ఏం లాభం నాయకా?

ABN , First Publish Date - 2022-08-01T08:39:39+05:30 IST

‘‘కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. కానీ... ఇది చాలదు. దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలంటే మరింత ఆదుకోవాలి. విరివిగా నిధులు

ఏం లాభం నాయకా?

రాష్ట్రానికి సాధిస్తున్నదేమిటి?

స్వార్థం, కేసుల భయంతో సాగిలపాటు!

రాష్ట్ర ప్రయోజనాలపై మౌనం

సొంత లాభం, భద్రతే ముఖ్యమనే

రీతిలో కేంద్రానికి లొంగుబాటు

అప్పులు దక్కితే చాలనే వైఖరి

తనకు అవసరమైన పనులు మాత్రం దగ్గరుండి చేయించుకునే జగన్‌

శ్రీలక్ష్మికి స్టేట్‌ కేడర్‌, సమీర్‌ శర్మకు అసాధారణ పొడిగింపులు

రైల్వే జోన్‌, పోలవరం, హోదాపై కేంద్రాన్ని అడగని వైనం


‘‘నా భవిష్యత్తు భద్రంగా ఉండాలి! వ్యక్తిగత లబ్ధి మాత్రమే చేకూర్చుతూ... మళ్లీ అధికారంలోకి రావాలి. నాకూ, నా వర్గానికీ అవసరమైన పనులు మాత్రం జరిగితే చాలు’’

..కేంద్రంతో సంబంధాలు, పనులు నెరవేర్చుకునే విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ వైఖరి ఇదేనా?


‘‘అప్పులకు కేంద్ర ప్రభుత్వం విరివిగా అనుమతులిస్తే చాలు! తప్పుడు అప్పులపై గట్టిగా నిలదీయకుండా ఉంటే చాలు! రాష్ట్రానికి కేంద్రం అంతకుమించి చేయాల్సిన అవసరమే లేదు!’’

..రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో జగన్‌ అనుసరించే విధానం ఇదేనా?


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. కానీ... ఇది చాలదు. దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలంటే మరింత ఆదుకోవాలి. విరివిగా నిధులు అందించాలి’’... ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ చంద్రబాబు నోట ఇదే మాట! వేదిక ఏదైనా, కేంద్ర పెద్దలను ఎవరిని కలిసినా పదేపదే ఇదే చెప్పేవారు. గరిష్ఠ స్థాయిలో కేంద్ర సాయం పొందారు. ఇప్పుడే కాదు... వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడూ అన్ని రకాల వెసులుబాట్లు, సంబంధాలు ఉపయోగించుకుని రాష్ట్రానికి లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నించారు. మరి... ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏం చేస్తున్నారు? రాష్ట్రానికి ఏం తీసుకొస్తున్నారు? ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేయించారు? పెండింగ్‌లో ఉన్న విభజన హామీలు ఎన్ని సాధించారు? వీటి గురించి విన్నవించుకున్నారా? అడిగారా? పోరాడారా?... ఈ ప్రశ్నల్లో దేనికీ సమాధానం లభించదు. ఎందుకంటే... రాష్ట్రానికి లబ్ధి చేకూర్చే పనులపై ఆయనకు ఆసక్తి లేదు. తనను మళ్లీ అధికారంలోకి కూర్చోబెడుతుందని భావిస్తున్న ‘బటన్‌ నొక్కుడు’కు అవసరమైన అప్పులకు అనుమతులకు మాత్రమే ఆయన ప్రయత్నిస్తున్నారు. అయినా సరే... ‘కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం’ అని చెప్పగలగడం ఆయనకు మాత్రమే చెల్లింది!


 ఎందుకంత భయం?

