ఉచితమెక్కడ సారూ!

ABN , First Publish Date - 2021-05-07T09:18:02+05:30 IST

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉన్నాం. బిల్లు రూ.5 లక్షలైంది! బెడ్‌లు అందుబాటులో లేవన్నారు! ‘డబ్బులు ఎంతైనా పర్లేదు సార్‌’... అన్న తర్వాత, నాలుగు లక్షలు అడ్వాన్స్‌ తీసుకుని బెడ్‌ ఇచ్చారు

ఉచితమెక్కడ సారూ!

కరోనా చికిత్సకు లక్షల్లో బిల్లులు.. ఆస్పత్రికి వెళితే అప్పులపాలే

డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్న ఆస్పత్రులు

బైపాస్‌ సర్జరీకి మించి వసూళ్లు

అమలుకాని ప్రభుత్వ నిర్దేశిత ధరలు

ప్రతి చికిత్సకూ సొంతంగానే ‘మెనూ’

అడ్వాన్స్‌ కడితేనే అడ్మిషన్‌ దొరికేది

తూతూ మంత్రంగానే విజిలెన్స్‌ తనిఖీలు

ఫిర్యాదులకు ప్రత్యేక వ్యవస్థ అవసరం


‘‘కొవిడ్‌ చికిత్సకు ఎంప్యానల్‌ అయిన ఆస్పత్రులు, ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు ఉచితంగా చికిత్స అందించాలి. ఇతర ఆస్పత్రుల్లో జీఓ నంబరు 77, 78లో నిర్దేశించిన ప్రకారమే రుసుము వసూలు చేయాలి. అంతకు మించితే కఠిన చర్యలు తప్పవు!’’... ఇది ముఖ్యమంత్రి జగన్‌ చేసిన హెచ్చరిక! ఈ ఆదేశాలు నిజంగానే అమలవుతున్నాయా! క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? పదండి చూద్దాం...’


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉన్నాం. బిల్లు రూ.5 లక్షలైంది! బెడ్‌లు అందుబాటులో లేవన్నారు! ‘డబ్బులు ఎంతైనా పర్లేదు సార్‌’... అన్న తర్వాత, నాలుగు లక్షలు అడ్వాన్స్‌ తీసుకుని బెడ్‌ ఇచ్చారు. మొత్తం బిల్లు 6 లక్షలైంది! ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ విన్నా ఇదే మాట! కుటుంబ సభ్యులకో, బంధువులకో, మిత్రులకో ఎదురవుతున్న అనుభవం! ‘హోం ఐసొలేషన్‌’తో నయమైతే అదృష్టం! పొరపాటున ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమొచ్చినా, అందులోనూ పెద్ద వయసు వారికి బెడ్‌ అవసరమైనా లక్షలు సిద్ధం చేసుకోవాల్సిందే. బైపాస్‌ సర్జరీకి రూ.5 లక్షలు మించి ఖర్చు కాదు. ఐదారు నెలలు నడిచే కొన్ని రకాల క్యాన్సర్‌ చికిత్సకు పది లక్షలు అవుతుందేమో! కానీ... ఆపరేషన్లు, రేడియేషన్లు, కీమోల అవసరమే లేని కరోనా చికిత్స కూడా లక్షలకు లక్షలు పలుకుతోంది! ఎందుకిలా... ఏం చేస్తున్నారు... అంటే వస్తున్న సమాధానం ఒక్కటే! ‘డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్నారు. బాధితుల భయాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు!’ కొవిడ్‌కు ఇప్పుడు అందిస్తున్న చికిత్స... మందు బిళ్లలు, అవసరాన్ని బట్టి ఆక్సిజన్‌, రెమిడెసివర్‌ ఇంజక్షన్‌! ఇంకా పరిస్థితి తీవ్రమైతే అతి కొద్దిమందికి వెంటిలేటర్‌పెట్టి చికిత్స అందించాల్సి వస్తోంది. సాధారణ రోజుల్లో వెంటిలేటర్‌ బెడ్‌కు రోజుకు రూ.10 వేల దాకా చార్జి చేస్తారు. బెడ్‌ చార్జి ఆరేడు వందల నుంచి 3 వేల వరకు ఉంటుంది. రెమ్‌డెసివర్‌ ఒక్కో డోస్‌ రూ.3400. ఆరు డోసులు ఇచ్చినా... 20,400. వైద్య సిబ్బంది ధరించే పీపీఈ కిట్‌, గ్లౌజులు, మాస్క్‌ అన్నీ కలిపినా రూ.500. మొత్తంగా చూస్తే... కొవిడ్‌కు ఎంత భారీ చికిత్స చేసినా... లక్ష నుంచి రూ.2 లక్షలకు మించదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ... రాష్ట్రవ్యాప్తంగా అనేక పట్టణాల్లో బెడ్‌ కావాలంటే రూ.2 లక్షల నుంచి 4 లక్షల వరకు అడ్వాన్స్‌ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత మొత్తం బిల్లు ఎక్కడి దాకా అయినా పోవచ్చు!


