధ్యక్షుడికి నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో..

ABN , First Publish Date - 2021-12-21T17:30:22+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది.

White House లో కరోనా కలకలం.. Biden ను కలిసిన ఉద్యోగికి పాజిటివ్.. అధ్యక్షుడికి నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో..

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. అధ్యక్ష భవనంలోని ఓ ఉద్యోగికి సోమవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ వ్యక్తి మూడు రోజుల క్రితం అధ్యక్షుడితో కలిసి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో ప్రయాణించినట్లు వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి జెన్‌ సాకీ తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధ్యక్ష భవనంలోని వైద్యులు బైడెన్‌కు కోవిడ్ టెస్టులు చేశారు. ఈ పరీక్షల్లో అధ్యక్షుడికి నెగెటివ్‌ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. అధ్యక్షుడికి బుధవారం మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.


"వైట్‌హౌస్‌లోని ఓ ఉద్యోగికి సోమవారం ఉదయం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ ఉద్యోగి అంతగా అధ్యక్షుడికి కాంటాక్ట్‌లో ఉండరు. కానీ బైడెన్‌ 3 రోజుల క్రితం దక్షిణ కరోలినా నుంచి పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాకు ప్రయాణించిన ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో ఆ ఉద్యోగి కూడా ఉన్నారు. ఆ సమయంలో సదరు ఉద్యోగి బైడెన్‌ వద్ద 30 నిమిషాలు ఉన్నారు" అని జెన్‌ సాకీ తెలిపారు. ఇక ఆ ఉద్యోగికి సాధారణ చెకింగ్‌లో భాగంగా నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్‌ అని రావడంతో వైట్‌హౌస్‌ వైద్యులు అప్రమత్తమయ్యారు. దాంతో బైడెన్‌కు ఆదివారం యాంటీజెన్‌ పరీక్ష నిర్వహించారు. ఇందులో అధ్యక్షుడికి నెగెటివ్‌గా వచ్చింది. అలాగే సోమవారం నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులోనూ నెగెటివ్‌ వచ్చినట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది. కాగా, బైడెన్‌కు బుధవారం మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 


అయితే, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) మార్గదర్శకాల ప్రకారం రెండు డోసులు తీసుకున్న వ్యక్తులు కరోనా బాధితులతో కాంటాక్ట్‌ అయినప్పటికీ క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని జెన్‌ సాకి తెలిపారు. అందువల్ల అధ్యక్షుడు జో బైడెన్ తన రోజువారీ కార్యక్రమాలను కొనసాగిస్తారని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. అగ్రరాజ్యంలో సోమవారం కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ తొలి మరణం నమోదైంది. టెక్సాస్ రాష్ట్రంలోని హర్రిస్ కౌంటీకి చెందిన ఓ వ్యక్తి ఒమైక్రాన్ లక్షణాలతో చనిపోయారు. ఈ మేరకు ఆ కౌంటీ ఆరోగ్యశాఖ ధృవీకరించింది. ఇక ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ శరవేగంగా ప్రబలుతుండడంతో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కొత్త కరోనా కేసుల్లో 73 శాతం ఒమైక్రాన్ వేరియంట్‌వే ఉంటున్నాయి. ఇక న్యూయార్క్‌లో అయితే ఇది 90శాతంగా ఉందని సీడీసీ వెల్లడించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఒమైక్రాన్ వ్యాప్తి ఆరు రెట్లు పెరిగిందని పేర్కొంది.    

Updated Date - 2021-12-21T17:30:22+05:30 IST