రక్షకుడే దొంగయితే...

ABN , First Publish Date - 2020-11-06T05:30:00+05:30 IST

ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును ప్రజా సంక్షేమానికి ఉపయోగించడం రాజులు చెయ్యాల్సిన పని. తమ విలాసాల కోసం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే రాజుల చరిత్ర చివరకు దుర్భరంగా ముగిసింది. కొందరు రాజులే దొంగలుగా మారి కోశాగారాన్ని కొల్లగొట్టిన చరిత్రలూ...

రక్షకుడే దొంగయితే...

ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును ప్రజా సంక్షేమానికి ఉపయోగించడం రాజులు చెయ్యాల్సిన పని. తమ విలాసాల కోసం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే రాజుల చరిత్ర చివరకు దుర్భరంగా ముగిసింది. కొందరు రాజులే దొంగలుగా మారి కోశాగారాన్ని కొల్లగొట్టిన చరిత్రలూ ఉన్నాయి. ఎవరైతే కాపాడాలో, ఎక్కడైతే అభయం దొరకాలో అక్కడే మోసం జరిగితే.. ప్రజలు ఇంకెవరికి చెప్పుకోవాలి? ప్రజల సొమ్మును దొంగిలించే మోసగాడైన ఒక రాజును తెలివిగా పట్టిచ్చిన వ్యక్తి కథ ఇది. 


పూర్వం వారణాసిని పాలించే శ్రుతకీర్తి అనే రాజు కపటి. అతని ఆస్థాన పురోహితుడు మరింత కుయుక్తులతో ఉండేవాడు. వారిద్దరూ ఒకరికొకరు తోడయ్యారు. మంత్రి మంచివాడే. కానీ వారిద్దరినీ వారించే శక్తి ఆయనకు లేదు.

ఆ రోజుల్లో బోధిసత్త్వుడు అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఒక యక్షిణి వల్ల కొన్ని ప్రత్యేక శక్తులు వచ్చాయి. నేల మీది అడుగుజాడలనే కాదు, నీటి మీద, గాలిలో సైతం అడుగు జాడలను కూడా అతడు గుర్తించగలడు. అలాంటి వ్యక్తి తమ రాజ్యానికి అవసరమని మంత్రి గ్రహించి, బోధిసత్త్వుణ్ణి రాజు కొలువులో చేర్చాడు. రాజభవనానికి రక్షకునిగా నియమించాడు.

గతంలో రక్షకులుగా ఉన్నవారిని రాజు, పురోహితుడు లోబరుచుకొని, వారికి కోరినంత ముట్టజెప్పేవారు. పురోహితుడు, రాజు కలిసి కోశాగారాన్ని దోచుకొనేవారు. మర్నాడు దొంగలు పడ్డారని చాటింపు వేసేవారు. ఇదంతా దొంగల పనే అని ప్రజలను నమ్మించేవారు. కానీ పురోహితుడికి బోధిసత్త్వుడు లొంగలేదు. దాంతో రాజూ, పురోహితుడూ మారువేషాల్లో బయలుదేరి, నిచ్చెనల మీద గోడలు ఎక్కి వెళ్ళి, కోశాగారంలో ప్రవేశించారు. వచ్చేటప్పుడు పుష్కరణిలో దిగి, తిరిగి రాజభవనంలోకి చేరుకున్నారు.

మర్నాడు ‘కోశాగారంలో దొంగలు పడి దోచుకుపోయారు’ అనే వార్త పుట్టింది. రాజు సభ తీర్చాడు. కొత్తగా నియమితుడైన బోధిసత్త్వుణ్ణి పిలిపించి -

‘‘నీవు రక్షకుడివి కదా! నీ ప్రతిభ తెలుసుకొనే ఈ ఉద్యోగంలో నియమించాం. దొంగల ఆచూకీ రేపటిలోగా తేలాలి. లేదంటే నీ మీద చర్యలు తీసుకుంటాం. కోట నీ రక్షణలో ఉంది కాబట్టి నేరం నువ్వే మొయ్యాలి’’ అని గద్దించి మరీ చెప్పాడు. 