విజిలెన్స్‌ తనిఖీల్లోనే...

ఉచితంగా చికిత్స, నిర్దిష్టంగా ఫీజులు... అని ముఖ్యమంత్రి చెబతున్న మాటలు ఎక్కడా అమలు కావడంలేదు. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీల్లోనే ప్రైవేటు ఆస్పత్రుల దందా బయట పడింది. పద్ధతిగా నడిచే కొన్ని ఆస్పత్రులను మినహాయిస్తే... అత్యధిక ఆస్పత్రుల్లో ఫీజులను పిండేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో చికిత్సకు ఒక్కో ధర నిర్ణయించగా... ప్రైవేటు ఆస్పత్రులు తమ సొంత ధరలను అమలు చేస్తున్నాయి. బెడ్‌, ఆక్సిజన్‌, ఐసీయూ, రెమ్‌డెసివర్‌, వెంటిలేటర్‌... ఇలా ప్రతి సేవకూ ప్రత్యేక ధరలు నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం... అడ్వాన్స్‌/డిపాజిట్‌ వసూలు చేయరాదు. కానీ, చాలా వరకు ఆస్పత్రులు అడ్వాన్స్‌ కడితేనే అడ్మిషన్‌ అని తేల్చి చెబుతున్నాయి.


ఇక్కడ మాత్రమే... ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసిన కొవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రులు, కొన్ని ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌ ఆస్పత్రుల్లో మాత్రమే కొవిడ్‌కు ఉచిత చికిత్స అందిస్తున్నారు. ఇదికూడా అన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో అమలు కావడం లేదు. జిల్లా కలెక్టర్‌, ఇతర నోడల్‌ అధికారులు సిఫారసు చేసిన కేసుల్లోనే నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీకి అంగీకరిస్తున్నారు. ఇవేవీ లేకుండా కరోనా ఆరోగ్యశ్రీ కార్డు, పాజిటివ్‌ రిపోర్టు చేతిలో పట్టుకొని వెళితే... ‘బెడ్‌లు ఖాళీ లేవు! ఖాళీ అయితే కబురు చేస్తాం’ అని చెబుతున్నారు. ఆ మాట వినగానే బాధితుల గుండెలు జారిపోతున్నాయి. బెడ్‌ లేదంటే ఎలా? చికిత్స ఎలా... అంటూ ఫీజులు చెల్లించడానికి సిద్ధమయిపోతున్నారు. 2-3 లక్షల అడ్వాన్స్‌తో మొదలయ్యే ‘చికిత్స’ అలా అలా మరిన్ని లక్షలకు చేరుకుంటోంది. ఇక... రెమిడెసివర్‌ పేరిట దోపిడీకి అంతూపొంతూ ఉండటం లేదు.


మచ్చుకు కొన్ని ఉదాహరణలు...

