రోజుకు 5వేల పరీక్షలు ఏమైనయ్‌?

ABN , First Publish Date - 2020-05-29T09:44:15+05:30 IST

‘‘మరో రెండు వారాల్లో రోజుకు 5 వేల కరోనా టెస్టులు చేస్తామంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఏప్రిల్‌ చివరిలో చెప్పారు. అది ఏమైంది? ప్రస్తుతం దేశంలోనే తక్కువగా తెలంగాణలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి’’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పాజిటివ్‌ కేసుల సంఖ్యను తక్కువగా చూపడానికే టెస్టులు తక్కువగా చేస్తున్నారని

రోజుకు 5వేల పరీక్షలు ఏమైనయ్‌?

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): ‘‘మరో రెండు వారాల్లో రోజుకు 5 వేల కరోనా టెస్టులు చేస్తామంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఏప్రిల్‌ చివరిలో చెప్పారు. అది ఏమైంది? ప్రస్తుతం దేశంలోనే తక్కువగా తెలంగాణలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి’’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పాజిటివ్‌ కేసుల సంఖ్యను తక్కువగా చూపడానికే టెస్టులు తక్కువగా చేస్తున్నారని ఆరోపించారు. ప్రమాదకరమైన వైఖరితో ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఒడిసా వలస కార్మికులతో గురువారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ సమావేశమయ్యారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వారిని సొంత ఊరికి పంపేందుకు ఏర్పాటు చేసిన బస్సును ఉత్తమ్‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారినీ ఇతర కారణాల వల్లనే మరణించినట్లుగా చూపుతున్నారని కొందరు డాక్టర్లు ఆరోపించారన్నారు. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షల మందికి పరీక్షలు చేస్తే, తెలంగాణలో ఆ సంఖ్య 24వేలు మాత్రమేనని అన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు. వాస్తవాలు బయటికి రావద్దనే విధంగా సీఎం కేసీఆర్‌ ధోరణి ఉందని, ఇది సరైంది కాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరీక్షల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ధాన్యం సేకరణలోనూ ప్రభుత్వం విఫలమైందని ఉత్తమ్‌ ఆరోపించారు. కాగా.. ప్రతి పేద కుటుంబానికి నేరుగా రూ.10 వేలు సాయం, ఆరు నెలల పాటు నెలకు రూ.7,500 చొప్పున వితరణ, ఉపాధి పనిదినాలు 2 వందలకు పెంపు వంటి కార్యక్రమాలు చేపట్టాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏఐసీసీ చేపట్టిన ఆన్‌లైన్‌ పోరాటంలో తెలంగాణ నేతలు సైతం పాలు పంచుకున్నారు. ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కుసుమ్‌కుమార్‌, దామోదర రాజనర్సింహ తదితరులు రికార్డు చేసిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

Updated Date - 2020-05-29T09:44:15+05:30 IST