అమల్లోకొచ్చిన కొత్త విడాకుల చట్టం.. భారీగా పెరగనున్న పెళ్లిళ్లు..!

ABN , First Publish Date - 2022-04-07T23:46:31+05:30 IST

బ్రిటన్‌లో కొత్త విడాకుల చట్టం.. భారీగా పెరగనున్న వివాహాలు

అమల్లోకొచ్చిన కొత్త విడాకుల చట్టం.. భారీగా పెరగనున్న పెళ్లిళ్లు..!

ఎన్నారై డెస్క్: బ్రిటన్‌లో ఇటీవల ఓ విప్లవాత్మక విడాకుల చట్టం అమల్లోకి వచ్చింది. పెళ్లయిన వారు.. ఇకపై పరస్పర నిందారోపణలు, దూషణభూషణలు లేకుండానే  సులువుగా విడాకులు పొందొచ్చు. దీనికి కారణం.. ‘నో ఫాల్ట్’ చట్టం. 2020 జూన్‌లోనే బ్రిటన్ పార్లమెంట్ ఈ చట్టాన్ని ఆమోదించగా..బుధవారం నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఫలితంగా.. రాబోయే కాలంలో పెళ్లిళ్ల సంఖ్య భారీగా పెరుగుతుందని అక్కడి పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అసలు ఈ చట్టం తేవాల్సిన అవసరం ఏంటి..?  విడాకుల చట్టంతో పెళ్లిళ్ల సంఖ్య ఎందుకు పెరగనుందో తెలుసుకుందాం పదండి.


ఏమీటీ చట్టం.. 

బ్రిటన్ న్యాయవర్గాల ప్రకారం.. గత 50 ఏళ్లలో విడాకులకు సంబంధించి అది పెద్ద మార్పు ఈ చట్టమే. ఒకప్పుడు ఇంగ్లండ్‌లో విడాకులు పొందాలనుకునే వ్యక్తులు.. తమ భాగస్వాముల తప్పిదాల కారణంగానే తమ బంధం తెగిపోయిందని రుజువు చేయాల్సి వచ్చేది. భాగస్వాములు తమని వదలిపెట్టేశారనో లేదా అక్రమ సంబంధం పెట్టుకున్నారో ఆరోపిస్తూ ఆధారాలతో సహా వారి నేరాన్ని నిరూపించాల్సి వచ్చేది. దీన్నే న్యాయపరిభాషలో అడ్వర్సీరియల్ సిస్టమ్ అని అంటారు.  ఇటువంటి కారణాలేవీ చూపించలేని పక్షంలో..భార్యభర్తలిద్దరూ రెండేళ్ల పాటు విడివిడిగా జీవించాకే కోర్టు  విడాకులు మంజూరు చేసేది. ఇక విడాకులు ఇచ్చేందుకు అవతలి వ్యక్తి అభ్యంతరం చెబితే.. ఈ గడువు ఐదేళ్లకు పెరిగేది. ఇటువంటి రూల్‌ను ఆసరా చేసుకుని కొందరు విడాకుల సమయంలో భాగస్వామిపై రివెంజ్  తీర్చుకునేవారు కూడా! ఇక పరస్పర అంగీకారంతో విడిపోదామనుకున్న జంటలు కూడా ఒకరిపై మరొకరు నకిలీ ఆరోపణలు చేసుకుని డైవర్స్ పొందేందుకు యత్నించేవి.  


ఇలా.. విడాకులు పొందేందుకు నానా అగచాట్లూ పడుతున్న జంటల జీవితాల్లో ఆశాకిరణంలా వచ్చిందే ‘నో ఫాల్ట్’  డైవర్స్ చట్టం. బ్రిటన్‌లో భాగమైన స్కాట్‌ల్యాండ్‌లో ఇప్పటికే ఈ తరహా చట్టం అందుబాటులో ఉండగా.. తాజాగా ఇంగ్లండ్, వేల్స్ వాసులకు ఈ వరం లభించింది.  అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాల్లో ఎప్పటినుంచో ఈ తరహా చట్టాలు అమల్లో ఉన్నాయి. నో ఫాల్ట్ చట్టం ద్వారా జంటలు.. పగ, ప్రతీకారాలు, కోపతాపాలు లేకుండా స్నేహపూర్వకంగా విడిపోవచ్చు. దీంతో.. విడాకుల తరువాత ఆస్తిపాస్తుల వ్యవహారాలు, పిల్లలు బాధ్యతలు ఎవరు తీసుకోవాలి తదితర ముఖ్యమైన విషయాలపై స్తిమితంగా చర్చించుకుని ఓ నిర్ణయానికి రావచ్చు. 


భారీగా పెరగనున్న పెళ్లిళ్లు.. విడాకులు..!

ఈ నేపథ్యంలో జరిగిన ఓ సర్వేలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డైవర్స్ తీసుకోవడం అంత ఈజీ కాదన్న కారణంగా సహజీవనానికే ఓటు వేసిన అనేక జంటలు ఇకపై పెళ్లిళ్లకు మొగ్గు చూపే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది. సర్వేలో పాల్గొన్న జంటల్లో ఏకంగా.. 32 శాతం తాము ఏ భయాలు లేకుండా పెళ్లివైపు అడుగులు వేస్తామని చెప్పాయట. మరోవైపు.. డైవర్స్ కేసులతో కొన్నేళ్లుగా సతమతమవుతున్న జంటలు ఇకపై పెద్ద సంఖ్యలో ఈ చట్టం కింద విడాకులకు దరఖాస్తు చేసుకుంటాయని కూడా అక్కడి పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  


అయితే. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. నో ఫాల్ట్ చట్టం ద్వారా..భాగస్వాములు ఏ కారణం లేకుండానే  వివాహాన్ని తెగదెంపులు చేసుకునే అవకాశం ఉందని కొందరు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా.. విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా లేని వారికి..తమ వాదన వినిపించే ఛాన్స్ లేకుండా పోయిందనేది మరో ప్రధాన ఆరోపణ. నో ఫాల్ట్ చట్టం ప్రకారం విడాకులకు దరఖాస్తు చేసుకున్న వారు తమ నిర్ణయాన్ని సమీక్షించుకునేందుకు వీలుగా 20 వారాలు సమయం ఉంటుంది. చట్ట ప్రకారం.. ఈ వెయిటింగ్ పీరియడ్ తప్పనిసరి. ఆ తరువాతే విడాకులకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీంతో.. ఈ చట్టం దుర్వినియోగమయ్యేందుకు అవకాశాలు తగ్గుతాయని అక్కడి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో బ్రిటన్‌లో భాగమైన నార్తన్ ఐర్లాండ్‌లోనూ ‘నో ఫాల్ట్’ తరహా చట్టం తీసుకుని రావాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. 


Updated Date - 2022-04-07T23:46:31+05:30 IST