కొవిడ్‌ పరిహారం ఎప్పుడు?

ABN , First Publish Date - 2022-08-20T08:59:08+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పని చేసిన పోలీసులు కీలక సేవలు అందించారు.

కొవిడ్‌ పరిహారం ఎప్పుడు?

విధి నిర్వహణలో కరోనా బారినపడి 

120 మంది పోలీసులు మృతి

ఎక్స్‌గ్రేషియాపై ప్రభుత్వం మీనమేషాలు

రెండేళ్లుగా పెండింగ్‌లోనే పరిహారం ఫైల్‌

బాధిత కుటుంబాల ఎదురుచూపు

సర్కారు స్పందించాలని వేడుకోలు


హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పని చేసిన పోలీసులు కీలక సేవలు అందించారు. లాక్‌డౌన్‌ అమలు, వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ జోన్‌ల ఏర్పాటు, కరోనా పాజిటివ్‌గా తేలిన వారిని ఆస్పత్రికి తరలించడంతోపాటు అనేక బాధ్యతలు నిర్వర్తించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలో పలువురు పోలీసులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో పోలీస్‌ శాఖ పరంగా నిబంధనల మేరకు కాంపెన్‌సేషన్‌ అపాయింట్‌మెంట్‌ కింద బాధిత కుటుంబంలో ఒకరికి విద్యార్హతకు తగ్గ ఉద్యోగాలు కల్పించారు. కానీ, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా విషయంలో మాత్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఎక్స్‌గ్రేషియా చెల్లింపులకు సంబంధించిన ఫైల్‌ను రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంచింది. దీంతో బాధిత కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. 


120 కుటుంబాల ఎదురుచూపు

కొవిడ్‌ మొదటి, రెండో విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఇందులో హోంగార్డు నుంచి అడిషనల్‌ ఎస్పీ స్థాయి వరకు 120 మందికిపైగా మరణించారు. అయితే, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధి కుల్సుంపుర పోలీ్‌సస్టేషన్‌ కానిస్టేబుల్‌ దయాకర్‌ రెడ్డి కొవిడ్‌తో మృతి చెందినప్పుడు అతని కుటుంబానికి రూ.1కోటి పరిహారం చెల్లించాలని పోలీస్‌ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లింది. కానీ ఆ తర్వాత మరణాల సంఖ్య పెరగడంతో పరిహారంగా రూ.50 లక్షలు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అనంతరం ఉద్యోగి స్థాయి ఆధారంగా పరిహారం చెల్లించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మరోపక్క, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలో కొవిడ్‌తో మృతి చెందిన పోలీస్‌ సిబ్బంది కుటుంబాల్లో కొన్నింటికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 50 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాయి. దీంతో తెలంగాణలోనూ అదే అమలు జరుగుతుందని అంతా భావించారు. కానీ, ఎక్స్‌గ్రేషియా అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తమ వారి త్యాగాన్ని గుర్తించాలని, ఎక్స్‌గ్రేషియాను విడుదల చేయాలని వేడుకుంటున్నాయి. 

Updated Date - 2022-08-20T08:59:08+05:30 IST