ఉద్యమంలో మీరెక్కడ?

ABN , First Publish Date - 2021-03-08T08:15:18+05:30 IST

‘‘తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కడున్నారు? బీజేపీ తరఫున గెలిచిన నలుగురు ఎంపీలు ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? సీఎంను పట్టుకుని బట్టేబాజ్‌ అనడానికి ఎన్ని గుండెలు? మేము మీకంటే ఎక్కువ మాట్లాడగలం.

ఉద్యమంలో మీరెక్కడ?

  • నలుగురు బీజేపీ ఎంపీలు ఏనాడైనా పాల్గొన్నారా?
  • సీఎంను బట్టెబాజ్‌ అంటారా? ఎన్ని గుండెలు!
  • మేము మాట్లాడితే మీరు తట్టుకోలేరు 
  • కేసీఆర్‌ లేకపోతే టీ-కాంగ్రెస్‌, బీజేపీ ఎక్కడివి?
  • బ్రాహ్మణ సంఘాల సమాఖ్య, వర్కింగ్‌ జర్నలిస్టుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌
  • జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత నాది


‘‘ప్రశ్నించే గొంతుక కాదు.. సమస్యలు పరిష్కరించేవారు కావాలి. బీజేపీ నేతలు ప్రశ్నించే గొంతుకకు ఓటు వేయాలని ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతోపాటు రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదు? వాణీదేవిని ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో గెలిపించి మాజీ ప్రధాని పీవీ నరసింహారావును తెలుగునాట పున:ప్రతిష్ఠించాలి’’

మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌ సిటీ/కవాడిగూడ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కడున్నారు? బీజేపీ తరఫున గెలిచిన నలుగురు ఎంపీలు ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా?  సీఎంను పట్టుకుని బట్టేబాజ్‌ అనడానికి ఎన్ని గుండెలు? మేము మీకంటే ఎక్కువ మాట్లాడగలం. మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ సహా మా నేతలు ఎక్కువ తిట్టగలరు. అలా చేస్తే మీరు తట్టుకోలేరు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా మీద మేము మాట్లాడలేమా?వయసుకు, పదవులకు మర్యాద ఇస్తున్నాం. దీనిని మీరు గుర్తుంచుకోవాలి’’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఇటీవల కరోనాతో, ఇతర కారణాలతో మృతిచెందిన, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 91 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాకపోతే బీజేపీ, టీకాంగ్రెస్‌ నేతలు ఎక్కడుండేవారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. జన్‌ధన్‌ ఖాతాతో రూ.15 లక్షలు వస్తాయని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినవారు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. కరోనాతో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలు ఇస్తామని చెప్పిన కేంద్రం.. ఎక్కడ ఇచ్చిందో చూపాలన్నారు. గట్టిగా అడిగితే ఇండియా-పాకిస్థాన్‌ అంటారని, బిన్‌లాడెన్‌ అంటూ ఏదో మాట్లాడుతూ తప్పించుకుంటారని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలమంటున్న నేతలు ఐటీఐఆర్‌ రద్దయినప్పుడు, కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టనందుకు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. తెలంగాణ వచ్చాక సామాన్య ప్రజలకు కరెంటు సమస్య తీరిన విషయాన్ని, ప్రతి ఇంటికీ మంచినీరు వచ్చిన విషయాన్ని గమనించాలన్నారు. తెలంగాణ ధాన్యాగారంగా మారడం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి 2లక్షల 77 వేల కోట్లు కేంద్రానికి వెళ్తే.. రాష్ట్రానికి వచ్చింది 1.40 లక్షల కోట్లేనని తెలిపారు. మనం చెల్లించినదాంట్లో తిరిగి సగం పైసలు మాత్రమే రాష్ర్టానికి కేంద్రం ఇస్తుందన్నారు.


జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల బాధ్యత నాది..

జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హెల్త్‌ స్కీంలో లోపాలను సవరించి మరింత నాణ్యమైన ఆరోగ్య సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమనిధి ఏర్పాటు చేసిందని తెలిపారు. జర్నలిస్టులకు రూ.9 కోట్ల 66 లక్షల 21 వేలు పంపిణీ చేశామన్నారు. ఏ రాష్ట్రంలోనూ 2-3 వేల కంటే ఎక్కువ అక్రిడిటేషన్‌ కార్డులు లేవని, తాము మాత్రం 18,095 అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేశామని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమనిధి ఇప్పటివరకు 296 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామన్నారు. కరోనా బారిన పడిన 1927 మంది జర్నలి్‌స్టలకు రూ.3.56 కోట్ల సహాయం అందించినట్లు తెలిపారు. చనిపోయిన జర్నలి్‌స్టల పిల్లలు రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదువుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. మీడియా అకాడమీకి ప్రభుత్వం రూ.15 కోట్లతో అన్ని ఆధునిక సదుపాయాలతో 5 అంతస్తుల మల్టీసోర్డ్‌ బిల్డింగ్‌ను మంజూరు చేసిందన్నారు. హైదరాబాద్‌లో కూడా యూనియన్‌ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. 


సమస్యలు పరిష్కరించేవారు కావాలి..

ప్రశ్నించే గొంతుక కాదు.. సమస్యలు పరిష్కరించేవారు కావాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బీజేపీ నేతలు ప్రశ్నించే గొంతుకకు ఓటు వేయాలని ప్రచారం చేసుకుంటున్నారని, కేంద్రం అన్ని విధాలుగా రాష్ర్టానికి అన్యాయం చేస్తుంటే ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతోపాటు రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు. వాణీదేవిని ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో గెలిపించి మాజీ ప్రధాని పీవీ నరసింహారావును మళ్లీ తెలుగునాట పున:ప్రతిష్ఠించాలని ఆయన కోరారు. బ్రాహ్మణుల ఉత్సాహాన్ని చూస్తుంటే వాణీదేవి గెలుపు ఖాయమైపోయిందని తెలిపారు. ఆదివారం లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని పింగళి వెంకట్రామిరెడ్డి హాలులో బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో పీవీ వాణీదేవి సమన్వయ సమ్మేళనం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు బ్రాహ్మణులు, భక్తిపట్ల చిత్తశుద్ధి ఉందన్నారు. గతంలో గెలిచిన బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు బ్రాహ్మణులకు, న్యాయవాదులకు చేసిందేమీలేదని విమర్శించారు. బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు.  తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ అధ్యక్షుడు కేవీ రమణాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వాణీదేవి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా అర్చక, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ కేటీఆర్‌కు తెలంగాణ అర్చకసమాఖ్య వినతిపత్రం అందజేసింది.

Updated Date - 2021-03-08T08:15:18+05:30 IST