‘‘మహారాజా! అలాగే!’’ అన్నాడు బోధిసత్త్వుడు.

మరునాడు రాజు సమావేశం ఏర్పాటు చేసి - ‘‘రక్షకుడా! తేలిందా?’’ అని అడిగాడు.

‘‘ప్రభూ! తేలింది. అయితే... దొంగ ఎవరో నేను నేరుగా చెప్పలేను. నేను చెపేఁదాన్ని బట్టి తమరు గ్రహించాలి’’ అంటూ బోధిసత్త్వుడు ఇలా చెప్పాడు -

‘‘మహారాజా! ఒకడు బరువును ఎత్తుకొని, నీటిలో దిగి మునిగిపోతూ ‘దాహం తీర్చి ప్రాణాలను నిలపాల్సిన నీరే నా ప్రాణాలు తీస్తోంది. అభయం ఇవ్వవలసిన చోటే భయం పుట్టింది’ అన్నాడు. ప్రతిరోజూ మట్టి తవ్వి, దానితో కుండలు చేసుకొని బ్రతికే వ్యక్తి ఒక రోజున మట్టిపెళ్ళలు విరిగి పడి, మరణావస్థకు చేరి, ‘నాకు ఇన్నాళ్ళూ కూడు పెట్టి పోషించిన మట్టే ఈనాడు ప్రాణాలు తీస్తోంది’ అన్నాడు. అలాగే మహారాజా! అడవిలో ఒక చెట్టు ఉంది. దాని మీద ఎన్నో పక్షులు జీవిస్తున్నాయి. ఒక రోజున గాలికి దాని కొమ్మలు రాసుకొని నిప్పు పుట్టింది. మంటలు లేచాయి. చెట్టు అంటుకుంది. ఎన్నో పక్షులు మరణించాయి. అందులో ఒక పక్షి- ‘ఇన్నాళ్ళూ మాకు ఆవాసంగా నిలిచి, నీడనిచ్చి రక్షించిన వృక్షమే ఈ రోజు మమ్మల్ని నాశనం చేస్తోంది. రక్షణ ఇచ్చిన తావులోనే భయం పుట్టింది’ అంది. రాజా! ఈ దొంగతనం కూడా అలాంటిదే! ఇద్దరు దొంగలు అంతఃపురంలోని మీ గది నుంచే బయలుదేరారు. నిచ్చెన మీద నుంచి గోడ ఎక్కి దూకారు. కోశాగారాన్ని కొల్లగొట్టారు. కొంత సొమ్ము పుష్కరణిలో దాచారు. మరికొంత సొమ్ము మీ మందిరంలో... మీ మంచం కిందే దాచారు’’ అన్నాడు.

బోధిసత్త్వుడి మాటలు విన్న వెంటనే రాజు ఆగ్రహంతో అరిచాడు. కానీ లోపల భయపడ్డాడు. 

మంత్రి వెంటనే సేనలను పంపి వెతికించాడు. సంపద దొరికింది.

‘‘రాజా! రక్షించవలసిన వారే భక్షించడం అంటే ఇదే! అభయం ఇవ్వాల్సిన మీ వల్లే రాజ్యానికి భయం కలిగింది. మీలాంటి వారు ప్రజాపాలకులుగా ఉండతగరు. ఇన్నాళ్ళూ ప్రజలను పీడించుకుతిన్నారు. ఇక మీ పాలన అవసరం లేదు’’ అన్నాడు బోధిసత్త్వుడు.

రాజు మీద ప్రజలు తిరుగుబాటు చేశారు. ధార్మికుడైన మంత్రికీ, మంత్రిమండలికీ పాలనా అధికారాలు అప్పగించారు.

‘రక్షకులు రక్షకులుగా ఉంటేనే ప్రజలకూ, ప్రభుత్వాలకూ రక్ష’ అని బుద్ధుడు చెప్పిన గొప్ప సందేశాత్మకమైన కథ ఇది.

- బొర్రా గోవర్ధన్‌


Updated Date - 2020-11-06T05:30:00+05:30 IST