జగన్‌ బలహీనమైన నాయకుడు కాదు. ఆయన పార్టీకి 22 మంది ఎంపీలున్నారు. 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో జగన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడం కుదిరే పని కాదు. మరి... కేంద్ర ప్రభుత్వమంటే జగన్‌కు ఎందుకంత భయం? దీనికి బహిరంగంగా కనిపిస్తున్న కారణం... ఆయనపై ఉన్న కేసులే! తమను ప్రశ్నించినా, వ్యతిరేకించినా బీజేపీ సహించదు. ఏమాత్రం సంకోచం లేకుండా సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తోంది. జగన్‌పై కొత్తగా దర్యాప్తు సంస్థలను ప్రయోగించాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటికే ఆయనపై కేసులున్నాయి. బెయిలుపై ఉన్నారు. కేంద్రం కొంచెం ‘టైట్‌’ చేస్తే మళ్లీ జగన్‌కు కష్టాలు తప్పవు. ఈ విషయంపై ఆయనకు పూర్తి స్పష్టత ఉందని... అందుకే కేంద్ర పెద్దలతో పూర్తిస్థాయి సామరస్యంగా ఉండటంతోపాటు, రాష్ట్ర ప్రయోజనాల గురించి గట్టిగా అడగటంలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ అనేకసార్లు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలతో వినతిపత్రం ఇచ్చారని అధికారులు మీడియాకు ‘లీక్‌’ ఇస్తారు. అంతేతప్ప... జగన్‌ ఏ ఒక్కసారీ మీడియా ముందుకు రాలేదు. కేంద్రంపై ఒత్తిడి తేలేదు.


 తన పనులు జరిగితే చాలు...

కేంద్రం వద్ద జగన్‌ ఏమీ సాధించుకోలేరని, ఆయన మాటను కేంద్రం పట్టించుకోదని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. రాష్ట్రానికి మేలు చేసేవి కాకుండా... తనకు, తన వర్గానికి అవసరమైన అనేక పనులకు జగన్‌ బతిమాలో బామాలో చేయించుకుంటున్నారు. ఉదాహరణకు... తెలంగాణ కేడర్‌లో ఉన్న శ్రీలక్ష్మిని ఏపీకి రప్పించేందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు.


తనతోపాటు స్వయంగా పీఎంవోకు తీసుకెళ్లారు. ‘క్యాట్‌’లో అభ్యంతరాలున్నా... కేంద్రం అండతో ఆమెను రాష్ట్రంలోకి తీసుకున్నారు. ఇక... చీఫ్‌ సెక్రటరీలు రిటైరైతే మూడునెలలకోసారి చొప్పున గరిష్ఠంగా రెండుసార్లు (మొత్తం ఆరు నెలలు) మాత్రమే పొడిగింపు ఇవ్వడం సహజం. కానీ... సమీర్‌ శర్మకు ఒకసారి ఆరు నెలలు, మరోసారీ ఒకే విడతలో ఆరునెలలు... మొత్తం ఏడాదిపాటు ఎక్స్‌టెన్షన్‌ పొందారు. జగన్‌ అడగ్గానే కేంద్రం అన్ని నిబంధనలు, సంప్రదాయాలు పక్కన పెట్టి మరీ చేసింది. ఇక... టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సర్వీస్‌ పొడిగింపూ అంతే. ఇదొక్కటే కాదు! జగన్‌ తనకు, తన వాళ్లకు అవసరమైన అనేక పనులను కేంద్రంతో చేయించుకుంటున్నారు. ‘ఎలాగూ రాష్ట్రం గురించి అడగరు. మనకు తలనొప్పులు తీసుకురారు. ఈ పనులైనా చేసి పెడదాంలే’ అన్నట్లుగా కేంద్రం కూడా జగన్‌కు సహకరిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


 ఏమిటి లాభం?

