నూనెలను కలిపి వాడితే?

ABN , First Publish Date - 2022-08-20T05:33:09+05:30 IST

సాధారణంగా మనం ఏదో ఒకే రకమైన వంట నూనెనే వాడుతూ ఉంటాం. కానీ ఒక్కో వంట నూనెలో ఒక్కో రకమైన పోషకాలుంటాయి. మరి అన్ని రకాల పోషకాలు పొందాలంటే ఏం చేయాలి? రెండు రకాల నూనెలను కలిపి వాడాలి. ఈసారి వంటల్లో ఈ టెక్నిక్‌ ఫాలో కండి.

నూనెలను కలిపి వాడితే?

సాధారణంగా మనం ఏదో ఒకే రకమైన వంట నూనెనే వాడుతూ ఉంటాం. కానీ ఒక్కో వంట నూనెలో ఒక్కో రకమైన పోషకాలుంటాయి. మరి అన్ని రకాల పోషకాలు పొందాలంటే ఏం చేయాలి? రెండు రకాల నూనెలను కలిపి వాడాలి. ఈసారి వంటల్లో ఈ టెక్నిక్‌ ఫాలో కండి.


స్మోకింగ్‌ పాయింట్‌: ఒక్కో నూనెకు ఒక్కో స్మోకింగ్‌ పాయింట్‌ ఉంటుంది. కాబట్టి ఏ రెండు నూనెలను కలపాలనుకున్నా రెండిటి స్మోకింగ్‌ పాయింట్‌ దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇలా కలిపి వాడే నూనెలను డీప్‌ ఫ్రైలకే వాడటం మంచిది.


తత్వాలు, పోషకాలు: ఒక్కో నూనె తత్వం, దాన్లోని పోషకాలు వేర్వేరుగా ఉంటాయి. అవసరానికి మించి వేడిచేస్తే కొన్ని నూనెల్లోని పోషకాలు నశించవచ్చు. కొన్ని నూనెలు పలచగా ఉండే పామాయిల్‌లాంటి నూనెలు గది ఉష్ణోగ్రత వద్ద ఘన రూపంలో ఉండొచ్చు. కాబట్టి వంట నూనెలను కలిపేటప్పుడు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 


రుచుల్లో తేడాలు: ఒక్కో నూనెకు ఓ ప్రత్యేకమైన రుచి ఉంటుంది. రెండు నూనెల్ని కలిపినప్పుడు రుచుల్లో తేడా రావొచ్చు. ఆశించిన పరిమళం వంటకాలకు అబ్బకపోవచ్చు. కాబట్టి వాడే నూనెల రుచుల మీద అవగాహన ఏర్పరుచుకుని ఆ తర్వాతే కలిపి వండాలి.


కొబ్బరి నూనె + ఆలివ్‌ ఆయిల్‌: కొబ్బరి నూనె, ఆలివ్‌ ఆయిల్‌....ఈ రెండు నూనెల్లో పోషకాలకు కొదవ లేదు. రెండిటిలోని పోషకాలు సొంతమవ్వాలంటే రెండిటిని సమపాళ్లలో కలపాలి. మొదట తక్కువ మొత్తంలో కలుపుకుని సీసాలో నిల్వ చేసుకుని వాడి చూడాలి. రుచి నచ్చితే అలాగే కంటిన్యూ చేయొచ్చు.


ఆవ నూనె + నువ్వుల నూనె: ఆవ నూనె ఘాటుగా ఉంటుంది. నేరుగా వాడలేం కాబట్టి దీన్ని నువ్వుల నూనెతో కలిపి వాడొచ్చు. కూరలు, పచ్చళ్లకు ఈ నూనెలు అనుకూలమైనవి.


వేరుశనగ నూనె + సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌: వేరుశనగ నూనెలో కొవ్వులు అధికం. అలాగని ఆ నూనె అందించే రుచిని పూర్తిగా వదులుకోలేం. అందుకే ఈ నూనెను పొద్దుతిరుగుడు నూనెతో కలిపి వాడుకుంటే కొంతలో కొంత మేలు జరుగుతుంది. 


రైస్‌ బ్రాన్‌ + అవిసె నూనె: అవిసె నూనె వాడటం మొదటిసారైతే ఈ నూనెను రైస్‌బ్రాన్‌తో కలిపి వాడటం మేలు. ఈ రెండు నూనెలను కలిపి వాడటం వల్ల కూరలకు కొత్త రుచితోపాటు రుచి కూడా తోడవుతుంది.


ఇలా కలపాలి: కలపాలనుకున్న నూనెలను గిన్నెలో వేసి బాగా గిలక్కొట్టాలి. తర్వాత సీసాలో నింపి గాలి చొరబడకుండా మూత బిగించాలి. ఇలా తయారుచేసి పెట్టుకున్న నూనె సీసాను ఉపయోగించబోయే ప్రతిసారీ బాగా కుదపాలి. అలాగే ఎక్కువ కాలంపాటు కదపకుండా ఉంచితే సీసాలోని నూనెలు వేరవుతాయి. కాబట్టి తరచుగా సీసాను కదిలిస్తూ ఉండటం మంచిది.

Updated Date - 2022-08-20T05:33:09+05:30 IST