కరోనా పాజిటివ్‌ ఉన్న ఓ రోగికి అత్యవసరంగా చికిత్స అవసరమైంది. బెడ్‌ కావాలంటూ విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని సంప్రదించారు. తమ వద్ద ఐసీయూ బెడ్‌లు మాత్రమే ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ‘‘అవి కూడా త్వరగా నిండిపోయే  అవకాశం ఉంది. వెంటనే ఏదో ఒక విషయం చెప్పండి’’ అని తొందరపెట్టారు. ‘సరే’ అనగానే... 2 లక్షలు కట్టాలన్నారు. అది కూడా... నగదు రూపంలోనే! గూగుల్‌పే, ఫోన్‌పే, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ వంటివేవీ కుదరవని తేల్చారు. అదే సమయంలో ‘మెనూ కార్డ్‌’ కూడా చదివి వినిపించారు. ఐసీయూ బెడ్‌కు రోజుకు 30 వేలు, ఆక్సిజన్‌ అవసరమైతే రోజుకు రూ.5 వేలు, సీపాప్‌ (మెషిన్‌) తప్పనిసరి అంటే రోజుకు అదనంగా మరో 15వేలు చెల్లించాల్సి ఉంటుంది. వెరసి.. సీపాప్‌ సదుపాయంతో ఐసీయూలో చికిత్స పొందాలంటే రోజుకు 45వేలు చెల్లించాలి. రోగికి నిర్వహించే పరీక్షలు, మందుల ఖర్చు వీటికి అదనం!


ఖర్చు రూ.3.15 లక్షలు

గుంటూరు జిల్లా పల్నాడులో ఓ ప్రముఖ ఆస్పత్రి ఓ కరోనా రోగి నుంచి ఆరు రోజుల చికిత్సకు రూ.3.15 లక్షల వసూలు చేసింది. పిడుగురాళ్ల వంటి చిన్న పట్టణంలో... సాధారణ కరోనా చికిత్స ( నాన్‌ క్రిటికల్‌)కు లక్షన్నర రూపాయలు ఫీజుగా వసూలు చేశారు. ఈ రెండు ఉదంతాలు తాజాగా విజిలెన్స్‌ తనిఖీల్లోనే బయటపడ్డాయి. తనిఖీల నేపథ్యంలో కొన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు కొంత పంథాను ఎంచుకున్నాయి. ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స లేదని, ఇప్పుడు మేం దాన్ని కొనసాగించలేమని బోర్డులు పెట్టేస్తున్నాయి. అప్పటికప్పుడు జిల్లా అధికారులు రంగంలోకి దిగి ఆస్పత్రి యాజమాన్యాలతో మాట్లాడి దారికి తెస్తున్నారు.


అందినకాడికి పిండుడే!

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో కొన్ని మాత్రం ఉచిత చికిత్స అందిస్తున్నాయి. అయితే... అది కేవలం 20 శాతం మందికే. కలెక్టర్‌, ఇతర అధికారులు సిఫారసు చేసిన వారికి మాత్రమే ఉచిత చికిత్స అందుతున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి.


దోపిడీని అడ్డుకోలేరా? 

కరోనా చికిత్స కోసం బాధితులు అప్పులు చేయాల్సి వస్తోంది. అప్పు పుట్టని వారు ఆస్తులూ అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఎక్కువ ఫీజు వసూలు చేస్తే 104కు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ... తీసుకున్న డబ్బులకు ఆస్పత్రులు రసీదులు ఇవ్వవు. 104కు కాల్‌ చేసినా తగిన స్పందన ఉండటంలేదు. ఇక విజిలెన్స్‌ తనిఖీలు తూతూమంత్రంగా, పేరులేని ఆస్పత్రులకే పరిమితమవుతున్నాయని... అసలైన దోపిడీ సాగించే బడా ఆస్పత్రులను పట్టించుకోవడంలేదనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. 


ఇలా చేయాలి...

‘‘కొవిడ్‌ పేరిట జరిగే దోపిడీని తెలుసుకొని రోగులకు న్యాయం చేయాలంటే సర్కారు ప్రత్యేకంగా ఓ టోల్‌ఫ్రీ నెంబర్‌, ఈ-మెయిల్‌ ఇవ్వాలి. ఫీజు దోపిడీపై బాధితులు వాటికి సమాచారం ఇచ్చేలా విస్తృత ప్రచా రం కల్పించాలి. దీనివల్ల ప్రైవేటు ఆస్పత్రులు కూడా నిబంధనలను పాటిస్తాయి. ప్రజలు ఇచ్చే సమాచారాన్ని ఉన్నతస్థాయి వర్గాలు విశ్లేషించేలా, చర్యలు కూడా అక్కడి నుంచే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని ఓ సీనియర్‌ అధికారి అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-05-07T09:18:02+05:30 IST