కోర్టు ధిక్కరణ కేసులో..ఐఏఎస్‌లపై కొరడా!

ABN , First Publish Date - 2021-09-03T08:35:19+05:30 IST

హైకోర్టు ఆదేశాలను లెక్కచేయనందుకు ఐదుగురు ఐఏఎస్‌ అధికారులు మూల్యం చెల్లించుకున్నారు.

కోర్టు ధిక్కరణ కేసులో..ఐఏఎస్‌లపై కొరడా!

  • ఐదుగురికి హైకోర్టు శిక్షలు
  • ముగ్గురికి జైలు, ఇద్దరికి జరిమానా
  • మన్మోహన్‌, రావత్‌లకు నెల శిక్ష
  • ముత్యాలరాజుకు రెండు వారాలు
  • పిటిషనర్‌కు రూ.లక్ష చెల్లించాలి
  • నెల్లూరు కేసులో హైకోర్టు ఆదేశాలు
  • రూ.1,000 చొప్పున జరిమానా 
  • అదే జిల్లా ప్రస్తుత, మాజీ కలెక్టర్లకు ఫైన్‌తో సరి
  • ఆ సొమ్మును బాధ్యుల నుంచి రాబట్టాలి
  • అమలు 4 వారాలు నిలుపుదల

అమరావతి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాలను లెక్కచేయనందుకు ఐదుగురు ఐఏఎస్‌ అధికారులు మూల్యం చెల్లించుకున్నారు. కోర్టు ధిక్కరణ కేసులో వారికి న్యాయస్థానం శిక్ష విధించింది. భూమికి పరిహారం చెల్లింపు విషయంలో వారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. వీరిలో నాటి భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) మన్మోహన్‌సింగ్‌కు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎ్‌స.రావత్‌కు, నెల్లూరు జిల్లా పూర్వ కలెక్టర్‌ రేవు ముత్యాలరాజుకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. ఇదే జిల్లాకు చెందిన ప్రస్తుత, మాజీ కలెక్టర్లు కేవీఎన్‌ చక్రధర్‌, ఎంవీ శేషగిరిబాబులకు జరిమానాతో సరిపెట్టింది. ఖర్చుల కింద పిటిషనర్‌కు రూ.లక్ష చెల్లించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ సొమ్మును బాధ్యులైన అధికారుల నుంచి వసూలు చేయాలని పేర్కొంది. అధికారుల తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు తీర్పు అమలును నాలుగు వారాలు నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం ఆదేశాలిచ్చారు. అధికారులు సామాన్య ప్రజల పట్ల ఏవిధంగా వ్యవహరిస్తున్నారో.. కోర్టు ఉత్తర్వులను లెక్కచేయడం లేదనడానికి ఈ కేసు ఓ ఉదాహరణగా పేర్కొన్నారు. 


నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాళెం పంచాయతీ ఎర్రగుంట గ్రామ పరిధిలో దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి, పునరావాస కేంద్రం 2016లో మంజూరైంది. 2019లో ప్రారంభోత్సవం జరిగింది. ఈ ఇన్‌స్టిట్యూట్‌ కోసం రెవెన్యూ ఽఅధికారులు పది ఎకరాల అసైన్డ్‌ భూమిని కేటాయించారు. అయితే ఈ పదెకరాలతో పాటు ఇదే గ్రామానికి చెందిన తాళ్లపాక సావిత్రమ్మకు చెందిన మూడెకరాలు కూడా సేకరించేశారు. దీనిని ఆమె రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో ఆమె మొదట లోకాయుక్తను, తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆమెకు నష్టపరిహారం చెల్లించాలని 2017 ఫిబ్రవరి 10న హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును జిల్లా రెవెన్యూ అధికారులు అమలు చేయకపోవడంతో 2018లో సావిత్రమ్మ కోర్టు ధిక్కార పిటిషన్‌ వేశారు. వాస్తవానికి కొన్ని నెలల క్రితమే ప్రభుత్వం ఆమెకు నష్టపరిహారం చెల్లించింది. ఎకరాకు రూ.13 లక్షల చొప్పున మూడు ఎకరాలకు 39 లక్షలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరైన అధికారులు ఈ ఏడాది మార్చి 30న సావిత్రమ్మకు పరిహారం చెల్లించామని తెలిపారు. అయితే న్యాయస్థానం ఉత్తర్వుల అమలులో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని నిర్ధారించిన న్యాయమూర్తి.. వారికి శిక్షలు, జరిమానా విధించారు. ఇది పెద్ద సంచలనంగా మారింది. అధికార వర్గాల్లో తీవ్ర అలజడి రేపింది.


