దిగొచ్చిన వాట్సాప్.. మే 15 డెడ్‌లైన్ నుంచి వెనక్కి!

ABN , First Publish Date - 2021-05-08T02:16:36+05:30 IST

వివాదాస్ప పాలసీని తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా విమర్శలపాలైన మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెనక్కి తగ్గింది. తమ ప్రైవసీ

దిగొచ్చిన వాట్సాప్.. మే 15 డెడ్‌లైన్ నుంచి వెనక్కి!

న్యూఢిల్లీ: వివాదాస్ప పాలసీని తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా విమర్శలపాలైన మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెనక్కి తగ్గింది. తమ ప్రైవసీ పాలసీని అంగీకరించకుంటే మే 15 నుంచి నుంచి ఖాతాలు డిలీట్ అయిపోతాయని ప్రకటించిన వాట్సాప్.. ఇప్పుడా డెడ్‌లైన్‌ను వెనక్కి తీసుకుంది. కొత్త పాలసీని అంగీకరించని ఖాతాదారుల అకౌంట్లను డిలీట్ చేయబోమని ప్రకటించింది. తమ ఖాతాదారుల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకునేలా వాట్సాప్ ఇటీవల ఓ సరికొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది. దీనిని అంగీకరిస్తేనే ఖాతాలు కొనసాగుతాయని, చేయనివారి ఖాతాలు డిలీట్ అయిపోతాయని హెచ్చరించింది.


మే 15లోపు ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా ప్రైవసీ పాలసీని అంగీకరించాల్సిందేనని స్పష్టం చేసింది. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ సరికొత్త పాలసీపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన వాట్సాప్ ఆ తర్వాత వివరణలు ఇచ్చినప్పటికీ విమర్శలు మాత్రం ఆగలేదు. చాలామంది ఖాతాదారులు టెలిగ్రామ్‌కు మారిపోయారు. దీంతో జరగబోయే నష్టాన్ని గుర్తించిన వాట్సాప్ మే 15 గడువును ఎత్తివేసింది. 


ఇండియాలో మే 15 తర్వాత ఏ ఒక్కరి ఖాతాలు డిలీట్ కాబోవని వాట్సాప్ అధికార ప్రతినిధి తెలిపారు. గడువును ఎత్తివేస్తున్నట్టు పేర్కొన్నారు. రాబోయే కొన్ని వారాల్లో రిమైండర్స్ ద్వారా ఖాతాదారులకు అందుబాటులో ఉంటామని చెప్పుకొచ్చారు. ఖాతాలు డిలీట్ అయిపోతాయన్న భయంతో చాలామంది యూజర్లు వాట్సాప్ ప్రైవసీ పాలసీని అంగీకరించగా, మరికొందరు అంగీకరించలేదు. కాగా, డెడ్‌లైన్ ఎత్తివేతకు గల కారణాన్ని వాట్సాప్ వెల్లడించలేదు.  

Updated Date - 2021-05-08T02:16:36+05:30 IST