కేంద్రం ఏమైనా ఇవ్వాలనుకున్నా... ఒక్కోసారి బ్యూరోక్రాట్ల స్థాయిలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అందుకే... చంద్రబాబు ఒక అడుగు కిందికి  దిగి, కేంద్ర మంత్రులతోపాటు ఆ శాఖల కార్యదర్శులతో కూడా సమావేశమయ్యేవారు. కేంద్ర అధికారులతో మంచి సంబంధాలున్న రాష్ట్ర కేడర్‌ అధికారులనూ ఢిల్లీకి పంపించేవారు. కానీ... ఇప్పుడు ఆ పరిస్థితే లేదు. ఇప్పుడూ కేంద్ర అధికారులతో పరిచయాలున్న అధికారులు రాష్ట్రంలో ఉన్నారు.


కానీ... జగన్‌ వారిని అప్పులకు అనుమతి సాధించేందుకు, తనకు సంబంధించిన విషయాలను చక్కదిద్దేందుకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారనే విమర్శలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ దీర్ఘకాలంపాటు కేంద్ర సర్వీసుల్లో పని చేశారు. కేంద్ర అధికారులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. వాటిని ఉపయోగించుకుని రాష్ట్రానికి మేలు చేస్తుంటే... ఏడాది కాదుకదా, రెండేళ్లు పొడిగింపు ఇచ్చినా నష్టం లేదు. కానీ... సమీర్‌ శర్మ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో తన పరిచయాలను ఉపయోగించిన దాఖలాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి చూసి కేంద్ర అధికారులే విస్తుపోతున్నారు. ‘మీదేం రాష్ట్రం. మీకు రాష్ట్ర ప్రయోజనాలు పడుతున్నాయా?’ అని రాష్ట్ర అధికారుల ముందు ఈసడించుకుంటున్నారు.


 


ఇచ్చినా... ఇవ్వకున్నా మౌనం!

కేంద్ర అన్నీ ఈజీగా ఇచ్చేయదు. రాష్ట్రం అడగాలి. విడవకుండా అడిగినందుకే రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న సంస్థలు రాష్ట్రానికి వచ్చాయి. రావాల్సినవి, పూర్తి కావాల్సినవి ఇంకా ఉన్నాయి. ఈ మూడేళ్లలో జగన్‌ వాటి గురించి పట్టించుకున్నదే లేదు. కేంద్రాన్ని గట్టిగా అడిగిందీ లేదు. ఉదాహరణకు... విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం ఎన్ని మెలికలు పెడుతున్నా స్పందించడం లేదు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే... మంగళగిరిలో ‘ఎయిమ్స్‌’ ఏర్పాటైంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ సంస్థ ఇప్పటికీ ‘ఔట్‌ పేషంట్‌’ సేవలకు మాత్రమే పరిమితమైంది. అవసరమైన  వైద్య నిపుణులను కేటాయించి, మౌలిక సదుపాయాలు కల్పిస్తే సంక్లిష్టమైన శస్త్ర చికిత్సలు, ఇన్‌పేషంట్‌ సేవలూ అందుతాయి. దీని గురించి కేంద్రాన్ని జగన్‌ అడగడమే లేదు. పోలవరం, ప్రత్యేక హోదా సంగతి సరేసరి! అన్నీ వదిలేసినప్పటికీ... ‘కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం. పోరాడుతున్నాం’ అని జగన్‌ చెప్పుకోవడం విశేషం.


అవన్నీ అక్కర్లేదంటూ... 

కేంద్రం నుంచి కొన్ని పథకాలు ఆటోమేటిక్‌గా రాష్ట్రానికి వచ్చేస్తాయి. మరికొన్ని అడిగి సాధించుకోవాలి. గతంలో చంద్రబాబు ఈ పథకాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేవారు. ఇప్పుడు అధికారులెవరైనా జగన్‌ను కలిసి... ‘ఫలానా పథకం కింద కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశముంది. మనం ఒకసారి అడుగుదాం’ అని సూచించినా ప్రయోజనం దక్కడంలేదు. ‘అవన్నీ వదిలేయండి. మనకు అక్కర్లేదు’ అని జగన్‌ చెబుతున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-08-01T08:39:39+05:30 IST