ఎవరికి ఏమి శిక్ష?

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, అప్పటి సీసీఎల్‌ఏ మన్మోహన్‌సింగ్‌కు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎ్‌స.రావత్‌కు చెరో నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా. జరిమానా చెల్లించడంలో విఫలమైతే అదనంగా మరో ఏడు రోజులు జైలు శిక్ష.

నాటి నెల్లూరు జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుకు రెండు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా. జరిమానా చెల్లింపులో జాప్యం చేస్తే అదనంగా మరో మూడు రోజులు జైలు శిక్ష

నెల్లూరు జిల్లా అప్పటి కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబుకు, ప్రస్తుత కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌కు చెరో రూ.రెండు వేల జరిమానా. చెల్లించడంలో విఫలమైతే వారం జైలుశిక్ష.


ఉల్లంఘనులకు హెచ్చరిక

తన ఆదేశాలను అలక్ష్యం చేస్తున్న అధికారులపై హైకోర్టు ఇటీవలి కాలంలో విరుచుకుపడుతోంది. కోర్టుకు పిలిపించడంతో ఆగకుండా.. వీరిలో కొందరికి జైలు శిక్షలు కూడా విధిస్తోంది. మానవతా దృక్పథంతో శిక్షలను సవరించడం, అమలును వాయిదా వేస్తున్నప్పటికీ.. కోర్టు ఉత్తర్వులను పాటించడం తప్పనిసరని హెచ్చరించడం, ఆ స్పృహను వారిలో కలిగించడమే హైకోర్టు తీర్పుల అసలు ఉద్దేశమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలా శిక్షలు ఎదుర్కొన్న అధికారులు వీరే.. విలేజ్‌ హార్టికల్చర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌ అధికారులు, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌, అప్పటి ఉద్యానవనశాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరికి హైకోర్టు శిక్ష విధించింది. రూ. వెయ్యి జరిమానా విధించడంతో పాటు కోర్టు పనిగంటలు ముగిసేవరకు కోర్టులోనే ఉండాలని ఆదేశించింది. తొలుత కేసులో 9 రోజులు సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించిన హైకోర్టు మానవతా దృక్పథంతో తీర్పును సవరించింది. జరిమానా సొమ్మును చెల్లించడంలో విఫలమైతే మూడు రోజులు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. అయితే కోర్టు ఉత్తర్వుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని.. వయసు, ఇప్పటివరకు అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని తమను క్షమించాలని అధికారులు అభ్యర్థించారు. వీటితోపాటు కొవిడ్‌ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని మొదట ఇచ్చిన ఉత్తర్వులను న్యాయమూర్తి సవరించారు. 


న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సకాలంలో అమలు చేయకపోవడమే కాకుండా కోర్టును తప్పుదోవ పట్టించి గతంలో నమోదైన  ధిక్కరణ వ్యాజ్యాన్ని మూసివేసేలా చేసినందుకు విజయవాడ సౌత్‌ పూర్వ ఏసీపీ, ప్రస్తుతం శ్రీకాకుళం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎ్‌సఈబీ) అడిషనల్‌ ఎస్పీ కె.శ్రీనివాసరావుకు నాలుగు వారాలు సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. 


కోర్టు ధిక్కరణ కేసులో పశ్చిమగోదావరి(ఏలూరు డివిజన్‌) జిల్లా డీఎ్‌ఫవో యశోదబాయికి హైకోర్టు రెండు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేలు జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరోవారం జైలు శిక్ష  అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. డీఎ్‌ఫవో అభ్యర్థన మేరకు తీర్పు అమలును నాలుగువారాలు వాయిదా వేసింది.


తన తీర్పు అమలు చేయనందుకు శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులుకు కోర్టు నెలరోజుల జైలు శిక్ష విధించింది. రూ.1000 జరిమానా వేసింది. శిక్ష తగ్గించాలని ఆయన వేడుకోవడంతో తీర్పును సవరించింది. పనిగంటలు ముగిసేవరకు కోర్టులోనే కూర్చోవాలని ఆదేశించింది.

Updated Date - 2021-09-03T08:35:19+05:30 IST